Congress Manifesto: తెలంగాణలో ఏ సంక్షేమంతో అయితే కేసీఆర్ రెండుసార్లు ఓట్లు కొల్లగొట్టాడో.. అదే సంక్షేమంతో కేసీఆర్‌ను ఈసారి దెబ్బకొట్టాలని చూస్తోంది కాంగ్రెస్. కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన బూస్ట్‌తో దూకుడుగా వెళ్తున్న టీకాంగ్రెస్.. కేసీఆర్ పథకాలకు దీటుగా ఇప్పటికే ఆరు గ్యారెంటీ స్కీంలు ప్రకటించింది. ఈ ఆరు హామీలు అమలుకానివని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవగాహన లేని కాంగ్రెస్ ఇష్టానుసారం అమలు చేయలేని హామీలు ఇస్తోందని బీఆర్‌ఎస్ మొదట్లో ఆరోపించింది. కానీ, అవే హామీలను కాస్త అటూ ఇటు మార్చి బీఆర్‌ఎస్ అదే మేనిఫెస్టోలో పొందుపర్చింది. దీంతో కాంగ్రెస్ తమ మేనిఫెస్టోను బీఆర్‌ఎస్ కాపీ కొట్టిందని ప్రచారం మొదలు పెట్టింది. ఇదే సమయంలో పేద మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఓ ఫ్లాఫ్ పథకాన్ని ప్రకటించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది.
ఆడబిడ్డకు పెళ్లి కానుక..
ఇప్పటికే మహిళా కానుకగా రూ.2,500 ఇస్తామని కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ హామీల్లో ప్రకటించింది. తాజాగా పేదింటి ఆడబిడ్డి పెళ్లికి కేసీఆర్ దిమ్మతిరిగే హామీ ఇవ్వాలని కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు ఉన్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ను తలదన్నేలా పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రూ.లక్ష నగదు, 10 గ్రాముల(తులం) బంగారం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ హామీని ఈనెల 18న బస్సుయాత్రకు రానున్న రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలతో ప్రకటించేందుకు ప్లాన్ చేసింది టీకాంగ్రెస్.
రేపు తెలంగాణకు రాహుల్, ప్రియాంక..
ఇదిలా ఉండగా, రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా అక్టోబర్ 18న తెలంగాణలో పర్యటించి వివిధ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. అక్టోబరు 18న ములుగులోని రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం బస్సుయాత్రలో పాల్గొంటారు. ఆ తరువాత మహిళా సదస్సులో ప్రసంగిస్తారని సమాచారం.
కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటించే ఛాన్స్..
రాహుల్, ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ‘మహాలక్ష్మి’ గ్యారెంటీ స్కీమ్‌పేరుతో అర్హత ఉన్న మహిళలకు వారి వివాహ సమయంలో 10 గ్రాముల బంగారాన్ని అందించాలనే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టుగా పార్టీ శ్రేణుల సమాచారం. ఈ ప్రతిపాదనకు సంబంధించి పార్టీ సీనియర్ నేతలతో చర్చలు కొనసాగుతున్నాయని, ‘మహాలక్ష్మి’ హామీ ద్వారా వధువు కుటుంబానికి రూ.లక్ష అందించాలనే సంకల్పంతో పాటు, తులం బంగారం కూడా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ పేర్కొంది.
ఫైనల్ కాలేదని..
అయితే, ఈ సిఫార్సు ఇంకా ఫైనల్ కాలేదని, దీని నిర్ధారణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ), అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ)పై ఆధారపడి ఉంటుందని సమాచారం. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)లో మహిళలకు ఉచిత ప్రయాణం, పేద మహిళలకు నెలకు రూ. 2,500, ఎల్‌పీజీ సిలిండర్ రూ. 500లకే ఇచ్చే పథకాలతోపాటు మహాలక్ష్మి పథకానికి కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.