
ఏపీలో కరోనా కల్లోలం చోటుచేసుకుంటోంది. కరోనా బాధితులకు ఆస్పత్రుల్లో బెడ్స్ దొరకడం లేదు. ప్రభుత్వాసుపత్రులన్నీ నిండిపోగా.. ప్రైవేటు ఆస్పత్రుల్లో కనీసం రూ.2.50 లక్షలు కడితే కానీ బెడ్ ఇవ్వని దారుణ పరిస్థితులు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఏపీలో ప్రస్తుతం ప్రతిరోజు 11 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయని వైద్యఆరోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. వారందరికీ సరిపడా వైద్య సదుపాయాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఊపిరి అందక ఇబ్బందులు పడే వారికి ఆక్సిజన్ సరిపడా సరఫరా కావడం లేదన్న విమర్శలున్నాయి.
విజయవాడ లాంటి ప్రధాన పట్టణాల్లో ఆక్సిజన్ నిల్వలు నిండుకున్నాయని రోగులు ఆరోపిస్తున్నారు.. కేవలం కొన్ని గంటల వరకు మాత్రమే సరిపడా ఆక్సిజన్ అందుబాటులో ఉన్నట్లు రోగులు చెబుతున్నారు.. వెంటిలేటర్ పైనే వందలాది మంది రోగులు ఉంటున్నారు. ఆక్సిజన్ కొరతతో రోగులు అల్లాడుతున్నారు. అయితే ప్లాంట్ల నుంచి ఆక్సిజన్ సరఫరా కావడం లేదని సప్లయిదారులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఏపీలో కరోనా ఆస్పత్రుల బయట ఒక్క బెడ్ దొరికితే చాలని రాత్రింబవళ్లు ఎదురుచూస్తున్న బాధితులు వందలమంది ఉన్నారు. కానీ ఏపీలోని అధికార పక్షం మాత్రం 50వేలకు పైగా పడకలు అందుబాటులో ఉన్నాయని.. 3400 పైగా ఐసీయూ బెడ్స్ సిద్ధంగా ఉన్నాయని జగన్ సొంత పత్రికలు ప్రకటనలు ఇవ్వడంపై రోగులు మండిపడుతున్నారు.
గుంటూరు, నెల్లూరు, విశాఖ, విజయవాడ ఇలా ఏ ప్రాంతానికి వెళ్లినా కోవిడ్ చేస్తున్న దారునాలు కళ్లకు కడుతాయి. ప్రజలు కరోనా చికిత్సలు అందక.. బెడ్స్ దొరక హాహాకారాలు చేస్తున్న దుస్థితి నెలకొంది. ఇక రెమెడిసివిర్ సహా కరోనా నివారణ ట్యాబ్లట్లను 500కు దొరికేవి రూ.10వేలకు.. 50వేల వరకు ఇంజెక్షన్లను అమ్మి డిమాండ్ ను బట్టి సొమ్ముచేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.
ప్రస్తుతం ఏపీలో వెంటిలేటర్ పైనే వందలాది మంది రోగులు ఉంటున్నారు. ఆక్సిజన్ సిలిండర్ల సంగతి అయితే వేలం పాటను తలపించేలా ఉందన్న ఆరోపణలున్నాయి. ఒక్క ఐసీయూ బెడ్ కూడా దొరకని పరిస్థితి ఇప్పుడు ఏపీలో ఉంది. ఎవరైనా డిశ్చార్జ్ అయితే దాని కోసం పోటీపడుతున్న దుస్థితి నెలకొంది. ఇదంతా క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న చేదు వాస్తవం. కానీ పాలకులు మాత్రం దీన్ని అంగీకరించడం లేదు. పైకి అంతా బాగానే ఉందని కలరింగ్ ఇస్తున్నారన్న విమర్శ ఉంది.
ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో కోవిడ్ బాధితుల సంఖ్య రెట్టింపు కావడంతో బెడ్ లు కేటాయించకలేక అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఆక్సిజన్ బెడ్ లన్నీ నిండిపోవడంతో బాధితులు ఆస్పత్రి ఆవరణలోనే పడిగాపులు కాస్తున్నారు.
ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో తాజాగా ఒక మహిళకు వైద్యం అందక చనిపోయిన వైనం ఏపీలో ఆరోగ్య సేవలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.. బీడీ కాలనీకి చెందిన జయలక్ష్మీ అనే మహిళ బాగా నీరసించి సొమ్మసిల్లి ఆస్పత్రికి వచ్చింది. కోవిడ్ రిపోర్టు ఉంటే కానీ వైద్యం చేయించలేమని వైద్యులు స్పష్టం చేశారు. కానీ వెంటనే చేయించుకుందామంటే వారం అయినా ఫలితాలు చెప్పడం లేదు. దీంతో బాధితురాలు కుటుంబ సభ్యులు వైద్యం చేయమని డాక్టర్లను ప్రాధేయపడ్డారు. వైద్యులు స్పందించకపోవడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె ప్రాణాలు పోవడానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధితురాలి బంధువులు ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ లో బెడ్స్ 50వేలవరకు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని చర్యలు తీసుకోకపోతే పరిస్థితులు మరింత దిగజారుతాయని హెచ్చరిస్తున్నారు.