Telangana Congress Senior Leaders: 130 ఏళ్ల చరిత్ర కలిగిన పాతీ తమదని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో ఆ పార్టీని చిలువలు పలువలుగా చీల్చే ప్రయత్నం మొదలు పెట్టారు. ఎనిమిదేళ్లుగా అధికారానికి దూరమైన పార్టీని కలిసికట్టుగా అధికారంలోకి తీసుకురావాల్సిన నేతలు.. గాడిన పెట్టే ప్రయత్నం చేయకపోగా.. ముక్కలు చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. దీనిని గుర్తించిన అధిష్టానం సర్దుబాటు చర్యలకు దిగింది. లడ్డూ కావాలనా నాయనా అన్నట్లుగా కట్టి తుడుపు బుజ్జగింపులు మొదలు పెట్టింది.

రంగంలోకి డిగ్గీ రాజా..
దేశాన్ని ఐక్యం చేస్తామంటూ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఆ పార్టీ సీనియర్ నేత, గాంధీ కుటుంబ వారసుడు రాహుల్ గాంధీ ఒకవవైపు భారత్ జోడో పేరుతో పాదయాత్ర చేస్తుంటే.. తెలంగాణ సీనియర్ లీడర్లు మాత్రం.. పార్టీలో ఎంతమేరకు ఐనైక్యత సృష్టిద్దామా అని చూస్తున్నారు. పీసీసీ కమిటీల నియామకంతో పుట్టిన ముసలంతో రంగంలోకి దిగిన సీనియర్లు సేవ్ కాంగ్రెస్ నినాదంతో పార్టీని చీల్చే ప్రయత్నం మొదలు పెట్టారు. దీంతో రంగంలోకి దిగిన ప్రియాంక గాంధీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జిగా వ్యవహరించిన దిగ్విజయ్ సింగ్‌ను రంగంలోకి దింపారు. ఈమేరకు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలకు హైకమాండ్ ఫోన్లు చేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తోంది. అందర్నీ కూల్ చేసేందుకు దిగ్విజయ్ సింగ్ త్వరలో తెలంగాణకు వసస్తారని తెలిపింది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నేరుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఫోన్ చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని.. అందుకే మంగళవారం నిర్వహించాలనుకున్న సభను వాయిదా వేశామని నేతలు చెప్పుకుంటున్నారు.

కాచుకూర్చున్న బీజేపీ..
తెలంగాణ కాంగ్రెస్‌లో ఏర్పడిన సంక్షోభాన్ని అనుకూలంగా మల్చుకోవడానికి బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. తొమ్మిది మంది సీనియర్ నేతల్లో కొంతమంది బీజేపీతో టచ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతున్న సమయంలో హైకమాండ్ సీరియస్‌గా రంగంలోకి దిగింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న దిగ్విజయ్‌సింగ్.. సీనియర్ల అసంతృప్తిని తగ్గించే ప్రయత్నాలు చేయనున్నారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో అంతర్గత పోరు కొనసాగుతోంది. అయితే తాజాగా ఒక్కక్కరుగా కాకుండా.. అందరు సీనియర్లు ఒకేసారి తెరపైకి వచ్చారు. వీరంతా వ్యూహాత్మకంగా ఓ పార్టీతో మాట్లాడుకుని ఇలా రచ్చ చేస్తున్నరని.. వీరంతా కోవర్టులన్న అనుమానాలు కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే .. ఈ మేరకు వస్తున్న సోషల్ మీడియా పోస్టులపైనా రేవంత్‌వర్గం నేతలు దృష్టి పెట్టారు. ఆ సోషల్ మీడియా పోస్టులతో సంబంధం లేదని.. ఎవరైనా పెడితే చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ఇప్పుడు సీనియర్ నేతలు.. బుజ్జగింపులకు తగ్గాలా.. తమ నిర్ణయం తాము తీసుకోవాలా అన్న విషయంలో డైలమాలో ఉన్నారు.