అన్ని రాష్ట్రాల్లో వేలల్లో టెస్టులు.. కేసులు నమోదవుతున్నాయి. పక్కనున్న ఏపీ కూడా ప్రతీరోజు 60వేలకు పైగా టెస్టులు చేస్తోంది. అక్కడ ప్రతీరోజు 10వేల కేసులు నమోదవుతున్నాయి. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే ఏకంగా 1500 పైగా కేసులు నమోదవుతున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం తూర్పు గోదావరి జిల్లాలో నమోదైన కేసులతో సమానంగా కేసులు నమోదు కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
తెలంగాణలో ఇప్పటికీ టెస్టులు పెంచినా 1000-2000 మధ్యనే కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ మిస్టరీ ఎవ్వరికీ అర్థం కాక అందరూ తలలు పట్టుకుంటున్నారు.
ఇప్పటికే తెలంగాణలో కరోనా టెస్టుల సంఖ్య పెంచడం లేదని.. సరిగ్గా పట్టించుకోవడం లేదని.. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీలో నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలంగాణ సర్కార్ కు హైకోర్టు తలంటింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది.
కాగా తాజాగా కరోనా చర్యల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదిక నిర్లక్ష్యంగా.. అస్పష్టంగా ఉందని వ్యాఖ్యానించింది. కరోనా మృతులపై వాస్తవాలు వెల్లడించడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ మృతుల సంఖ్య మాత్రం 9 లేదా 10 ఉండడం అనుమానంగా ఉందని తెలిపింది. కరోనా మృతులపై వాస్తవ వివరాలు వెల్లడించాలని ఆదేశించింది. జిల్లాలో కరోనా కేసులకు.. రాష్ట్రాల బులిటెన్లకు తేడా బాగా ఉంటుందని హైకోర్టు హితవు పలికింది.
అంబులెన్సులను కరోనా రోగులకు పెంచాలని.. ల్యాబ్ ల సంఖ్య పెంచాలని.. బడ్జెట్ ను కరోనాకు కేటాయించాలని.. మొబైల్ వ్యాన్ల ద్వారా ప్రజలకు పరీక్షలు చేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇక ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు మండిపడింది. అవి చట్టానికి అతీతమా అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై విచారణ జరిపి 22వరకు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో సగం బెడ్లను ప్రభుత్వానికి కేటాయిస్తానన్న మంత్రి మాటలు ఏమయ్యాయని ప్రశ్నించింది.
ఇలా హైకోర్టులో మరోసారి తెలంగాణ సర్కార్ కు కరోనా చికిత్సల విషయంలో తలంటు పడింది. ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడకపోతే ప్రభుత్వం మరింత అభాసుపాలు కావడం ఖాయమని పలువురు హితవు పలుకుతున్నారు.