https://oktelugu.com/

పొంచి ఉన్న ఆర్థిక మాంద్యం ముప్పు

ఇటీవల కాలంలో ఎన్నడూ ఎరుగని రీతిలో దేశ ఆర్ధిక వ్యవస్థ చతికలబడుతున్నది. ఏ రంగంలో కూడా చెప్పుకోదగిన ఆశాజనక వాతావరణం కనబడటం లేదు. అయినా నరేంద్ర మోదీ ప్రభుత్వం మొక్కుబడి చర్యలు తప్పా తగు విధంగా దృష్టి కేంద్రీకరించిన దాఖలాలు కనిపించడం లేదు. ప్రముఖ ఆర్ధిక వేత్త సుబ్రమణియన్ స్వామి మాటలలో చెప్పాలి అంటే ఆర్ధిక వయ్వహారాల గురించి తగు అవగాహన ఉన్నవారెవ్వరు ఈ ప్రభుత్వంలో ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ పరిస్థితికి తోడు కరోనా వైరస్‌ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : March 18, 2020 / 09:53 AM IST
    Follow us on

    ఇటీవల కాలంలో ఎన్నడూ ఎరుగని రీతిలో దేశ ఆర్ధిక వ్యవస్థ చతికలబడుతున్నది. ఏ రంగంలో కూడా చెప్పుకోదగిన ఆశాజనక వాతావరణం కనబడటం లేదు. అయినా నరేంద్ర మోదీ ప్రభుత్వం మొక్కుబడి చర్యలు తప్పా తగు విధంగా దృష్టి కేంద్రీకరించిన దాఖలాలు కనిపించడం లేదు. ప్రముఖ ఆర్ధిక వేత్త సుబ్రమణియన్ స్వామి మాటలలో చెప్పాలి అంటే ఆర్ధిక వయ్వహారాల గురించి తగు అవగాహన ఉన్నవారెవ్వరు ఈ ప్రభుత్వంలో ఉన్నట్లు కనిపించడం లేదు.

    ఈ పరిస్థితికి తోడు కరోనా వైరస్‌ దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తల్లడిల్లిపోతున్నది. దానిహతో అసలే మందగమనంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థల్ని ఈ ప్రాణాంతక మహమ్మారి మరింత కుంగదీస్తున్నది. దీంతో మాంద్యం ముప్పు పొంచి ఉందని భారత్ ను నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉద్దీపనలకు వేళైందని సూచిస్తున్నారు.

    ద్రవ్యోల్బణం కట్టడి.. తయారీ రంగ వృద్ధి.. సులభతర వ్యాపార నిర్వహణ.. వినియోగ సామర్థ్యం పెంపులపై దృష్టి సారించి ఆర్థిక, ద్రవ్యపరమైన ఉద్దీపనలు అందించాల్సిన అవసరం ఉందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) వెంటనే రంగంలోకి దిగాలని హెచ్చరిస్తున్నారు.

    స్తంభించిన పెట్టుబడులు, మందగించిన తయారీ, నీరసించిన వ్యాపారం, పడిపోయిన వినిమయ సామర్థ్యం, తరిగిన ఆదాయం, పెరిగిన నష్టాలు… ఇదీ నేటి భారతీయ ఆర్థిక ముఖచిత్రం. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కరోనా వైరస్‌.. దేశానికి ముచ్చెమటల్నే పట్టిస్తున్నది. ప్రజలు బయటకు రాలేని దుస్థితి నెలకొంటున్నది. ఫలితంగా కొనుగోళ్లు లేక అన్ని వ్యాపారాలు దిగాలుపడ్డాయి. దీంతో జీడీపీ మరింత దిగజారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    ఏడేండ్ల కనిష్ఠాన్ని తాకుతూ ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసికం (అక్టోబర్‌-డిసెంబర్‌)లో జీడీపీ 4.7 శాతానికి పరిమితమైన విషయం తెలిసిందే. అందుకే పడకేసిన పారిశ్రామికోత్పత్తిని పరుగులు పెట్టించేలా నిర్ణయాలుండాలి. కరోనా వైరస్‌ దెబ్బకు అంతర్జాతీయ సంబంధాలన్నీ దాదాపుగా తెగిపోయాయి. దీంతో ఇతర దేశాల నుంచి ముడి సరుకు దిగుమతులు నిలిచిపోయాయి. అందుకే దేశీయ వనరులను బలోపేతం చేసుకోవాలని ఆర్థిక, పారిశ్రామిక నిపుణులు సూచిస్తున్నారు.

    ఆగిపోయిన దిగుమతులతో ఏయే రంగాలు ప్రభావితమైయ్యాయో.. ఆయా రంగాల్లో ఉత్పత్తి పుంజుకునే మార్గాలను తొలుత అన్వేషించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. సాధారణ పరిస్థితులు నెలకొంటే దిగుమతులపై సుంకాల భారం తగ్గించాలని, అవకాశమున్న రంగాల్లో పెట్టుబడులకు స్వేచ్ఛనివ్వాలని సూచిస్తున్నారు.