
కరోనా పుణ్యానా.. మనిషి తన తోటిమనిషి చూసి దడుసుకునే రోజులొచ్చాయి.. దేశంలో రోజురోజుకు కరోనా మహమ్మరి విజృంభిస్తోంది. ప్రధాని మోదీ లాక్డౌన్ విధించి.. చప్పళ్లు కొట్టిస్తే ఇక కరోనా ఖతమని అందరూ భావించారు.. అయితే జిత్తుల మారి కరోనా ఎప్పుడు అవకాశం దొరుకుందా? అని వెయిట్ చేసి.. లాక్డౌన్ ఎత్తివేయగానే తనపని తాను చేసుకుంటూ పోతుంది. దీంతో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. కరోనా కట్టడి చేయాల్సిన ప్రభుత్వాలు కరోనాతో సహజీవనం ఉంటూ మీనమేషాలు లెక్కిస్తుండటంతో దేశంలో మరణాలు రేటు కూడా పెరిగిపోతుంది.
Also Read: కారులో రగులుతున్న ‘కార్చిచ్చు’
కరోనా ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇది.. అది అనే తేడా లేకుండా అన్నిరంగాలకు దెబ్బతీస్తుంది. ఎవరు ఔను అన్నా.. కాదన్న ఎవరిగ్రీన్ గా లాభాలతో నడిచే బిజినెస్ ఏదైనా ఉందంటే అది మద్యం షాపులే అని అందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు. అలాంటిది ఇప్పుడు ఆ రంగం కూడా కరోనా దాటికి కుదేలవుతున్నారు. రోజురోజుకు మద్యం అమ్మకాలు తగ్గిపోతుండటంతో మద్యం షాపుల యాజమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా బీర్ల అమ్మకాలపై కరోనా ఎఫెక్ట్ కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది.
తెలంగాణలో మద్యంప్రియులు ఎక్కువగా బీర్లను సేవిస్తుంటారు. అయితే కరోనా కారణంగా చాలామంది వాటికి జోలికి పోకపోవడంతో వాటి సేల్స్ భారీగా పడిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గతంలో సీజన్ తో సంబంధం లేకుండా బీర్ల అమ్మకాలు విపరీతంగా జరిగేవి. సగటు ఒక్కొక్కరు మూడు నుంచి ఆరు బీరు బాటిళ్లు కొనుగోలు చేసేవారట. అయితే ప్రస్తుతం మద్యంప్రియులు చల్లని బీర్ల జోలికి వెళ్లడం లేదట. బీర్లు తాగటం వల్ల జలుబు వచ్చే అవకాశం ఉండటంతో వాటిని సేవించేందుకు కూడా భయపడుతున్నారట. కరోనా కారణంగా మద్యంప్రియులు వాటికి జోలికి వెళ్లడం లేదని తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో బీర్ల అమ్మకాలు భారీగా పడిపోయినట్లు మద్యం షాపు ఓనర్లు వాపోతున్నారు.
గత ఏడాదితో పొలిస్తే బీర్ల అమ్మకాలు గణనీయంగా పడిపోయినా లిక్కర్ సేల్స్ మాత్రం ఒకేరకంగా ఉన్నట్లు అబ్కారీ అధికారులు చెబుతున్నారు. గతేడాది జులైలో 31.48లక్షల కేసుల లిక్కర్, 41.7లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరుగగా ప్రస్తుతం జులైలో 31.34 లక్షల కేసుల లిక్కర్ అమ్మకాలు, బీరు అమ్మకాలు 22.99లక్షల కేసులు జరిగాయి. లిక్కర్ అమ్మకాల్లో తేడా లేకున్నప్పటికీ బీర్ల అమ్మకాలు భారీగా పడిపోయాయి. అయినా మద్యం అమ్మకాల విలువ మాత్రం గత ఏడాది జులైలోని అమ్మకాలతో పోలిస్తే రూ.600కోట్లు పెరిగినట్లు అధికారులు చెబుతుండటం గమనార్హం.
Also Read: ‘బండి’ టార్గెట్ గా కొత్త రాజకీయాలు?
అయితే కరోనా కారణంగా అందరూ ఇంటికే పరిమితం కావడం.. జన్మదిన వేడుకలు, విందులు, వినోదాల జోలికి ప్రజలు వెళ్లకపోవడం.. నలుగురు కలిసి పార్టీలు చేసుకునే వీలులేకపోవడం వల్లనే మద్యం సేల్స్ భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. ఇక ఉద్యోగులు కూడా ఇంటి నుంచే పని చేస్తుండటం కూడా ఇందుకు కారణమని అబ్కారీ అధికారులు అంచనా వేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ ఇలానే కొనసాగితే అన్నిరంగాలతోపాటు బీర్ల కంపెనీలు కూడా నష్టాలబాట పట్టాల్సి రావచ్చు. ఏదిఏమైనా కరోనా కారణంగా చల్లటి బీరు చేదేక్కడం బీర్ల కంపెనీలకు నిజంగా చేదువార్తే అనే చెప్పాలి..!