కరోనా సెకండ్ వేవ్ దేశంలో ఎంతటి మారణహోమం కొనసాగించిందో తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. తెలంగాణలో కేసులు కాస్త తక్కువగానే నమోదయ్యాయి. ఏపీలో మాత్రం భారీగా నమోదయ్యాయి. ఇప్పటికీ అక్కడ ఆంక్షలు కొనసాగుతున్నాయి. రాత్రివేళ కర్ఫ్యూ అమల్లో ఉంది. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రయాణాలపై కఠిన ఆంక్షలు విధించింది ప్రభుత్వం.
సినిమా థియేటర్లపైనా ఆంక్షలు ఉన్నాయి. నైట్ షోలు పూర్తిగా రద్దయ్యాయి. ఈ నిబంధనలు ఆగస్టు 14వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. ఆ తర్వాత కొనసాగించాలా? కొత్త నిబంధనలు ఏమైనా అమలు చేయాలా? అనేది ప్రభుత్వం నిర్దేశిస్తుంది.
అయితే.. గడిచిన కొన్ని రోజులుగా ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 71,030 మందిని పరీక్షించారు. వీరిలో 1869 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే బాధితులుగా ఉన్నవారిలో 2,316 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 18 మంది మాత్రం మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 18,417 ఉన్నట్టు అధికారులు తెలిపారు.
గతంతో పోలిస్తే.. ఇవి చాలా తక్కువ కేసులుగా చెప్పొచ్చు. క్రమక్రమంగా కేసుల సంఖ్య తగ్గుతూ ఉండడంతో.. ఆగస్టు 14 తర్వాత సర్కారు కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. ఎక్కువగా కేసులు నమోదవుతున్న జిల్లాల్లో ఈ ఆంక్షలను కొనసాగిస్తూ.. మిగిలిన జిల్లాల్లో పూర్తిగా ఎత్తేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి.