Congress : కాంగ్రెస్ సీట్లు : ఖమ్మం నుంచి తుమ్మల, పాలేరు నుంచి పొంగులేటి

భద్రాచలం టికెట్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు దాదాపు ఖరారయినప్పటికీ, పొత్తులో సీపీఎంకు కేటాయిస్తే వీరయ్యను పినపాకకు మార్చే అవకాశం ఉంది.

Written By: Bhaskar, Updated On : October 14, 2023 7:51 pm
Follow us on

Congress : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఒక స్పష్టత వచ్చింది. ఖమ్మం నుంచి మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావును, పాలేరును మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎన్నికల బరిలో దింపాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. శనివారం కాంగ్రెస్‌ అధిష్ఠానం ఢిల్లీలో ఈ ఇద్దరు నేతలతో భేటీ అయింది. ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తే పార్టీకి అనుకూలంగా ఉంటుందో చర్చించింది. దీనికి ఈ ఇద్దరు కూడా ఓకే చెప్పడంతో కాంగ్రెస్‌ సీట్ల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. ఇందుకు ఇద్దరు నేతలు కూడా అంగీకారం తెలిపారు.

పాలేరు నుంచి బరిలోకి దిగాలనుకున్నారు

వాస్తవానికి గత ఎన్నికల్లో పాలేరు నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా ఓటమి పాలయిన మంత్రి తుమ్మల ఈసారి కూడా అక్కడ నుంచే బరిలో దిగాలని భావించారు కాంగ్రెస్‌ పార్టీలో చేరేటప్పుడు కూడా పాలేరులో టికెట్‌ విషయంలో హామీ పొందారు. అయితే మాజీ ఎంపీ పొంగులేటి పేరు ఖమ్మం నుంచి పరిశీలనలో ఉండగా, ఆయన పాలేరు టికెట్‌ విషయంలో ఆసక్తి చూపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ ప్రభావం, పాలేరు నియోజకవర్గంలో షర్మిల పోటీ చేయబోతున్నట్టు చేసిన ప్రకటన, తాజా రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఇద్దరు నేతలను పిలిచి ఇద్దరికి సీట్ల కేటాయించింది. ఖమ్మం నుంచి తుమ్మలను పోటీ చేయాలని పాలేరు నుంచి పొంగులేటి ని బరిలో దిగాలని సూచించింది. దీనికి ఇద్దరు నేతలు సముఖత వ్యక్తంచేశారు. తర్వాత రాహుల్‌గాంధీతో తుమ్మల భేటీ అయినప్పుడు ఖమ్మం నుంచే పోటీ చేయాలని తుమ్మలకు సూచించగా ఆయన అంగీకారం తెలిపారు. దీంతో ఇద్దరు నేతలు సీట్ల కేటాయింపు కొలిక్కిరావడంతో జిల్లాలో ఇతర నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక సాగనుంది.

భట్టి పేరు అధికారికంగా ప్రకటించడమే మిగిలింది

మధిర నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేరు అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉంది. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య సీటు సీపీఎంకు పొత్తులో భాగంగా కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. భద్రాచలం సీటు ఒకవేళ సీపీఎంకు ఇవ్వని పక్షంలో తిరిగి పొదెం వీరయ్య బరిలో దిగనున్నారు. కాగా మిగిలిన నియోజకవర్గాల్లో సీట్ల ఎంపిక కసరత్తు నడుస్తుంది. కొత్తగూడెం సీటు సీపీఐకి పొత్తులో కేటాయిస్తారని తెలిసింది. కొత్తగూడెం సీపీఐకి కేటాయిస్తే ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెంనుంచి బరిలో దిగనున్నారు. ఇల్లెందు నుంచి జడ్పీచైర్మన్‌ కోరం కనకయ్య పేరు ప్రధానంగా వినిపిస్తుండగా మరికొన్ని పేర్లు అధిష్ఠానం పరిశీలనలో ఉన్నాయి. ఇక్కడ 30మందికిపైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు.

మిగతా నియోజకవర్గాలలో..

సత్తుపల్లిలో మాజీమంత్రి సంబాని చంద్రశేఖర్‌, మట్టా దయానంద్‌ సతీమణి రాగమయి, కొండూరు సుధాకర్‌, వక్కలగడ్డ సోమ చంద్రశేఖర్‌, మానవతారాయ్‌ టికెట్లు ఆశిస్తున్నారు. వైరాలో మాలోత్‌ రాందాస్‌నాయక్‌, బానోతు విజయాబాయి, బాలాజీనాయక్‌, రాంమ్మూర్తినాయక్‌లు టికెట్లు ఆశిస్తున్నారు. ఇక్కడ సీఎల్పీనేత భట్టి విక్రమార్క, కేంద్రమాజీమంత్రి రేణుకాచౌదరి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ వర్గీయుల కోసం పట్టుబడుతున్నారు. అశ్వారావుపేటలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ సున్నం నాగమణి, జాడే ఆదినారాయణ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కొత్తగూడెంలో సీపీఐకి సీటు కేటాయించని పక్షంలో బీసీ కోటా కింద యడవల్లి కృష్ణ పేరు పరిశీలనో ఉంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరారవు తదితరులు టికెట్‌ ఆశిస్తున్నారు. పినపాకలో మాజీ ఎంపీ పొంగులేటి వర్గీయుడు మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ గాంధీతోపాటు పలువురు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. భద్రాచలం టికెట్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు దాదాపు ఖరారయినప్పటికీ, పొత్తులో సీపీఎంకు కేటాయిస్తే వీరయ్యను పినపాకకు మార్చే అవకాశం ఉంది.