CWC Meetings In Hyderabad: నరేంద్ర మోడీని ఎదుర్కొనేందుకు.. హైదరాబాదు నుంచి కాంగ్రెస్ “పంచ”తంత్రం

కర్ణాటక రాష్ట్రంలో గెలిచిన తర్వాత.. ఆ ఫార్ములను దేశం మొత్తం అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్ వేదికగా శనివారం నుంచి ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాలలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

Written By: Bhaskar, Updated On : September 17, 2023 1:35 pm

CWC Meetings In Hyderabad

Follow us on

CWC Meetings In Hyderabad: కర్ణాటకలో గెలిచింది. దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. అధికార బిజెపి చేస్తున్న తప్పిదాలను ప్రశ్నిస్తోంది. దేశంలో ప్రతిపక్షాలను ఒక్క తాటిపైకి తీసుకువచ్చింది. దానికి ఇండియా అనే పేరు పెట్టింది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి ముందే ఒక ఒప్పందాన్ని రచించింది. గతంలో చేసిన తప్పిదాలకు తావు ఇవ్వకుండా ఈసారి మెరుగ్గా పనిచేయాలని ఒక నిర్ణయానికి వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ చేసింది, చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే ఆ పార్టీలో ఇలాంటి విప్లవాత్మకమైన మార్పులు ఆశించడం సగటు భారతీయ ఓటర్ కు, కాంగ్రెస్ కార్యకర్తకు మింగుడు పడని అంశమే. అధికారానికి దూరమై దశాబ్దం గడిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అంతర్మథనం మొదలై ఇప్పుడు ఈ నిర్ణయాలు తీసుకునే దాకా వచ్చింది.

కర్ణాటక రాష్ట్రంలో గెలిచిన తర్వాత.. ఆ ఫార్ములను దేశం మొత్తం అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్ వేదికగా శనివారం నుంచి ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాలలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్ద పెద్ద నేతలు మొత్తం ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో ఆ పార్టీలో ఎక్కడా లేని ఉత్సాహం నెలకొంది. ఇదే క్రమంలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం జమిలీ లేదా మినీ జమిలీ ఎన్నికలు నిర్వహించినా అధికారంలోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఒక అంగీకారానికి వచ్చింది. క్షేత్రస్థాయిలో ప్రజలకు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పాలని కార్యవర్గానికి సూచించింది..”ఇండియా కూటమిని ఎదుర్కోలేక బిజెపి ప్రభుత్వం జమిలి ఎన్నికలను తెరపైకి తెస్తున్నది. ఒకే దేశం ఒకే ఎన్నికలు రాజ్యాంగానికి అవమానం. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. దీనిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ ఆ తరహాలో ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సరిపడా సంఖ్యాబలం లేకపోయినందు వల్ల.. చాలా తెలివిగా ఇతర ప్రధాన సమస్యలను బిజెపి పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా కాలికి బలపం కట్టుకుని తిరిగే నరేంద్ర మోడీ మణిపూర్ గొడవపై ఎందుకు మాట్లాడటం లేదు.. ఇదే నా బిజెపి పరిపాలిస్తున్న తీరు” అని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ద్వారా దేశ ప్రజలకు కాంగ్రెస్ నాయకులు వివరించే ప్రయత్నం చేశారు. “మే ఐదు నుంచి మణిపూర్ రాష్ట్రం తగలబడుతోంది. ఇప్పటికీ 157 రోజులు పూర్తయ్యాయి. 300 మంది హత్యకు గురయ్యారు. అయినప్పటికీ మణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించాలని నరేంద్ర మోడీ అనుకోవడం లేదు” అని కాంగ్రెస్ నాయకులు బిజెపి పరిపాలనలో జరుగుతున్న లోటుపాట్లను వెలుగులోకి తెచ్చారు.

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో ఏడు నెలలు ఎగుమతుల్లో క్షీణత, నిత్యావసరాల ధరలు పెరగడం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు పెంచడం, అంతర్జాతీయంగా చమురు ధరలు తగుతున్నప్పటికీ, దేశీయంగా తగ్గించకపోవడం వంటి విషయాలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీవ్రంగా ధ్వజమెత్తింది. చైనా మన భూ భాగాన్ని ఆక్రమించుకున్నప్పటికీ, కేంద్రం నిమ్మకు నీరు ఎత్తిన విధంగా ఉంటున్నదని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. అయితే త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. తాము విజయం సాధిస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఈ సి డబ్ల్యూ సి మీటింగ్ ద్వారానే ఆ ఎన్నికలకు సంబంధించి ఒక రోడ్డు మ్యాప్ సిద్ధం చేశామని చెబుతున్నారు. అయితే క్రితం సారి రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి మించి ఈసారి ఎక్కువ సంఖ్యలో నాయకులు హాజరు కావడం.. చాలా అంశాల్లో ఏకాభిప్రాయం రావడంతో కేడర్లో ఉత్సాహం నెలకొంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పట్టు పెంచుకున్న నేపథ్యంలో.. ఇక్కడ కూడా అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి ఈ సమావేశాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం, దీనికి పార్టీ క్యాడర్ నుంచి సహకారం లభించడం తో.. అధిష్టానం కూడా ఉబ్బితబ్బిబవుతోంది.