
తెలంగాణలో సీనియర్ దళిత రాజకీయ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కరోనావైరస్ బారిన పడ్డ ఆయన ఇప్పుడు చావుతో పోరాడుతున్నాడు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మోత్కుపల్లి పరిస్థితి విషమించడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేర్పించారు. వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలిసి అభిమానులు, నల్గొండ జిల్లా నేతలు, టీడీపీ, బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
మోత్కుపల్లి తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందినవారు. మార్చి 1982లో తెలుగుదేశం పార్టీ ప్రారంభమైనప్పటి నుండి ఎన్టీఆర్ తో కలిసి రాజకీయాల్లోకి వచ్చారు. 1983 మరియు 2004 మధ్య ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. 2009లో తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా కూడా పోటీచేసి గెలిచారు.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. ఆరుసార్లు ఏపీ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అతను టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడుగా చేశాడు.. నరసింహులు 2018లో టిడిపిపై, అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై తిరుగుబాటు చేశారు. తనకు గవర్నర్ పదవి ఇస్తానని బాబు మోసం చేశాడని మోత్కుపల్లి ఆరోపించారు. దీంతో మోత్కుపల్లినిపార్టీ నుండి చంద్రబాబు సస్పెండ్ చేశారు. అనంతరం మోత్కుపల్లి బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన బిజెపితో ఉన్నారు.