Congress Ready Early Elections: తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో టీఆర్‌ఎస్, బీజేపీ కంటే ఒక అడుగు ముందే ఉండాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే టీపీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నాయకులు డిసెంబర్‌లో రాష్ట్ర అసెంబ్లీ రద్దవుతుందని స్పష్టంగా చెబుతున్నారు. ఈ క్రమంలో అధికార టీఆర్‌ఎస్‌కు మరో అవకాశం ఇవ్వకుండా, బీజేపీ బలపడకముందే ఎన్నికలను ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతోంది. ఎన్నికలు ఎప్పుడు వస్తాయో అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుండగానే.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితానే రెడీ చేసింది. తాజాగా ఈ జాబితా బయటకు వచ్చింది. నియోజకవర్గాల వారీగా పోటీ చేసే అభ్యర్థులు వీరేనంటూ టీపీసీసీ నుంచి ఏఐసీసీకి జాబితా వెళ్లినట్లు పార్టీ వర్గాలు లీకులిస్తున్నాయి. అయితే రేవంత్ వర్గమే ఈ ప్రచారాన్ని తెరపైకి తీసుకువచ్చిందనే అనుమానాలున్నాయి. దీనిపై పార్టీలోని సీనియర్లు కూడా భగ్గుమంటున్నారు.
గతంలో ఏఐసీసీ నుంచి జాబితా..
గతంలో ఏఐసీసీ నుంచి అభ్యర్థుల జాబితా బయటకు వచ్చేది. ఏఐసీసీ అధ్యక్షులు నిర్వహించిన సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేసేవారు. ఇటీవల రాహుల్‌గాంధీ రాష్ట్ర ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలోనూ అందరూ అభ్యర్థుల ఎంపిక బాధ్యత ఏఐసీసీకే అప్పగించారు. కానీ, తాజాగా 119 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లుగా ఒక జాబితా ఇప్పుడు చెక్కర్లు కొడుతోంది.
Also Read: Rewanth Reddy- Sharmila: షర్మిలను కలుపుకుంటున్న రేవంత్ రెడ్డి
రేవంత్ అనూకూలుల పేర్లే ఎక్కువ..
తాజాగా నియోజకవర్గాల వారీగా బయటకు వచ్చిన జాబితాలో గతంలో నుంచి పార్టీలో పని చేస్తున్న వారితోపాటుగా రేవంత్‌రెడ్డితో హస్తం పార్టీలో చేరిన వారి పేర్లు కూడా దర్శనమిస్తున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ టీం మొత్తాన్ని పలు నియోజకవర్గాల్లో సర్దుబాటు చేశారు. సిట్టింగ్‌ల స్థానాల్లో వారే ఉండగా.. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. రేవంత్ వెంట నడిచిన వారికి ఎక్కడో ఓ చోట పోటీకి అవకాశం కల్పించారు. పెద్దపల్లిలో విజయరమణారావు, వరంగల్ తూర్పులో వేం నరేందర్‌రెడ్డి, నకిరేకల్‌లో ప్రీతం, గోషామహల్‌లో మెట్టు సాయికుమార్ పేర్లు ఉండగా.. జడ్చర్లలో మల్లు రవికి బదులుగా ఎర్ర శేఖర్ లేదా అనురుధ్‌రెడ్డి, పరకాలలో కొండా సురేఖ, నర్సంపేటలో దొంతి మాధవరెడ్డికి అవకాశం కల్పిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక జనగామ నుంచి పొన్నాల లక్ష్మయ్యతోపాటుగా కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, పాలకుర్తి నుంచి జంగా రాఘవరెడ్డి, వరంగల్ వెస్ట్ నుంచి నాయిని రాజేందర్‌రెడ్డి, ములుగులో సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క, భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణ పేరును జాబితాలో చేర్చారు. నర్సంపేటలో దొంతి మాధవరెడ్డి గతంలో స్వతంత్ర అభ్యర్థిగా అక్కడి నుంచి గెలిచారు. భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణ టీడీపీలో ఉండగా.. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి వెంట నడుస్తున్నారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ సెగ్మెంట్‌లో ఇప్పటి వరకు దాసోజు శ్రవణ్ పోటీ చేస్తుండగా.. తాజాగా రేవంత్‌రెడ్డి సమీప బంధువు రోహన్‌రెడ్డి పేరు వినిపిస్తోంది.
అసెంబ్లీ జాబితాలో ఎంపీల పేర్లు..
కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంట్ స్థానాల్లో గెలిచిన ఎంపీలు ఈసారి అసెంబ్లీ స్థానాల్లో పోటీకి దిగుతారని జాబితా బట్టి అంచనా వేస్తున్నారు. నల్గొండ అసెంబ్లీ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హుజూర్‌నగర్ నుంచి ఉత్తమ్, కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి పేర్లు వస్తున్నాయి. కోదాడ నుంచి ఉత్తమ్ భార్య పద్మావతి పేరు మరోసారి పోటీ చేయనున్నారు. ఇక సూర్యాపేట నుంచి దామోదర్‌రెడ్డి లేదా పటేల్ రమేష్‌రెడ్డి, ఆలేరు నుంచి బీర్ల ఐలయ్య పేర్లు జాబితాలో ఉన్నాయి. నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డికి అవకాశం ఇస్తున్నట్లుగా జాబితాలో పేర్కొన్నారు. అయితే, జానారెడ్డి ఈసారి మిర్యాలగూడ నుంచి బరిలో నిలవనున్నట్లు లిస్ట్‌లో పేరు చేర్చారు. భువనగిరి నుంచి కుంభం అనిల్‌కుమార్, తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్, దేవరకొండ నుంచి కిషన్‌నాయక్, బాలూనాయక్ పేర్లు కనిపిస్తున్నాయి. అటు నాగర్ కర్నూల్ నుంచి నాగం జనార్దన్‌రెడ్డి, కొల్లాపూర్ నుంచి కేతూరి వెంకటేశ్ లేదా జగదీశ్వర్, అభిలాష్‌రావు, మహబూబ్‌నగర్ నుంచి ఓబెదుల్లా, ఎన్‌పీ.వెంకటేష్, జంజీవ్ పేర్లు జాబితాలో ఉన్నాయి. దేవరకద్ర నుంచి జీఎంఆర్, ప్రదీప్‌కుమార్‌గౌడ్, షాద్‌నగర్ నుంచి వీర్లపల్లి శంకర్, గద్వాల నుంచి రాజీవ్‌రెడ్డికి టికెట్ ఇవ్వాలని జాబితాలో సూచించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి పేరుండగా.. ఆంధోల్ నుంచి దామోదర రాజనర్సింహ, నారాయణఖేడ్ నుంచి మాజీ ఎంపీ సురేష్ షట్కర్, సంజీవ్ పేర్లున్నాయి.
అడవుల జిల్లా ఆదిలాబాద్ నుంచి టికెట్ ఎవరికీ ఇచ్చేది జాబితాలో లేదు. నిర్మల్‌లో మహేశ్వర్‌రెడ్డి పోటీ చేస్తారని జాబితాలో కనిపిస్తోంది. అయితే, చెన్నూరు నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, బోడ జనార్దన్ పేర్లున్నాయి. ఇటీవలే నల్లాల ఓదెలు కాంగ్రెస్‌లో చేరారు. అటు ఆసిఫాబాద్ సెగ్మెంట్‌లో కూడా పార్టీ అభ్యర్థిపై క్లారిటీ ఇవ్వలేదు.
నిజామాబాద్ నుంచి మాజీ ఎంపీ మధుయాష్కీ పోటీ పడుతుండగా.. జాబితాలో మాత్రం మహేశ్‌కుమార్‌గౌడ్ పేరుంది. మరోవైపు కామారెడ్డి నుంచి తాను పోటీ చేస్తానని ఇటీవల టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ ప్రకటించారు. కానీ, జాబితాలో మాత్రం షబ్బీర్ అలీ పేరుంది. ఆర్మూర్, బోధన్‌లో కూడా అభ్యర్థులపై క్లారిటీ లేదు. ఎల్బీనగర్ నుంచి మల్‌రెడ్డి రాంరెడ్డి ఉండగా.. కూకట్‌పల్లి నుంచి శ్రీరంగం సత్యం, వెంగల్ రావు, కుత్బుల్లాపూర్ నుంచి భూపతిరెడ్డి, నర్సారెడ్డి, కొలను హన్మంతరెడ్డి పేర్లున్నాయి. చేవెళ్ల రాజేంద్రనగర్‌లో కూడా ఇద్దరి చొప్పున పేర్లున్నాయి. సత్తుపల్లి సెగ్మెంట్ నుంచి మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ పోటీలో ఉండగా.. అక్కడ తాజాగా మానవతారాయ్ పేరు కూడా తెరపైకి వచ్చింది.
ఇక కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్‌తోపాటుగా మాజీ మంత్రి ఎం సత్యనారాయణరావు మనవడు రోహిత్‌రావు పేరుంది. వేములవాడలో ఆది శ్రీనివాస్, మంథనిలో శ్రీధర్‌బాబు పేర్లున్నాయి. ఇక హుస్నాబాద్‌లో బొమ్మ శ్రీరాం చక్రవర్తి, సిరిసిల్లలో కేకే మహేందర్‌రెడ్డి, చొప్పదండిలో మేడిపల్లి సత్యం, హుజూరాబాద్ లో బల్మూరి వెంకట్ పోటీ చేస్తారని జాబితాలో వెల్లడైంది. మానకొండూరు నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ, రామగుండం నుంచి జనక్‌ప్రసాద్‌తోపాటుగా రాజ్‌ఠాగూర్ మక్కాన్‌సింగ్ కూడా పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.
లీక్ చేసిందెవరు?
కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి జోరుగా ఉంటోంది. గాంధీభవన్ పై దాడులు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో అధిష్టానమే కొన్నిసార్లు ఎంటరవుతోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ జాబితాను ఏఐసీసీకి పంపించారనే ప్రచారం జరుగుతోంది. దీనిలో సీనియర్లను పట్టించుకోకుండా జాబితా తయారు చేశారని సీనియర్లు అంటున్నారు. అయితే ఈ జాబితాను ఎవరు బయటకు లీకు చేశారనే అంశం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.
సీనియర్ల మండిపాటు..
అభ్యర్థుల జాబితాపై సీనియర్లు మండిపడుతున్నారు. రేవంత్‌రెడ్డి వర్గమే ఈ జాబితాను బయటకు ఇచ్చిందని, దీంతో ఆశావాహుల్లో ఆందోళన వస్తుందని ఏఐసీసీకి ఫిర్యాదు చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో ఉన్న ఎంపీ ఉత్తమ్, మాజీ ఎంపీ మధుయాష్కీ ఈ జాబితా విషయాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ.వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.
ఆశావహుల్లో ఆందోళన..
మరోవైపు పలు నియోజకవర్గాల్లో టికెట్ ఆశించిన వారు తాజా జాబితా చూసి ఖంగుతిన్నారు. టికెట్ వస్తుందనే ఆశతో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ క్యాడర్‌ను కాపాడుకుంటున్నవారు ఆందోళన చెందుతున్నారు. అయితే రేంవత్‌రెడ్డి వర్గమే జాబితా రిలీజ్ చేసినట్లు ప్రచారం జరుగుతుండడంతో ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఎలా చేయాలని సీనియర్ నాయకులతో చర్చిస్తున్నట్లు తెలిసింది.
Also Read:Land Expatriates: బంగారు తెలంగాణలో నిర్వాసితుల పరిస్థితిదీ