Congress vs BJP: దేశంలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక 2014 నుంచి 2024 వరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. రెండు కూటముల పదేళ్ల పాలన సరిపోల్చాల్సిన సమయం ఇదే. ఎవరి పాలన ఎలా ఉందో ప్రజలకు తెలియాల్సిన, తెలుసుకోవాల్సిన అసవరం కూడా ఉంది. కాంగ్రెస్ విధానాలు సామాజిక సంక్షేమం, మైనారిటీ హక్కులు, సమ్మిళిత ఆర్థిక విధానాలు, మైనారిటీలు, పట్టణ మేధావులు, గ్రామీణ ఓటర్లపై ఆధారపడి ఉంది. బీజేపీ విధానాలు హిందుత్వ, మార్కెట్–ఆధారిత ఆర్థిక సంస్కరణలు, జాతీయ భద్రతపై ఉన్నాయి.
ఆర్థిక వృద్ధి ఇలా..
2004–2014 మధ్య కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం జీడీపీలో 94% వృద్ధిని సాధించగా, 2014–2024 మధ్య బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలనలో జీడీపీ 77% పెరిగింది. జీడీపీ లెక్కింపు విధానంలో మార్పులు బీజేపీ హయాంలో సంభవించినప్పటికీ, కాంగ్రెస్ కాలంలో ఆర్థిక వృద్ధి గణనీయంగా ఎక్కువగా ఉంది. తలసరి ఆదాయంలో కాంగ్రెస్ పాలనలో 69% వృద్ధి నమోదైంది, అయితే బీజేపీ హయాంలో ఇది 60% మాత్రమే. ప్రపంచంలో 195 దేశాల్లో భారత్ తలసరి జీడీపీ ప్రకారం 136వ స్థానంలో ఉండటం దేశంలో ఆర్థిక అసమానతలను సూచిస్తుంది.
స్టాక్ మార్కెట్ పనితీరు..
స్టాక్ మార్కెట్ సూచిక అయిన సెన్సెక్స్ 2004–2014 మధ్య 300% పెరిగింది, బీజేపీ పాలనలో (2014–2024) 229% వృద్ధి నమోదైంది. కాంగ్రెస్ కాలంలో స్టాక్ మార్కెట్ బలమైన పనితీరును కనబరిచింది.కాంగ్రెస్ పాలనలో ఎగుమతులు 273% పెరగగా, బీజేపీ హయాంలో కేవలం 76% వృద్ధి కనిపించింది. విదేశీ పెట్టుబడుల విషయంలో కూడా కాంగ్రెస్ పాలనలో 646% వృద్ధి సాధించగా, బీజేపీ కాలంలో 79% మాత్రమే పెరిగింది. ద్విచక్రవాహనాల అమ్మకాలు కాంగ్రెస్ హయాంలో 158% పెరగగా, బీజేపీ పాలనలో 23% మాత్రమే పెరిగాయి. అదేవిధంగా, కార్ల అమ్మకాలు కాంగ్రెస్ కాలంలో 145% వృద్ధి చెందగా, బీజేపీ హయాంలో 65% పెరిగాయి.
Also Read: Monks Blackmail News: సన్యాసులను సన్నాసులను చేసింది.. “రెచ్చగొట్టి” 102 కోట్లు వసూలు చేసింది!
ప్రభుత్వ అప్పు, ఆర్థిక క్రమశిక్షణ..
ప్రభుత్వ అప్పు కాంగ్రెస్ పాలనలో 217% పెరగగా, బీజేపీ హయాంలో 189% వృద్ధి నమోదైంది, ఇది కొంతమేర ఆర్థిక క్రమశిక్షణను సూచిస్తుంది. అయితే, బీజేపీ పన్నులు పెంచడం, ఖర్చులు పెంచడం వంటి విధానాలు ఆర్థిక ప్రగతిని కొంతమేర పరిమితం చేశాయి.
పాలనా విధానాలు..
మోదీ ‘‘మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్’’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చినప్పటికీ, ఎస్‌బీఐ, బీఎస్‌ఎన్‌ఎల్ వంటి సంస్థలకు ప్రత్యేక సాయం అందించడం, సోషలిస్టు ఆంక్షలు విధించడం వంటి చర్యలు ఆర్థిక సంస్కరణలకు అడ్డంకిగా నిలిచాయి. హిందుత్వ ఎజెండాపై దృష్టి సారించినప్పటికీ, అభివృద్ధి లక్ష్యాల్లో బీజేపీ విఫలమైందనే విమర్శలు ఉన్నాయి.