https://oktelugu.com/

Corporate Education Mafia: నారాయణ నారాయణ.. అధ్యాపకులతో ఈ పనేంటయ్యా? 

Corporate Education Mafia:‘బతకలేక బడిపంతులు’ అని ఒకప్పుడు అనేవారు.. ఇప్పుడూ అదే అనాల్సిన పరిస్థితులు దాపురించాయి. ప్రభుత్వ ఉపాధ్యాయుల సంగతి పక్కనపెడితే ప్రైవేటు ఉపాధ్యాయుల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ప్రైవేటు యాజమాన్యాల చేతిలో చితికి శల్యమవుతున్నాయి. జీతం కోసం ఎలాంటి దుర్భరమైన పనులైనా చేయాల్సిన కర్మ వారికి పడుతోంది. టీచర్లు, అధ్యాపకులతో ప్రైవేటు విద్యాసంస్థలు బోధన నుంచి మొదలుపెడితే విద్యార్థుల అడ్మిషన్ చేయించేవరకూ ఇంటింటికి తిరిగి పిల్లవాడిని బడికి తీసుకొచ్చే బాధ్యతలు కూడా అప్పగిస్తున్నారు. తల్లిదండ్రులను […]

Written By:
  • NARESH
  • , Updated On : April 4, 2022 / 07:35 PM IST
    Follow us on

    Corporate Education Mafia:‘బతకలేక బడిపంతులు’ అని ఒకప్పుడు అనేవారు.. ఇప్పుడూ అదే అనాల్సిన పరిస్థితులు దాపురించాయి. ప్రభుత్వ ఉపాధ్యాయుల సంగతి పక్కనపెడితే ప్రైవేటు ఉపాధ్యాయుల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ప్రైవేటు యాజమాన్యాల చేతిలో చితికి శల్యమవుతున్నాయి. జీతం కోసం ఎలాంటి దుర్భరమైన పనులైనా చేయాల్సిన కర్మ వారికి పడుతోంది. టీచర్లు, అధ్యాపకులతో ప్రైవేటు విద్యాసంస్థలు బోధన నుంచి మొదలుపెడితే విద్యార్థుల అడ్మిషన్ చేయించేవరకూ ఇంటింటికి తిరిగి పిల్లవాడిని బడికి తీసుకొచ్చే బాధ్యతలు కూడా అప్పగిస్తున్నారు. తల్లిదండ్రులను ఒప్పించి మెప్పించి ఫీజుల వసూలు బాధ్యత కూడా ఉపాధ్యాయులదే. ఇంతచేస్తే వాళ్లకు ఇచ్చే జీతం పదివేలు దాటదు. ఆ రెక్కాడితే కానీ డొక్కాడని జీతం కోసం పరువు పోయే పనులెన్నో చేస్తున్నారు మన టీచర్లు.. అధ్యాపకులు.. వారి గోస చూసి.. వారి ఆవేదన చూసి ఇప్పుడంతా ‘అయ్యో పాపం’ అనడం తప్పా వేరే ఏం చేయలేని నిస్సహాయ స్థితి నెలకొంది.

    -కార్పొరేట్ విద్యా ‘మాఫియా’
    తెలుగు రాష్ట్రాల్లో విద్య అనేది మాఫియాగా మారింది. ముఖ్యంగా కార్పొరేట్ విద్యాసంస్థల కబంధ హస్తాల్లో చిక్కి శల్యమవుతోంది. మర్రి చెట్టు కింద మొక్క మొలవని చందంగా రాష్ట్రవ్యాప్తంగా చిన్న సామాన్య పాఠశాలలు, కళశాలల యాజమాన్య భవితవ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు రంగం సిద్ధం చేసింది. మొత్తం విద్యా వ్యాపారంగా మార్చేసి లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ‘టెక్నోలు’, సీబీఎస్ఈలు, గురుకులాలు, లీడ్ అంటూ వివిధ పేర్లు జోడించి తల్లిదండ్రులకు మాయ చేసి లక్షల్లో ఫీజులు గుంజుతున్నాయి.

    -అధ్యాపకులకు జీతాలు గగనమే?
    ఇక పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు డబ్బా కొట్టుకుంటూ అందులో పనిచేసే టీచర్లు, అధ్యాపకులకు కనీస వేతనాలు కూడా చెల్లించడం లేదన్న ఆరోపణలున్నాయి. ప్రావీణ్యం లేని వారితోనూ బోధిస్తున్నారన్న విమర్శలున్నాయి. కనీసం 10వేలు కూడా ఇవ్వకుండా వారిని శ్రమదోపిడీ చేస్తున్నారు. ఇక బోధన మాత్రమే కాదు.. వారితో అడ్డమైన చాకిరీ చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఇంత చేస్తున్నా వారికి ఇవ్వాల్సిన కనీస వేతనాలు లేవు. ఈ విషయంలో ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఎదురిస్తే జాబ్ లోంచి తీసేస్తారని చాలా మంది మౌనంగా భరిస్తున్నారు. ఈ టార్చర్ తట్టుకోలేక కొందరైతే ఉద్యోగాల్లోంచే వైదొలిగి వేరే ఫీల్డ్ లోకి వెళ్లిపోతున్నారు. కొందరు వ్యవసాయం చేసుకుంటున్నారు.

    -అధ్యాపకులతో గొడ్డు చాకిరీ?
    కళాశాలల్లో విద్యార్థులను చేర్చుకునేందుకు అధ్యాపకులనే యాజమాన్యాలు వాడుతున్నాయి.. వారికి టార్గెట్ పెట్టి ఒక్కొక్కరూ ఇంత మందిని చేర్పించాలని కండీషన్ పెడుతున్నారు. అలా చేరిపిస్తేనే ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తున్నారు. అంతేకాదు.. ఇంటింటికి తిరిగినట్టు వారి ఇంటి ముందు సెల్ఫీలు వాట్సాప్ గ్రూప్ లో పెట్టాలని హుకూం జారీ చేస్తున్నారు. దీంతో కళాశాలల్లో విద్యార్థులను చేర్చుకునేందుకు అధ్యాపకులు ఊరువాడ, గల్లీలు తిరుగుతున్నారు. చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి పాఠశాలల్లో అడ్మిషన్లు చేసుకుంటున్నారు. కొందరు తల్లిదండ్రులు అయితే మీరిచ్చే తాయిలాలు, ఫీజు రాయితీలు మాకు అవసరం లేదు అని చెప్పినప్పటికీ స్కూల్ యాజమాన్యాలు, అధ్యాయపకులు వారిని వదలకుండా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. చుట్టుపక్కల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు సంపాదిస్తూ వారితో ఫోన్లు చేసి మరీ విసిగిస్తున్నారు.

    -పూర్తిగా ఫీజు కట్టినా ఎక్స్ ట్రా ఫీజుల వసూలు బాధ్యత టీచర్లదే.?
    పాఠశాల/కళాశాల ఒరిజినల్ ఫీజు, కమిట్మెంట్ ఫీజు వేర్వేరుగా ఉంటాయి. పూర్తిగా ఫీజు చెల్లించే సమయానికి ఈ కమిట్ మెంట్ ఫీజు రేటును పెంచేస్తున్నారు. జాయినింగ్ టైంలో వ్యక్తి సంవత్సరాంతమున రిటర్న్ ఫీజు చెల్లించే సమయానికి ఉండదు. టీచర్లు/అధ్యాపకులు గతంలో ఏం చెప్పారో మాకు తెలియదని.. ఇప్పుడు మేం చెప్పినంత కట్టాలని యాజమాన్యాలు తల్లిదండ్రులకు హుకూం జారీ చేస్తారు. దీంతో తల్లిదండ్రులు ఆ రోజు వచ్చిన టీచర్లను పట్టుకొని నానా తిట్లు, దాడులకు దిగుతున్న పరిస్థితి నెలకొంది. ఇక పెండింగ్ ఫీజుల వసూళ్లను టీచర్లపై పెట్టి విద్యార్థులపై ఒత్తిడి తెచ్చే బాధ్యతలు పెడుతున్నారు. ఇక విద్యార్థులకు పుస్తకాలు అమ్మే బాధ్యతను కూడా టీచర్లపైనే పెడుతున్నారు. ఒక్కో విద్యార్థికి రూ.6వేల నుంచి 7500 వరకూ పుస్తకాలను అమ్మిస్తున్నారు. ఆ పుస్తకాల విలువ పట్టుమని రూ.1000 ఉండదు. అయినా వాటిని టీచర్ల చేతనే బలవంతంగా అమ్మిస్తున్నారు.

    ఇలా విద్యార్థి చేరికల నుంచి వారిని, వారి తల్లిదండ్రులను పీల్చిపిప్పి చేసేవరకూ అధ్యాపకులను మధ్యలో పావులుగా యాజమాన్యాలు వాడుకుంటున్నాయి. ఆఖరకు వాళ్లకు కనీస వేతనాలు ఇవ్వడం లేదు. ఈ గొడ్డు చాకిరీ తట్టుకోలేక చాలా మంది సోషల్ మీడియాలో తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. వారి కష్టాలు చూసి ఇప్పుడు వారి బాధను ఈ సమాజానికి తెలుపాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.