
సుమారు నెలరోజులుగా దేశంలో లాక్ డౌన్ అమలు జరుపుతున్నా కరోనా వైరస్ కట్టడి కాకపోవడం, పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండడానికి కారణం వైరస్ సోకినా వారిలో ఆసుపత్రులలోకన్నా అంతకు నాలుగు రేట్లు బైట యధేశ్చగా తిరుగుతూ ఉండడమే అని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారత్ లో వ్యాపించిన వైరస్ ప్రత్యేకత కారణంగా సుమారు 80 శాతం మందిలో ఆ వ్యాధి లక్షణాలు బయటపడటం లేదని, దానితో మాములుగా వారు తిరుగుతూ, వైరస్ ను మరింతగా వ్యాప్తి చేస్తున్నారని తెలిపారు.
దేశంలో సోమవారంనాటికి 4,666 మంది కరోనాబారిన పడగా, అంతకు నాలుగురెట్లు అనగా సుమారు 20వేలమంది జనారణ్యంలో తిరుగుతూ తమకు తెలియకుండానే వైరస్‌ను విస్తరిస్తున్నారు. ఈ విషయాన్ని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)కి చెందిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రమన్ గంగాఖేడ్కర్ వెల్లడించారు.
వ్యాధి లక్షణాలతో తమ వద్దకు వచ్చినవారికి, వారిని కలిసిన వారికి మాత్రమే ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి, చికిత్సలు అందిస్తూ, క్వారంటైన్‌కు పంపుతున్నది. కానీ వ్యాధి లక్షణాలు లేకుండానే వైరస్‌ను మోసుకొని తిరుగుతున్నవారు భారీ సంఖ్యలో ఉంటారని, వీరిని గుర్తించడం సవాలుతో కూడుకున్నదని డాక్టర్ గంగాఖేడ్కర్ హెచ్చరించారు.
తాము పరీక్షలు నిర్వహించిన కరోనా రోగులలో నూటికి 20 మందిలో మాత్రమే వ్యాధి లక్షణాలు కనిపించాయని, మిగిలిన 80మందిలో ఎటువంటి లక్షణాలు బయటపడలేదని ఆయన తెలిపారు. వ్యాధి లక్షణాలు బయటపడకపోవడంవల్ల వీరు తాము ఆరోగ్యంగా ఉన్నామన్న భావనతో బయట తిరుగుతూ ఇతరులకు వ్యాధిని సంక్రమింపజేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ ప్రక్రియ మరిన్ని రోజులు కొనసాగటం ఎంతో ప్రమాదకరమని, వీరివల్ల రోగుల సంఖ్య భారీగా పెరిగే అవకాశమున్నదని హెచ్చరించారు. నిజానికి వైరస్‌లోనే ఆ వైవిధ్యమున్నదని చెబుతూ రోగనిరోధకశక్తి బలహీనంగా ఉన్నవారిలో మాత్రమే దగ్గు, జ్వరం, జలుబు వంటి వ్యాధి లక్షణాలు బయటపడుతున్నాయని ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ నిర్మల్‌కుమార్ గంగూలీ చెప్పారు.
వీరిలో కూడా వైరస్ సోకిన తరువాత ఐదు నుంచి 14 రోజుల మధ్య లక్షణాలు బయటకొస్తున్నాయని, ఈలోగా వీరు కూడా ఇతరులకు వ్యాధిని సంక్రమింపజేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో వైరస్ ఏ స్థాయిలో విజృంభిస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.
వైరస్ బాధితులను గుర్తించేందుకు మరింత మెరుగైన విధానాన్ని అనుసరించాలని రమన్ సూచించారు. అయితే లక్షణాలు కనిపించని వారిని గుర్తించడానికి కొత్త విధానమేదీ లేదని ఆయన స్పష్టం చేశారు. వైరస్ కేసులు నమోదైన ప్రాంతాలు, హాట్‌స్పాట్లలో ఇన్‌ఫ్లూయెంజా తరహా పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
వైరస్ శరీర కణజాలంలోకి ప్రవేశించగానే తన సంఖ్యను పెంచుకుంటూ వేగంగా విస్తరిస్తున్నదని ప్రొఫెసర్ గంగూలీ చెప్పారు. రోగిలోని కణజాలమంతా విషపూరితం కాగానే రోగి మరణిస్తాడని తెలిపారు. ఈ వైరస్ గాలిలో 3 నుంచి 4 గంటలపాటు క్రియాశీలంగా ఉంటుందని పేర్కొన్నారు.
తగినని వైరస్ పరీక్షలు నిర్వహించకపోవడం, పరీక్షల్లో నాణ్యత లేకపోవడం వల్ల కూడా కేసుల సంఖ్య పెరిగే అవకాశముందని చెప్పారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోతే కరోనా నియంత్రణకు మరో రెండేండ్లు పట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవల ప్రభుత్వం ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టింగ్ కిట్లను ప్రవేశపెట్టిన నేపథ్యంలో రోగ లక్షణాలు కనిపించని వారిని వేగంగా గుర్తించే అవకాశం ఏర్పడందని భావిస్తున్నారు. మరోవైపు, హాట్‌స్పాట్లను గుర్తించడం ద్వారా వైరస్ లక్షణాలు కనిపించని పాజిటివ్ కేసుల వ్యాప్తిని నియంత్రించవచ్చని ఉత్తరప్రదేశ్ వైద్యశాఖ కార్యదర్శి అమిత్ మోహన్ ప్రసాద్ భావిస్తున్నారు.
కేసులను త్వరగా గుర్తించడం, ఐసొలేషన్ ప్రక్రియ ద్వారా ఇలాంటి కేసులను తగ్గించవచ్చని ఎయిమ్స్ (రాయ్‌పూర్) మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కరన్ పీప్రే తెలిపారు. కరోనా మునుపు వచ్చిన పలు వైరస్‌లకంటే భిన్నమైనదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇది సార్స్ వైరస్‌కన్నా ఎన్నోరెట్లు ప్రమాదకరమైనదని తెలిపారు.
‘కరోనా నిశ్శబ్దంగా మనిషిలోకి చేరుతుంది.. అతని ఎగువ శ్వాసకోశ ప్రాంతంపై దాడి చేస్తుంది’ అని ప్రముఖ వైరాలజిస్ట్ పీటర్ కోల్‌చిన్‌స్కీ చెప్పారు. సార్స్ వ్యాధికి కారణమైన కొవిడ్-1వైరస్ కూడా గాలిలోని తుంపరుల ద్వారానే శరీరంలోకి ప్రవేశించి నేరుగా ఊపిరితిత్తులపై దాడి చేసింది.
అది వేగంగా మనిషిని అనారోగ్యం పాలుచేసింది. అతిత్వరగా దాని వ్యాధి లక్షణాలు బయటపడటంతో ఆ రోగిని వెంటనే ఇతరులకు దూరంగా క్వారంటైన్ చేయడానికి అవకాశం కలిగింది. కానీ 2019లో వచ్చిన కొవిడ్-2 (ప్రస్తుత కరోనా) ఎంతో గడసరిది. ఇది శరీరంలోకి చేరి మనిషి గొంతులోని కణాలలో నివాసమేర్పరచుకుంటుంది. దీనివల్ల ఆ వ్యక్తిలో వెంటనే లక్షణాలు బయటపడవు.