Homeజాతీయ వార్తలుపంజాబ్ కాంగ్రెస్ కథ ముగిసింది.. రాజస్థాన్ మొదలైంది

పంజాబ్ కాంగ్రెస్ కథ ముగిసింది.. రాజస్థాన్ మొదలైంది

దేశంలో కాంగ్రెస్ కండీష‌న్‌ ఏంట‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. రెండు సార్లు అధికారం కోల్పోయిన పార్టీ.. పూర్తిగా డీలా ప‌డిపోయింది. ఇప్ప‌టికీ పూర్తిగా కోలుకోలేదు. ఇటు రాష్ట్రాల్లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. అధికారంలో ఉన్న చోటా.. లేని చాటా.. నేత‌ల మ‌ధ్య పంచాయితీ తార‌స్థాయికి చేరి ఉంది. వాటిని ప‌రిష్క‌రించ‌క‌పోతే.. పార్టీ పుట్టి మున‌గ‌డం ఖాయమ‌నే దాకా వ‌చ్చాయి ప‌రిస్థితులు. దీంతో.. ఆల‌స్యంగానైనా మేల్కొన్న అధిష్టానం.. చ‌క్క‌దిద్దే చ‌ర్య‌లు మొద‌లు పెట్టింది.

మొన్న‌టికి మొన్న తెలంగాణ కాంగ్రెస్ లో టీపీసీసీ నియామ‌కం పూర్తిచేసి, పార్టీని ప‌ట్టాలెక్కించిన అధిష్టానం. నిన్న పంజాబ్ పంచాయితీని సెట్ చేసింది. అక్క‌డ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ.. రెండు వ‌ర్గాల మ‌ధ్య సాగుతున్న అంత‌ర్గ‌త‌ పోరు ర‌చ్చ‌కెక్కింది. ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్ సింగ్, సిద్ధూ మ‌ధ్య నెల‌కొన్న విభేదాలు తార‌స్థాయికి చేరాయి. ఒక ద‌శ‌లో.. అమ‌రీంద‌ర్ సింగ్ ప‌నితీరుపై బ‌హిరంగంగా తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు సిద్ధూ. దీంతో.. నేత‌లిద్ద‌రూ ఎడ‌మొహం పెడ‌మొహం అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. ఇలాంటి ప‌రిస్థితుల్లోనే.. సిద్ధూకు పీసీసీ చీఫ్ ఇవ్వ‌డంతో.. సీఎం మ‌రింత‌గా అసంతృప్తికి లోన‌య్యారు. దీంతో.. ఏం జ‌రుగుతుందో అర్థంకాక నేత‌లు, కేడ‌ర్ ఆందోళ‌న‌కు గుర‌య్యారు. చివ‌ర‌కు జోక్యం చేసుకున్న సోనియా గాంధీ.. నేత‌ల‌ను కూల్ చేశారు. సీన్ క‌ట్ చేస్తే.. ఇద్ద‌రూ తేనేటి విందులో చేతులు క‌లిపారు. వ‌చ్చేఏడాది జ‌రిగే ఎన్నిక‌ల్లో క‌లిసి ప‌నిచేస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో.. క‌థ సుఖాంత‌మైంది.

ఇక‌, ఇప్పుడు రాజ‌స్థాన్ పైనా దృష్టి సారించింది కాంగ్రెస్ హైక‌మాండ్‌. ఇక్క‌డ కూడా ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్‌, యువ‌నేత స‌చిన్ పైల‌ట్ వ‌ర్గాల మ‌ధ్య వివాదం కొన‌సాగుతోంది. గ‌తంలో తిరుగుబాటు చేసిన స‌చిన్ వ‌ర్గాన్ని పూర్తిస్థాయిలో సంతృప్తి ప‌రిచే చ‌ర్య‌లు మొద‌లు పెట్టింది అధిష్టానం. ఇందులో భాగంగా.. ఇవాళ సాయంత్రం పార్టీ ఎమ్మెల్యేల‌తో కీల‌క స‌మావేశం జ‌ర‌ప‌బోతోంది. అనంత‌రం.. కేబినెట్ విస్త‌ర‌ణ‌పైనా చ‌ర్చ‌లు జ‌రిపే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

అధిష్టానం దూత‌లుగా కేసీ వేణుగోపాల్, రాజ‌స్థాన్ ఇన్ ఛార్జ్ అజ‌య్ మాకెన్ జైపూర్ చేసుకున్నారు. సీఎం గెహ్లాట్ నివాసానికి శ‌నివారం చేరుకున్న వీరిద్ద‌రూ.. అర్ధ‌రాత్రి వ‌రకూ చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు స‌మాచారం. కేబినెట్ విస్త‌ర‌ణ‌లో ఎమ్మెల్యేల ప‌నితీరు ఆధారంగా అవ‌కాశం ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్టుగా తెలుస్తోంది. అనుకున్న‌వ‌న్నీ సానుకులంగా జ‌రిగితే.. ఈ నెల 27 లేదా 28 తేదీల్లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. మొత్తానికి.. కాంగ్రెస్ పున‌ర్నిర్మాణం జ‌రుగుతోంది. మ‌రి, ఇది వ‌చ్చే సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల నాటికి ఎంత మేర లాభిస్తుంద‌న్న‌ది చూడాలి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular