కరోనా కల్లోలంలో అన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ల కోసం టెండర్లు వేసాయి. కొన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్ అందించేందుకు పలు దిగ్గజ సంస్థలు టెండర్ వేశాయి. కానీ ఏపీకి మాత్రం ఎవరూ రాలేదు. సీఎం జగన్ ముందు చూపు లేకపోవడం.. వ్యాక్సిన్ తయారీ దారులను మెప్పించలేకపోవడం వల్లే ఇదంతా జరిగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు కడిగిపారేశారు.
కరోనా మహమ్మారిని అదుపు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు నిప్పులు చెరిగారు. సీఎం జగన్ చేతకాని తనాన్ని సరిదిద్దుకోలేక కేంద్రంపై పడుతున్నాడని ఆరోపించారు. రాజ్యాంగం ప్రకారం వైద్య, పబ్లిక్ హెల్త్, ప్రజారోగ్యం, ఆసుపత్రుల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వాలదే అన్నారు. దీని ప్రకారం కోవిడ్ నిర్వహణ, వాక్సిన్ల సేకరణ రాజ్యాంగబద్దంగా రాష్ట్ర ప్రభుత్వాలదే అని, కానీ సిఎం జగన్ తన లేఖద్వారా తనకున్న బాధ్యత నుంచి తప్పుకోవాలని చూస్తున్నారని అన్నారు.
నిర్వహణా లోపంతో కోవిడ్ ను అదుపుచేయలేయలేక, వాక్సిన్లు సేకరించకుండా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తన బాధ్యతల నుంచి తప్పుకోడానికి చూస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు ఆరోపించారు. వాక్సిన్లు సేకరించాల్సిన బాధ్యత తనపై ఉంటే, కేంద్రమే కొనాలని కోరుతూ ముఖ్యమంత్రులకు లేఖలు రాసి కేంద్రాన్ని బాధ్యులను చేస్తున్నారని విమర్శించారు. ఈ వైఖరిని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. సోమువీర్రాజు మీడియాతో ఆదివారం సాయంత్రం మాట్లాడారు.
ప్రధాని ఎంతో బాధ్యతగా కోవిద్ పట్ల ఫిబ్రవరి, మార్చిలలో సమావేశం నిర్వహించి, ముఖ్యమంత్రులను అప్రమత్తం చేశారని చెప్పారు. కాని ముఖ్యమంత్రి జగన్, వైద్యశాఖమంత్రి, అధికారయంత్రాంగం ఒక్క సమావేశం నిర్వహించలేదని, కేంద్రం వచ్చిన మందులు, వెంటిలేటర్లు, వ్యాక్సిన్లు సరిగా వినియోగించలేదని ఆరోపించారు. కోవిద్ నియంత్రణపై ప్రభుత్వం వద్ద నిర్ధిష్ట ప్రణాళిక లేదని, లోపభూయిష్ట విధానాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఆయన ఇంకా ఇలా అన్నారు…
– కేంద్రం పంపినవి
కేంద్రం ముందుగానే అప్రమత్తమై ఏప్రిల్ 6న సుమారు 5 వేల వెంటిలేటర్లను ఎపీకి ఇచ్చింది. కాని వాటిని సరిగా వినియోగించలేదు. 15.60 లక్షల ఎన్. 95 మాస్కులు, 3.91 లక్షల పీపీఈ కిట్లు, 3.67 లక్షల రెమిసివిర్ ఇంజక్షన్లు ఇచ్చింది. మే 11, 27న 11,230 బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు ఇచ్చింది. మే 1న విడుదల చేసిన వాక్సినేషన్ పాలసీలో మొత్తం వాక్సినేషన్ ఉత్పత్తిలో 50 శాతం కేంద్రం తీసుకుని ఉచితంగా ఇస్తే, 50 శాతం రాష్ట్రాలు సొంతంగా సేకరించుకుని వాటిని ఉచితంగా ప్రజలకు చేయాలని పేర్కొంది.
-ఒక్క వ్యాక్సిన్ అయినా కొన్నారా?
దేశవ్యాప్తంగా జూన్ 5 నాటికి 25 కోట్ల డోస్లు ఉత్పత్తి చేసి 24 కోట్ల డోస్లు పంపిణి చేయగా ఎపీ ఒక్కడోస్ కొనలేదు. సిఎం జగన్ గ్లోబల్ టెండర్లు పిలిస్తే ఒక్క కంపెనీ పాల్గొనలేదు. 18-44 ఏళ్ల మధ్య వారికి దక్షిణ భారతదేశంలో మొత్తం 2.76 కోట్ల మందికి మొదటి డోస్ ఇచ్చారు. 1.61 లక్షల మంది రెండో డోస్ తీసుకున్నారు. ఏపీలో మాత్రం ప్రైవేటు సంస్థల చెల్లింపు ప్రక్రియ ద్వారా మాత్రం సుమారు 60 లక్షల వాక్సిన్లు మాత్రం వేశారు. కర్నాటకలో 19.3 లక్షలు, తమిళనాడులో 18.4 లక్షలు, తెలంగాణలో 6.1లక్షలు, కేరళలో 5.2 లక్షలు వేశారు.
– యువత పట్ల ప్రభుత్వానికి శ్రద్దలేదు
యువతపై ప్రభుత్వానికి శ్రద్దలేదు. ఒక్క రూపాయి కూడా వారికి ఖర్చుచేయడానికి సిద్ధంగా లేదు. వెంటనే వాక్సిన్లు సేకరించి వారికి వెయ్యాలి.
– బాధ్యతతో వ్యవహరిస్తున్న కేంద్రం
కేంద్రం కోవిద్ పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తుంటే, రాష్ట్రం మాత్రం బాధ్యత లేకుండా చేతులెత్తేసి, కేంద్రంపై ఆరోపణలు చేస్తుంది. దీనిని భాజపా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కేంద్రం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ, ప్రజల ప్రాణాలను కాపాడుతోంది. బయలాజికల్ ఈవెంట్స్ సంస్థకు 30 కోట్ల డోస్ల ఉత్పత్తికి రూ.1,500 కోట్లు, భారత్ బయోటెక్కు నెలకు 10 కోట్ల వ్యాక్సిన్ల ఉత్పత్తికి, ఫ్రీడం ఇండియా సంస్థకు 11 కోట్ల వ్యాక్సిన్ల ఉత్పత్తికి ముందస్తుగా అడ్వాన్స్లు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. బాధ్యత నుంచి తప్పించుకోలేదు.
– రాష్ట్రంలో వైద్యానికి కేంద్ర సహాయం
రాష్ట్రంలో 16 బోధనాసుపత్రులకు శంకుస్థాపన చేస్తుంటే అందులో 3 ఆసుపత్రులకు 60 శాతం నిధులు కేంద్రం ఇస్తుంది. మిగతా వాటికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. 104 వాహనాలకు, జిల్లాల్లోని వివిధ ఆసుపత్రులు, పిహెచ్సీలు, ఆశావర్కర్లకు 10 వేల జీతం ఇవన్నీ కేంద్రం ఇస్తున్న నిధులతో నిర్వహిస్తున్నవే. ఇంత సహాయం చేస్తుటే కేంద్రంపై ఆరోపణలు చేయడం సరికాదు.
కోవిడ్ పై ముఖ్యమంత్రి జగన్ అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించి చర్చించి, వారి ఆలోచనలను స్వీకరించే ప్రయత్నం చేయలేదు. ఎవరి వద్ద వాక్సిన్ లేని పరిస్థితిలో గ్లోబల్ టెండర్లకు వెళ్లారు. ఆక్సిజన్ కొరత వచ్చినప్పుడు 15 నుంచి 20 రోజుల్లోనే కేంద్రం పలు మార్గాల ద్వారా ఆక్సిజన్ను
– ఆక్షిజన్ దుర్వినియోగం
రాష్ట్రానికి పంపింది. ఈ ఆక్సిజనన్ను దుర్వినియోగం చేశారు. ప్రైవేటు రంగంలో ఆక్సిజన్ ఎక్కువగా ఉన్న విషయాన్ని మేం గుర్తించి సమాచారం అందిస్తే తప్ప ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకోలేదు.
– మూడో వేప్ పట్ల అప్రమత్తం కావాలి
మూడో వేవ్ రానుందన్న సమాచారం నేపథ్యంవ్ పైలో రాష్ట్రం మరింత అప్రమత్తం కావాలి. కొత్తగా నిరిస్తున్న ఆసుపత్రుల్లో వైద్యులను, మౌలికసదుపాయాలను సమకూర్చుకోవాలి.
– వాక్సిన్లు సరిగా వాడలేదు
రాష్ట్రానికి పంపిన వ్యాక్సిన్లను సరిగా వినియోగించలేదు. జనవరి నుండి మార్చి వరకు 65.50 లక్షల వాక్సిన్లు మీకు కేంద్రప్రభుత్వం అందజేస్తే, రాష్ట్రం వినియోగించింది 26.10 లక్షలు మాత్రమే. అంటే కేంద్రం పంపిన వాక్సిన్ల లో కేవలం 40% మాత్రమే వినియోగించారు. జనవరిలో 10 లక్షల వ్యాక్సిన్లు ఇస్తే 1.09 లక్షలు మాత్రమే వేశారు. ఫిబ్రవరిలో 24.06 లక్షల వాక్సిన్లు ఇస్తే 4.08 లక్షలు మాత్రమే వేశారు. మార్చిలో 35.40 లక్షలు ఇస్తే 19.04 లక్షలు వాడారు. ఇది వీరి నిర్వహణలేమికి మచ్చుతునక. 2.89 లక్షల డోస్లు వృధాచేశారు. వాక్సినేషన్ ఖర్చును వృధాగా పోల్చారు.
– వాక్సిన్ కు అయ్యే రూ.35 వేల కోట్లు వృథాగా అయ్యే ఖర్చుతో వైసీపీ ఎంపీ పార్లమెంటులో అడిగారు. ఇదే విధానం ఆ | పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం వాదనలా కనిపిస్తోంది. వాక్సిన్లు ప్రజలకు వేయడం వృధా అని వారు భావిస్తున్నారు. అందుకే వాక్సిన్లు వేయడాన్ని సరిగా నిర్వహించడం లేదు. అందువల్లనే తిరుపతిలో 23 మంది, హిందుపురం, విజయనగరంలలో ఆక్సిజన్లు లేక అనేకమంది చనిపోయారు. ముఖ్యమంత్రి తను రాసిన లేఖ పట్ల ప్రజలకు సమాధానం చెప్పాలి.
-భాజపా సేవలు
కోవిద్ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకే సేవ చేసేందుకు భాజపా కార్యకర్తలు 760 మండలాల్లోని 4,320. గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 100 వరకు ఐసోలేసెన్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. 4.60 లక్షల మాస్కులు పంపిణి చేశాం. 8 లక్షల ఆహారపొట్లాలు పంపిణి చేశాం. మెడికల్ కిట్ల, ఆక్సిజన్ సిలిండర్లు, 21 ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించాం. మోదీ ప్రధానిగా రెండో విడతపాలన రెండేళ్లు పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభలు కాకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఫొటో, వీడియోగ్రాఫర్లకు రాష్ట్రం సహాయం చేయాలి
కోవిద్ కారణంగా నిర్వహించిన లాక్డౌన్ల కారణంగా వివాహాలు, శుభకార్యాలు జరగక రాష్ట్రంలో ఉన్న ఫొటో స్టూడియాల మూసివేయం వల్ల 2 లక్షల ఫొటో, వీడియో గ్రాఫర్లు ఉపాధి కోల్పోయారు. కరోనా మొదటి దేశ లో 65 మంది మరణించారు. ఇప్పుడు రెండవ దశలో సుమారు 120 మంది చనిపోయారు. వీరికి ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందడంలేదు. వీరికి ప్రభుత్వపరంగా ఒక్క పథకం అందలేదు. అందువల్ల వీరిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రమౌళి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.