సమాంతర రాజకీయ పరిణామాలు: రామ మందిరం, సచిన్ పైలట్

రామమందిర నిర్మాణం – రాజకీయ కోణం    ఎట్టకేలకు రామమందిర నిర్మాణం మొదలవుతుంది. ఆగస్ట్ 5వ తేదీ భూమి పూజ ముహూర్తం ఖరారయ్యింది. ప్రధానమంత్రి మోడీ స్వయంగా హాజరవుతున్నట్లు ద్రువీకరించబడింది. మాములుగానయితే ఇది రొటీన్ లో భాగంగా జరిగిపోయేదేమో. ఇప్పుడు దీనికి శరద్ పవార్ వ్యాఖ్యానంతో దేశవ్యాప్త చర్చ మొదలయ్యింది. శరద్ పవార్ ఇప్పుడున్న సమాంతర రాజకీయ నాయకుల్లో సీనియర్, రాజకీయాల్లో ఆరితేరిన చాణిక్యుడు. ముఖ్యంగా మహారాష్ట్ర రాజకీయాల్లో అందరికన్నా పైఎత్తులో వున్నవాడు. ప్రధానమంత్రి మోడీతో సహా […]

Written By: Ram, Updated On : July 21, 2020 4:22 am
Follow us on

రామమందిర నిర్మాణం – రాజకీయ కోణం   

ఎట్టకేలకు రామమందిర నిర్మాణం మొదలవుతుంది. ఆగస్ట్ 5వ తేదీ భూమి పూజ ముహూర్తం ఖరారయ్యింది. ప్రధానమంత్రి మోడీ స్వయంగా హాజరవుతున్నట్లు ద్రువీకరించబడింది. మాములుగానయితే ఇది రొటీన్ లో భాగంగా జరిగిపోయేదేమో. ఇప్పుడు దీనికి శరద్ పవార్ వ్యాఖ్యానంతో దేశవ్యాప్త చర్చ మొదలయ్యింది. శరద్ పవార్ ఇప్పుడున్న సమాంతర రాజకీయ నాయకుల్లో సీనియర్, రాజకీయాల్లో ఆరితేరిన చాణిక్యుడు. ముఖ్యంగా మహారాష్ట్ర రాజకీయాల్లో అందరికన్నా పైఎత్తులో వున్నవాడు. ప్రధానమంత్రి మోడీతో సహా అందరూ తనమాటకి గౌరవం ఇస్తారు. కాకపోతే అప్పుడప్పుడు వివాదాల్లో చిక్కుకుంటాడు. ఆయన ఆగస్టు 5వ తేది భూమి పూజపై తనదైన నర్మగర్భ వ్యాఖ్యానం చేసాడు. వాస్తవానికి సుప్రీం కోర్టు తీర్పు తర్వాత అదేమీ వివాదాంశం కాదు. 100 కోట్ల హిందువుల మనోభావాలకి సంబంధించినది కూడా. అయినా రామమందిర నిర్మాణం పై అలాంటి వ్యాఖ్యానం చేయటం వెనక ఆంతర్యం ఏమిటనేది పరిశీలకులు పలు విధాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ‘కొంతమంది రామమందిర నిర్మాణంతో కరోనా మహమ్మారిని అరికట్ట వచ్చని భావిస్తున్నారు’ అని చెప్పటం వ్యంగంగా రామమందిర నిర్మాణం పై అయిష్టతని వ్యక్తం చేయటమే. అలా ఎందుకు వ్యాఖ్యానం చేసాడో నని కొంతమంది తలలు పట్టుకుంటుంటే ఆయన అనుయాయులు మాత్రం ఇది వ్యూహాత్మకంగా చేసిందేనని సమర్ధించుకుంటున్నారు. మహారాష్ట్రలో మైనారిటీలు అటు కాంగ్రెస్, ఇటు ఎన్ సి పి ల మధ్య చీలి వున్నారు. ఆ వోటు బ్యాంకు పదిలం చేసుకోవటానికే ఇలా మాట్లాడని సమర్ధించుకుంటున్నారు. కానీ ఈ వ్యాఖ్యానం హిందువుల్లో శరద్ పవార్ పై ఆగ్రహం పెల్లుబికింది. శరద్ పవార్ పై సానుభూతి వున్నవాళ్ళు కూడా తను ఇలా మాట్లాడటం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే అవకాశంగా తీసుకొని మహారాష్ట్ర లోని కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు ప్రధానమంత్రి ఈ భూమిపూజ కు హాజరు కావటాన్ని తప్పుపట్టాడు. సోమనాథ దేవాలయం పునరుద్దరణ తర్వాత ప్రారంభోత్సవానికి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వెళ్ళక పోవటాన్ని ఉదాహరణగా వుటంకించాడు. కానీ అదే సమయంలో ప్రధమ రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ హాజరైన సంగతి కావాలనే దాటవేశాడు. వాస్తవానికి నెహ్రూ వెళ్లోద్దని వారించినా రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యాడు. సెక్యులర్ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్రపతి హాజరైనప్పుడు రామమందిరం కడతామని వాగ్దానం చేసిన బిజెపి కి చెందిన ప్రధాన మంత్రి ని వెళ్లోద్దని చెప్పటం హాస్యాస్పదంగా వుంది. మోడీ ని ఎటూ ఆపలేమని తెలిసినా ప్రకటన ఇవ్వటం లో ఉద్దేశం ఆపాలని కాదు , ముస్లిం వర్గాల్లో మేము వ్యతిరేకించామని చెప్పుకోవటం కోసమే నని అర్ధమవుతుంది.

నిజమే రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం అందరికీ సంబందించింది కాబట్టి మతపర కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పటం వినటానికి మంచిగా అనిపించొచ్చు. కానీ అసలు ఈ సూత్రబద్ధ వైఖరిని మొదట్నుంచీ అధికారం లో వున్న కాంగ్రెస్ ఎప్పుడూ పాటించలేదు. 72 సంవత్సరాలలో ఎక్కువకాలం అధికారం లో వున్న కాంగ్రెస్ నేర్పిన సంస్కృతి ఇదే కదా. ఇప్పుడు సడెన్ గా వీళ్ళకు సెక్యులరిజం గుర్తుకు రావటం ఆశ్చర్యంగా వుంది. ఇంత డొంక తిరుగుడేందుకు మాకు రామ మందిర నిర్మాణం ఇష్టంలేదని డైరెక్టుగా చెప్పొచ్చు కదా. ఇటువంటి చేష్టల వలన మెజారిటీ హిందువుల్లో రోజు రోజుకీ విశ్వాసం కోల్పోతున్నారని వీళ్ళకు అర్ధం కావటం లేదు. అదీ ఈ అంశం ఎన్నో ఏళ్ళనుంచి అపరిష్కృతంగా వుండి  ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత మరలా అగ్గి రాజేయ్యటం అవసరమా? ఇదే ముస్లిం మత ప్రాధాన్య అంశ మయితే మాట్లాడే వాళ్ళా? ఈ నకిలీ సెక్యులరిజం తోనే ఇబ్బందల్లా. ఇన్ని వందల సంవత్సరాలుగా నలుగుతున్న ఈ సమస్యకు ఇప్పటికైనా పరిష్కారం దొరికినందుకు సంతోష పడాల్సింది పోయి మరలా దీన్ని కెలుక్కోవటం దేనికి? మైనారిటీ ఓట్ల కోసమేనా? ఇప్పటికైనా ఈ సమస్యకు ఫులుస్టాప్ పెట్టి ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తే మంచిది. ప్రజలు ఇప్పటికే మతపరంగా విభజించబడి వున్నారు. ఇంకా ఈ క్రీడ కొనసాగించాలని ఈ ‘ సెక్యులరిస్టులు’ కోరుకుంటున్నారా?

సచిన్ పైలట్ నిజంగా అంత దుర్మార్గుడా?

గాంధీ కుటుంబ విధేయులు అదేపనిగా సచిన్ పైలట్ పదవీ వ్యామోహపరుడని, డబ్బులు ఇవ్వజూపాడని, ఇంత యుక్త వయసులోనే అంత పదవీ కాంక్ష పనికిరాదని అన్ని ప్రచార మాధ్యమాల్లోనూ పుంఖాను పుంఖాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అశోక్ గెహ్లాట్ అయితే ఇంకా దారుణంగా మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యమేమంటే ఎటువంటి అర్హతలు లేని రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు గా వచ్చినప్పుడు ఈ వ్యాఖ్యానాలు చేయలేదే. అప్పటికి తను చేసిన ఘనకార్యం ఒక్కటి కూడా లేదు. అయినా అధ్యక్షుడయ్యాడు. అటువంటిది పూర్తిగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీని కింది స్థాయి నుంచి ఇటుకమీద ఇటుక పేర్చుకుంటూ వచ్చి అయిదు సంవత్సరాల్లో బిజెపి ని డీ అంటే డీ కొట్టి తిరిగి అధికారం లోకి తీసుకొచ్చిన ఘన కార్యం సాధించిన సచిన్ పైలట్ కి మాత్రం అర్హతలేదు. అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా దొడ్డిదారిన అధిష్టానం మెప్పుతో వచ్చి బిఎస్పి బానర్ లో ఎన్నికైన ఆరుగురు ఎంఎల్ఏల ను అమాంతం తన పార్టీలో కలిపేసుకున్నప్పుడు ఈ నీతి రాజకీయాలు ఏమైనాయి? వాళ్ళందరూ ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండానే కాంగ్రెస్ లో చేరారా? ఇప్పుడున్న సమాంతర రాజకీయాల్లో నూటికి నూరుపాళ్ళు నీతిమంత రాజకీయాలను వెతకటం నేతి బీరకాయలో నేయిని వెదికినట్లే. కాకపోతే వున్నవాళ్లలో మెరుగెవరో వెదుక్కోవాల్సిందే. ఈ రకంగా చూస్తే రాజస్తాన్ లో కాంగ్రెస్ ని తిరిగి అధికారం లోకి తీసుకురావటం లో సచిన్ పైలట్ ది కీలకపాత్ర. అందరిలాగా డిల్లీ నుంచి చక్రం తిప్పకుండా జైపూర్ కి మకాం మార్చి అయిదు సంవత్సరాలు కష్టపడి పార్టీని నడిపించిన తీరు అన్ని వర్గాల్లోనూ ప్రశంసలు కురిపించింది. ఈరోజు తనని, తన క్యారక్టర్నిదెబ్బ తీసేపనిని అదేపనిగా చేయటం మొదటికే మోసమొస్తుందని గ్రహిస్తే మంచిది. ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణుల్లో సచిన్ పైలట్ వ్యవహారం ఓ కుదుపు కుదిపిందని అనిపిస్తుంది.

అసలు కాంగ్రెస్ మీదా, గాంధీ కుటుంబం మీదా ఇంత ప్రతికూలత ఎప్పుడూ లేదు. ఒక ప్రజాస్వామ్య, ఉదారవాద జాతీయ పార్టీ గాంధీ కుటుంబ రహితంగా ఏర్పడటానికి భూమిక ఇప్పుడు ఏర్పడింది. ఇప్పుడు వచ్చిన సానుకూల వాతావరణాన్ని దేశ రాజకీయాల్లో ఓ సరికొత్త జాతీయ పార్టీకి పునాదులు పడేటట్లు చేయాలి. అందుకు సచిన్ పైలట్ పూనుకోవాలి. కొంతమంది వాదిస్తున్నట్లు ఇంతకుముందు ఎంతోమంది ఈ పనికి పూనుకొని బొక్కబోర్లా పడ్డారని ఇప్పుడు సచిన్ సంగతికూడా అంతేనని పెదవి విరుస్తున్నారు. శరద్ పవార్, మమతా బెనర్జీ లాంటి యోధాను యోదులే ఏమీ చేయలేకపోయారని ఈసారి కూడా ఇది వృధా ప్రయాస ప్రయోగమని చెబుతున్నారు. కానీ ఈ మేధావులు అర్ధంచేసుకోవాల్సింది ఏమిటంటే పరిస్థితుల్లో అప్పటికీ ఇప్పటికీ ఎన్నో మార్పులు వచ్చాయని. ఇప్పుడు 21వ శతాబ్దపు తరం మనుషుల్లో ఆలోచనలు, ఆకాంక్షలు విన్నూత్నంగా వున్నాయి. సంప్రదాయ ఆలోచనలు వీళ్ళను ప్రభావితం చేయలేవు. గాంధీ కుటుంబం పూర్తి గా స్వయం వినాశన పంధాలో నడుస్తుంది. వచ్చే నాలుగు సంవత్సరాల్లో ఈ కుటుంబం ఇంకా అప్రతిష్ట పాలు కావటం ఖాయం. మోడీ-అమిత్ షా ద్వయం ఈ పనిని పటిష్టంగా నెరవేరుస్తారు. ప్రజల్లో ఈ కుటుంబ పరువు, ప్రతిష్ట అధః పాతాళానికి వెళ్ళటం ఖాయం. అదేసమయం లో జాతీయ స్థాయి లో రెండో ప్రత్యామ్నాయం ఉండాల్సిన అవసరం ఎంతయినావుంది. ఆ ఆలోచన కూడా ప్రజల్లో బలంగా వుంది. సచిన్ పైలట్ కి శరద్ పవార్ కున్న స్థాయి, అంగబలం, అర్ధబలం లేకపోవచ్చు. కానీ ఎంతోమంది ఈ ఆలోచనలున్నవాళ్ళు వెన్నంటి నడిచే అవకాశం వుంది. కావాల్సిందల్లా పట్టుదల, ఓర్పు, మార్పు తీసుకురావాలనే బలమైన ఆకాంక్ష. ఇప్పటికే బిజెపి కొత్త తరాన్ని పట్టుకోవటంలో చాలా ముందుంది. కానీ దానికి కొన్ని పరిమితులు కూడా వున్నాయి. 21వ శతాబ్దపు తరం మతం, కులం, ప్రాంతం లాంటి విషయాల్లో విన్నూత్నంగా ఆలోచిస్తున్నారు. వాటిని ఒడిచిపట్టేపార్టీని కనుక వాళ్ళముందు వుంచగలిగితే అందుకోవటానికి సిద్ధంగా వుంటారు. అమెరికాలో 2016 లో జరిగిన పరిణామాలు చూస్తే ఈ ఆలోచనలు ఎలా ఉంటాయో అర్ధమవుతుంది. రెండు పార్టీల్లోనూ సంప్రదాయ పద్ధతుల్ని కాదని ఓటు వేసారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా ట్రంప్ ఎన్నిక ఇందుకు ఉదాహరణ. అలాగే డెమోక్రటిక్ అభ్యర్ధి గా బెర్నీ సాండర్స్ తుదిదాకా రావటం కూడా కొత్త తరపు ఆలోచనలు ఎవరి అంచనాలకి అందవని అర్ధమయ్యింది. మన దేశం లో కూడా ప్రజల్లో బిజెపి కి సరయిన ప్రత్యామ్నాయం లేదనే భావం బలంగా వుంది. ఆ ప్రత్యామ్నాయం గాంధీ కుటుంబం ద్వారా రాదని కూడా అదే భావన వుంది. కాబట్టి గాంధీ కుటుంబ రహిత జాతీయ పార్టీ నిర్మాణమే ప్రజలు కోరుకుంటున్నారు. అప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా వుంటుంది. ఆ పని సచిన్ పైలట్ చేస్తాడని ఆశిద్దాం.