https://oktelugu.com/

Ponguleti Srinivasa Reddy- YS Jagan: తాడేపల్లికి పొంగులేటి.. జగన్‌తో చర్చించింది వాటిపైనేనా?

ఖమ్మం నుంచి సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కు వచ్చిన పొంగులేటి జగన్‌తో అరగంటకు పైగా ముఖ్యమైన విషయాలు మాట్లాడారని వినికిడి. షర్మీల పార్టీ విలీనం, కాంగ్రెస్‌లో చేరికపై కీలకంగా చర్చించారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Written By:
  • Rocky
  • , Updated On : July 7, 2023 / 11:07 AM IST

    Ponguleti Srinivasa Reddy- YS Jagan

    Follow us on

    Ponguleti Srinivasa Reddy- YS Jagan: మొత్తానికి తెలంగాణ రాజకీయాలు ఏపీలోని తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సమక్షంలో హస్తం గూటికి చేరిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. రాజకీయంగా వేగం పెంచారు. వరుసగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కేసీఆర్‌ కుటుంబం ఓటమే తన లక్ష్యమని సవాళ్లు విసురుతున్నారు. అంతే కాదు మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో భేటీ కూడా అయ్యారు. కాంగ్రెస్‌లోకి పునరాగమనం చేయాలని ఆహ్వానించారు. ఆయనకు మాత్రమే కాదు పలువురిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించేందుకు ఆయన ప్రణాళిక రూపొందించుకు న్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రక్రియ జరుగు తుండగానే అందరినీ ఆశ్చర్యపరుస్తూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం ఏపీలోని అక్కడి ముఖ్యమంత్రి నివాసం తాడేపల్లిలో కన్పించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. సుమారు అరగంట సేపు ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకున్నారు.

    ఖమ్మం నుంచి సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కు వచ్చిన పొంగులేటి జగన్‌తో అరగంటకు పైగా ముఖ్యమైన విషయాలు మాట్లాడారని వినికిడి. షర్మీల పార్టీ విలీనం, కాంగ్రెస్‌లో చేరికపై కీలకంగా చర్చించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. వాస్తవానికి వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నారని, ఆమెకు ఏపీలోని కాంగ్రెస్‌ బాధ్యతలు అప్పగిస్తారని జగన్‌ వదిలిన బాణాన్ని ఆయన పైకే ప్రయోగించబోతున్నారని ప్రచారం జరుగతోంది. ఇవన్నీ ఒకెత్తయితే షర్మిల పులివెందుల నుంచి పోటీ చేస్తారనే వాదనలూ లేకపోలేదు. ఇప్పటికే ప్రియాంకా గాంధీ రంగంలోకి దిగి అన్ని విషయాలు చర్చించారని తెలుస్తోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్‌తో భేటీ కూడా ఇందులో భాగమనే వాదనలు లేకపోలేదు. విలీనం కూడా జూలై 8న చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే క్రమంలో జగన్‌తో పొంగులేటి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

    జగన్‌తో భేటీకి ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఢిల్లీ నుంచి ఫోన్‌ వచ్చిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఫోన్‌రావడంతోనే ఆయన ఉన్న పళంగా ఖమ్మం నుంచి తాడేపల్లి వెళ్లారు. ముందుస్తు అపాయింట్‌మెంట్‌ తీసుకోకుండానే నేరుగా జగన్‌ను కలిశారు. షర్మిలకు ఏపీ బాఽధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం రెడీ అయిందని, దీనికి జగన్‌ అడ్డుపడుతున్నారని టాక్‌ నడుస్తోంది. షర్మిల పులివెందులలో పోటీ చేస్తే వైఎస్‌ కుటుంబం పరువు ఏం కావాలని జగన్‌ ప్రశ్నించినట్టు కూడా తెలుస్తోంది. అయితే షర్మిల రాకను వ్యతిరేకించొద్దనే కాంగ్రెస్‌ అధిష్ఠానం పొంగులేటిని జగన్‌ వద్దకు దూతగా పంపినట్టు తెలుస్తోంది. మరోవైపు ఏపీలో తన సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు సం బంధించి బిల్లుల గురించి మాట్లాడేందుకే పొంగులేటి జగన్‌ను కలిశారనే వాదనలు కూడా లేకపోలేదు. మరి వీటిపై పొంగులేటి ఏమంటారో వేచి చూడాల్సి ఉంది.