కరోనా కేసుల్లో ఏడో స్థానానికి చేరిన భారత్‌

ఒక వంక భారత్ దేశంలో లాక్ డౌన్ కు దాదాపు పూర్తి స్థాయిలో సడలింపులు ఇస్తుండగా మరోవంక దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్నది. కేసుల నమోదు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం నుండి ఆదివారం వరకు 8,380 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. ఇంతవరకు దేశంలో ఒకేరోజు ఇన్ని కేసులు నమోదు కాలేదు. దేశంలో కరోనా కేసులు 2 లక్షల దగ్గరికి (1,90,809)కి చేరుకోవడంతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కేసులు అత్యధికంగా ఉన్న […]

Written By: Neelambaram, Updated On : June 1, 2020 11:28 am
Follow us on

ఒక వంక భారత్ దేశంలో లాక్ డౌన్ కు దాదాపు పూర్తి స్థాయిలో సడలింపులు ఇస్తుండగా మరోవంక దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్నది. కేసుల నమోదు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం నుండి ఆదివారం వరకు 8,380 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. ఇంతవరకు దేశంలో ఒకేరోజు ఇన్ని కేసులు నమోదు కాలేదు.

దేశంలో కరోనా కేసులు 2 లక్షల దగ్గరికి (1,90,809)కి చేరుకోవడంతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కేసులు అత్యధికంగా ఉన్న దేశాలలో భారత్ ఏడో స్థానంకు చేరుకొంది. తొలి ఆరు స్థానాల్లో వరుసగా అమెరికా, బ్రెజిల్‌, రష్యా, స్పెయిన్‌, బ్రిటన్‌, ఇటలీ దేశాలు ఉన్నాయి.

ఈ వివరాల్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో ఇప్పటి వరకూ 65,168 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ మూడో దశ పూర్తయ్యే సరికి కరోనా కేసులలో ప్రపంచంలో 9వ స్థానంలో ఉన్న భారత్, 4వ దశ పూర్తయ్యే సరికి 7వ స్థానంలోకి చేరుకొంది.

వైరస్‌ కారణంగా ఒక్కరోజులోనే 193 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 5,164కు చేరింది. వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 86,983 (47.76 శాతం)కు చేరింది. అంటే దాదాపు ప్రతి ఇద్దరి వ్యక్తులలో ఒకరు కోలుకుంటున్నారు

ఇలా ఉండగా, దేశంలోని మొత్తం కరోనా కేసుల్లో సగం కేసులు నాలుగో విడత లాక్ డౌన్ లోనే నమోదయ్యాయి. మే 18 నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 85,974 పాజిటివ్ కేసులు వచ్చాయి మొత్తం కేసుల్లో 47.20 శాతం ఈ సమయంలోనే రికార్డు అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా చెబుతోంది.

మొదటి లాక్ డౌన్ మార్చి 25 నుంచి మొదలై 21 రోజులపాటు కొనసాగింది. అప్పుడు 10,877 కేసులు మాత్రమే వచ్చాయి. రెండో విడత ఏప్రిల్ 15 నుంచి మొదలై మే 3 వరకు కొనసాగితే.. 31,094 కేసులు నమోదయ్యాయి. మూడో దశ 14 రోజలపాటు కొనసాగి మే 17న ముగిసింది. ఈ సమయంలో 56,636 మందికి పాజిటివ్ వచ్చింది.

వైరస్‌ బాధితులను, వారితో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించడంలో పలు రాష్ట్రాలు విఫలమవ్వడం, లాక్‌డౌన్‌ విధించిన తర్వాత వలస కూలీలను సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు కేంద్రం అనుమతించడం వంటి కారణాల వల్ల వైరస్‌ కేసులు పెరుగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ (వైరస్‌ బాధితులతో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించడం) అతి ముఖ్యమైనది. అయితే, దీన్ని సమర్థమంతంగా నిర్వహించడంలో పలు రాష్ట్రాలు విఫలమయ్యాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) పేర్కొంది.

మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాలు బాధితుల సన్నిహితుల్ని గుర్తించడం, వాళ్లకు పరీక్షల్ని నిర్వహించడంలో మెరుగ్గా వ్యవహరించలేదని వెల్లడించింది. జనాభా ఎక్కువగా ఉండటం దీనికి ఒక కారణంగా వివరించింది.

మరోవంక, ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు పెరుగడానికి వలస కూలీలను సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతులనివ్వడం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌ 1.0 విధించిన మార్చి 25 కంటే ముందు దేశంలో వైరస్‌ కేసులు తక్కువగా ఉండేవని, అప్పుడే వలస కూలీలను స్వరాష్ట్రాలకు పంపే ఏర్పాట్లు చేస్తే ప్రస్తుతం కేసుల్లో ఇంత పెరుగుదల నమోదయ్యేది కాదని ఎయిమ్స్‌, జేఎన్‌యూ , బీహెచ్‌యూ నిపుణులు చెబుతున్నారు.