Corona Cases In China: కరోనా పీడ ఇక వదిలినట్లేనని అనుకున్నారు.. ప్రజలంతా ఎప్పటిలాగే తమ పనులు చేసుకుంటున్నారు.. కానీ ఇంతలోనే మహమ్మారి మళ్లీ ముంచుకొస్తుంది.. కరోనా పుట్టినిల్లు చైనాలో మరోసారి కరోనా కేసులు విజృంభించడంతో ప్రపంచం షాక్ కు గురైంది. గత వారం రోజులగా చైనాలో లాక్డౌన్ విధించడంతో కరోనా ముప్పు ఇంకా తొలిగిపోలేదని అర్థమవుతోంది. గత రెండేళ్లుగా కరోనాతో ప్రపంచం అతలాకుతలమైంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామనుకుంటున్న క్రమంలో మరోసారి కేసులు పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. అటు లాక్టౌన్ విధించడంతో ఎక్కడి వ్యాపారాలు అక్కడే ఆగిపోయాయి. దీంతో చైనానే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆందోళన నెలకొంది. అయితే చైనాలో నెలకొన్న సంక్షోభంతో ప్రపంచ దేశాలు ఎందుకు భయపడుతున్నాయి..? అందుకు గల కారణం ఏంటి..? అన్న దానిపై స్పెషల్ ఫోకస్
Corona Cases In China
భారతదేశానికి సరిహద్దులో ఉన్న చైనాలో తయారీ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచ తయారీ సామర్థ్యంలో మూడోవంతు చైనాదే ఉంది. ముఖ్యంగా ఆగ్నేయ చైనాలోని షెన్ జెన్ లో రిటైల్ ఎక్స్ పోర్టర్లు ఎక్కువగా ఉన్నారు. మనం కొన్ని వస్తువులను ఆన్లైన్లో కొంటున్నామంటే.. అది షెన్ జెన్ లో తయారైనదనే భావించాలి. అయితే కొవిడ్ కేసులు పెరగడంతో గత ఆదివారం నుంచి షెన్ జెన్ లో ఆరు రోజుల పాటు లాక్డౌన్ విధించారు. దీంతో ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యే వస్తువులు నిలిచిపోయాయి. ఫలితంగా ప్రపంచ వాణిజ్య వర్గాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి.
Also Read: కేసీఆర్ తో గ్యాప్.. సమ్మక్క-సారక్క వివాదంపై చినజీయర్ స్వామి హాట్ కామెంట్స్
షెన్ జెన్ తో పాటు చైనాలోని కొన్ని ఓడరేవుల్లో నౌకలు నిలిచిపోయాయాయి. యూరప్, ఉత్తర అమెరికాలకు ఎగుమతులు జరిగే ప్రధాన నౌకాశ్రయం యాంతియాన్ ఓడరేవు వెలుపల ఉన్న నౌకల సంఖ్య 28.5 శాతం పెరిగింది. ఇదే యాంతియాన్ పోర్టు గతేడాది క్రిస్తమస్ సమయంలో మూసివేశారు. గత ఫిబ్రవరి నుంచి ఉత్పత్తులు పుంజుకున్నాయి. కానీ కొద్ది కాలంలోనే మళ్లీ లాక్డౌన్ విధించారు. అయితే కరోనా కేసులను బట్టి లాక్డౌన్లో సడలింపులు ఇస్తారని అంటున్నారు.
ఇదిలా ఉండగా కరోనా సంక్షోభం ఏర్పడినప్పటి నుంచి చాలా దేశాలు అప్రమత్తమయ్యాయి. సెకండ్ వేవ్ లో ఒమిక్రాన్ కేసులు పెరిగినప్పుడు ఏవైనా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందని ముందే పెద్ద ఎత్తున సరుకులను దిగుమతి చేసుకుంటున్నారు. ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఆమెజాన్ చైనాలో తయారయ్యే వస్తువులను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంది. వీటి కోసం ప్రత్యేక గోడౌన్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇలాంటి సంక్షోభం నుంచి ఎదుర్కొంటామని అంటున్నారు. ఇక యాపిల్ సంస్థ కోసం ఐపోన్లు తయారు చేసే ఫాక్స్ కాన్ సంస్థ కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కొత్త ప్లాన్ వేసింది. కార్మికులకు పని స్థలాల్లోనే నివాసాలను ఏర్పాటు చేసి షిప్టుల వారీగా విధులు అప్పగిస్తున్నారు.
Corona Cases In China
చైనా మాత్రం జీరో కొవిడ్ వ్యూహాన్ని కొనసాగిస్తున్నామని తెలుపుతోంది. ఆ దేశాధ్యక్షుడు జిన్ పింగ్ ఇటీవల ఉన్నతస్థాయి అధికారులతో మాట్లాడుతూ కొవిడ్ కట్టడి చర్యలు ఆర్థిక రంగాన్ని బాధించకూడదని అన్నారు. ఈ వ్యూహం వల్ల దేశంలోని కొన్ని కంపెనీలు తమ స్థానాల మార్పు గురించి ఆలోచిస్తున్నాయి. చాలా సంస్థలు తమ వనరులను ప్రత్యామ్నాయం వైపు మళ్లిస్తున్నారు. దీంతో తయారీ, సరఫరా రంగం బలోపేతమైందని సింగపూర్ కు చెందిన కంటెయినర్ రవాణా సంస్థ హాలియో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆల్విన్ చెప్పారు.
ఇక చైనాలోనే పుట్టిన తొలి కరోనా వైరస్ ప్రపంచానికి పాకి ఎంతటి వినాశనాన్ని సృష్టించిందో మనం చూశాం. ఇప్పుడు అక్కడ లాక్ డౌన్ లాంటి విపత్కర పరిస్థితి చూసి ప్రపంచం మరోసారి భయపడుతోంది. మరోసారి 4వ వేవ్ తప్పదా? మళ్లీ కరోనా మనల్ని ఆవహిస్తుందా? అన్న భయాలు వెంటాడుతున్నాయి. తాజాగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కూడా కరోనా విషయంలో రాష్ట్రాలను హెచ్చరించడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరుతోంది.