Homeజాతీయ వార్తలుTelangana Ministers Controversies: మేము మంత్రులం.. మా నియోజకవర్గాలకు సామంత రాజులం

Telangana Ministers Controversies: మేము మంత్రులం.. మా నియోజకవర్గాలకు సామంత రాజులం

Telangana Ministers Controversies: మన మాట, మన చేత, మన నడవడిక ఇవే గుణగణాలను నిర్దేశిస్తాయి. సామాన్య మనుషులే ఇన్ని నియమాలకు లోబడి బతకాలని మత గ్రంధాలు, పలు చట్టాలు చెబుతుంటే.. బాధ్యతయుతమైన పదవిలో ఉన్నవారు ఇంకా ఎంత హుందాగా ఉండాలి? వారు తమ పదవులకు ఏ స్థాయిలో వన్నె తేవాలి? కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పలువురు మంత్రులు తమ స్థాయిని దిగజార్చుకునేలా చేస్తున్న చేష్టలు ప్రజలకు ఏవగింపు కలగజేస్తున్నాయి. మరి ముఖ్యంగా కొందరు మంత్రులు అయితే థర్డ్ డిగ్రీ స్థాయి భాష వాడుతుండటం విస్మయానికి గురిచేస్తోంది.

Telangana Ministers Controversies
Telangana Ministers Controversies

ఎవరికి వారే యమునా తీరే

2014లో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ పైన, రాష్ట్రం పైన కెసిఆర్ కు సడలని పట్టు ఉండేది. ఎవరైనా ఒక మాట మాట్లాడాలంటే భయపడేవారు. 2018 ఎన్నికలు ఇచ్చిన విజయంతో దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే పార్టీ బాధ్యతలన్నీ తనయుడు కేటీఆర్ కు అప్పగించారు. ఈ తరుణంలోనే కేటీఆర్ కూడా పార్టీపై మరింత పట్టు బిగించారు. ఒకరకంగా షాడో ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్నారు. ఈ దశలోనే కేటీఆర్ గ్యాంగ్ బలంగా మారింది. ఫలితంగా మిగతావారు నామమాత్రమయ్యారు. కేటీఆర్ అండ చూసుకొని వివాదాస్పద పనులు, వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనివల్ల సగటు ప్రజల్లో చులకన అవుతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా పార్టీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించకపోవడం గమనార్హం. గతంలో నాయకులు ఏమాత్రం తప్పు చేసినా కెసిఆర్ ఊరుకునేవారు కాదు. వెంటనే ఆయన కార్యాలయం నుంచి సదరు ప్రజాప్రతినిధికి ఫోన్ వెళ్ళేది. వెంటనే తదుపరి చర్యలు జరిగేవి. 2014లో అధికారంలోకి వచ్చిన మొదటి దఫాలో అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య అంబులెన్స్ ల కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడ్డారని పదవి నుంచి బర్తరఫ్ చేశారు. కానీ ప్రస్తుతం ఉన్న మంత్రులు అంతకుమించి చేస్తున్న కిక్కురు మనని పరిస్థితి టిఆర్ఎస్ లో ఉంది.

Also Read: Munugode Bypoll: భారీ ప్యాకేజీల మునుగోడు

ఎందుకు ఉపేక్షిస్తున్నట్టు

ఒకరకంగా చెప్పాలంటే మంత్రులు వారి వారి జిల్లాలకు సామంత రాజులు. వారి ప్రమేయం లేకుండా చీమ కూడా చిటుక్కుమనని పరిస్థితులు ఉన్నాయి. పోలీస్ నుంచి రెవెన్యూ అధికారుల వరకు అంతా వారు చెప్పినట్టే జరగాలి. వారు సూచించిన అధికారులే నియమితులవ్వాలి. గతంలో కాంగ్రెస్ హయాంలో ఈ విధానం ఉన్నప్పటికీ, టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మరింత దిగజారింది. ఇక మొన్నటికి మొన్న చికోటి ప్రవీణ్ వ్యవహారంలో మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్లు బయటికి వినిపించినప్పటికీ అధికార టీఆర్ఎస్ మాత్రం మౌనం వహించింది. ఇటీవల స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పోలీస్ అధికారి రివాల్వర్ తీసుకొని గాల్లోకి కాల్పులు జరపడం కలకలం సృష్టించింది. ఇది నిబంధనలకు పూర్తి వ్యతిరేకమైనా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గతంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వ అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినా ప్రభుత్వం మిన్నకున్నది. బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థులు చేస్తున్న సమ్మెను సిల్లీ గా అభి వర్ణించి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభాసుపాలయ్యారు. నిరుద్యోగులంతా హమాలీ పని చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ లో తనకు వాటా ఇవ్వనందుకు సదరు వ్యాపారిపై మంత్రి మల్లారెడ్డి ఫోన్లో చేసిన బెదిరింపులు అప్పట్లో సంచలనం సృష్టించాయి.

Telangana Ministers Controversies
kcr

ప్రగతి భవన్ మౌనం వెనుక

పార్టీపై కేసీఆర్ పట్టు సడలుతోంది. ఇందుకు ఇటీవల జరిగిన సంఘటనలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. మంత్రివర్గంలో ఉన్న వారంతా కేటీఆర్ కు సన్నిహితులు. పైగా కేటీఆర్ అండ చూసుకుని వారు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఎటువంటి సంఘటన జరిగినా ముఖ్యమంత్రి నుంచి నేరుగా ఫోన్లు వచ్చేవి. తర్వాత పరిస్థితి అంత సెట్ రైట్ అయ్యేది. కానీ ఎప్పుడైతే కేటీఆర్ కు పార్టీ బాధ్యతలు అప్పగించారో అప్పటినుంచే క్రమశిక్షణ లోపించింది. ఫలితంగా మంత్రుల నోటికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. మొన్నటికి మొన్న పల్లె ప్రగతి కార్యక్రమంలో ఖాళీ మద్యం సీసాలు అమ్మి ఆ నగదును ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై నెటిజన్లు మంత్రి దయాకర్ రావు ను ఒక ఆట ఆడుకున్నారు. ప్రస్తుతం మంత్రుల అవినీతి వ్యవహారంతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తల పట్టుకుంటున్నారు. తన అల్లుడు అభిషేక్ బెనర్జీకి పార్టీ బాధ్యతలు అప్పగించడం వల్లే ఇదంతా జరిగిందని ఇప్పుడు ఆమె మదన పడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో అటువంటి పరిస్థితి లేకపోయినప్పటికీ మునుముందు జరిగేది అదే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Also Read:Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సడెన్ ప్లాన్ ఛేంజ్.. ఏపీలో అధికారమే లక్ష్యంగా ఆ వ్యూహం

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular