Congress Khammam Sabha: సీనియర్లు మొత్తం ఏకతాటిపైకి వచ్చారు. ఉత్తంకుమార్ రెడ్డి నుంచి మొదలుపెడితే భట్టి విక్రమార్క వరకు ఒకే వేదిక పంచుకున్నారు. సభను విజయవంతం చేసేందుకు ఎవరి తరఫున వారు కృషి చేశారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ కార్యకర్తలు సకాలంలో సభా వేదికకు చేరుకునే విధంగా ఏర్పాటు చేశారు. తొమ్మిది సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో ఏకతారాగం వినిపించడం దాదాపు ఇదే ప్రథమం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జనం భారీగా తరలివచ్చారు. అంతేకాదు ఒకే వేదిక మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం తాము ఎందుకు అధికారంలోకి రావాలి అనే అవసరాన్ని ప్రజలకు స్పష్టంగా చెప్పారు. ఇక్కడే వారిలో ఉన్న లోపాన్ని మరోసారి ప్రదర్శించారు.
వాస్తవానికి ఈ సభను మొదట బట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించాలి అనుకున్నారు. అనుకోని వరం లాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇదే వేదిక మీద ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాలి అని నిర్ణయించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆర్థికంగా బలంగా ఉన్న నాయకుడు కావడంతో రాహుల్ గాంధీని స్వయంగా ఆహ్వానించారు. కర్ణాటకలో గెలిచిన ఉత్సాహం వల్ల రాహుల్ గాంధీ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాటను కాదనలేకపోయారు. పైగా ఖమ్మం సభకు వెళ్లాలని డీకే శివకుమార్ కూడా సూచించడంతో రాహుల్ గాంధీ ఉత్సాహం చూపించారు. మొత్తానికి భారీగా జన సమీకరణ చేయడంలో కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల తర్వాత విజయవంతమైంది. అనుకున్నట్టుగానే రాహుల్ గాంధీ కూడా వచ్చారు. అయితే పాదయాత్ర ముగించుకొని వచ్చిన భట్టి విక్రమార్కకు మాట్లాడే అవకాశం కల్పించారు. సాధారణంగా ఒక బహిరంగ సభలో మాట్లాడే ముందు పార్టీకి సంబంధించిన అధ్యక్షుల పేర్లను ఉటంకించడం సభా మర్యాద. కానీ ఇక్కడ భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ పేరు ప్రస్తావించి.. రేవంత్ రెడ్డి పేరును కనీసం మాట వరుసకైనా చెప్పలేదు. సుమారు 15 నిమిషాలు మాట్లాడిన ఆయన తన వ్యక్తిగత సోత్కర్షకే పరిమితమయ్యారు. తనను తాను భారీగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తన వల్లే ఇంత మంది జనం వచ్చారని ఇచ్చుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక మాట్లాడే అవకాశం ఇచ్చినప్పటికీ రేణుక చౌదరి అంతగా ఆసక్తి చూపలేదు.
రేవంత్ రెడ్డి ఎప్పటిలాగే తన వాగ్దాటితో భారత రాష్ట్ర సమితి పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో కూడా ప్రజలకు వివరించారు. అంతేకాదు కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుంటుందో ఆయన అంకెలతో సహా వివరించారు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా భట్టి విక్రమార్క బాటనే అనుసరించారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మిగతా నాయకులు కూడా ఎవరికి వారు తమ సొంత ఎజెండాను ప్రదర్శించుకునే పనిలోనే ఉన్నారు. అయితే ఇంతమంది జనం స్వచ్ఛందంగా తరలివచ్చినప్పటికీ మూకుమ్మడి అనే భావన లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తిగత అజెండాను ప్రదర్శించడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కలిసికట్టుగా భారత రాష్ట్ర సమితి ఎదుర్కొనే సమయంలో ఇలా వ్యక్తిగతంగా ప్రొజెక్ట్ చేసుకోవడం ఆ పార్టీ కార్యకర్తలకు మింగుడుపడటం లేదు.
ఈ సభకు సంబంధించి ఖర్చు మొత్తం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భరించినట్టు ప్రచారం జరుగుతున్నది. జన గర్జన పేరుతో నిర్వహించిన ఈ సభ వల్ల భట్టి విక్రమార్క పాదయాత్రకు గుర్తింపు లేకుండా పోయిందని సాక్షాత్తు ఆయన భార్య మల్లు నందిని తన అంతరంగికులతో వాపోవడం ఇక్కడ విశేషం. ఇక ఆదివారం ఉదయం సభా వేదిక వద్ద భట్టి విక్రమార్క ఫోటోలు కనిపించకపోవడంతో ఆమె ఒకింత నిర్వేదం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ పరిణామాలను చూస్తున్న రాజకీయ విశ్లేషకులు కాంగ్రెస్ పార్టీ తన అంతర్గత ప్రజాస్వామ్యం బుద్ధులను వదులుకోలేదని చెబుతున్నారు. పార్టీ నాయకులు ఇప్పటికైనా మారకపోతే మరింత కష్ట కాలాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.