
దేశంలో రాజకీయ దుమారం రేగుతోంది. ఒక వైపు కరోనా కరాళ నృత్యం చేస్తుంటే మరోవైపు నాయకులు తమ నోళ్లకు పదును పెడుతున్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోవాల్సింది పోయి వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా కేసులు పెట్టుకునే వరకు వ్యవహారాలు వెళ్తున్నాయి. కరోనా విస్తరిస్తున్న వేళ ప్రధాని మోదీ సర్కారు ఏం చేయట్లేదని చెబుతుండగా ప్రధాని పరువు తీయడానికి కాంగ్రెస్ ఏకంగా టూల్ కిట్ రూపొందించిందని బీజేపీ ఆరోపించింది. దీంతో బీజేపీ నేతలవి అసత్య ప్రచారాలని వారిపై కేసు నమోదు చేయాలని ట్విటర్ కు లేఖ రాశారు.
కేవిడే లక్ష్యంగా..
కోవిడ్ పరిస్థితులను లక్ష్యంగా తీసుకుని ప్రధానిపై కాంగ్రెస్ పార్టీ బురదజల్లే పని చేస్తుందని బీజేపీ నేతలు వాపోతున్నారు. కోవిడ్-19 పేరుతో పలు నకిలీ పత్రాలు సృష్టించి బీజేపీ నేతలు కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. నిజానికి తాము ఎలాంటి తప్పు చేయలేదని తేల్చి చెప్పారు. బీజేపీ నేతల్లో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి స్హ్మతి ఇరానీ, సంబిత్ పాత్రా, బి.ఎల్. సంతోశ్ ట్విటర్ ఖాతాలు సస్పెండ్ చేయాలని ట్విటర్ కు లేఖ రాశామని కాంగ్రెస్ సోషల్ మీడియా నేత రోహన్ గుప్తా తెలిపారు.
అసలేం జరుగుతోంది?
దేశంలో అసలు ఏం జరుగుతోంది. రాజకీయ మనుగడ కోసం వ్యక్తిగత విద్వేషాలను బయటపెట్టుకునే కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ వేగంగ విస్తరిస్తున్న వేళ దాని నిర్మూలనకు పాటుపడాల్సిన నేతలు తమ రాజకీయ పబ్బం గడుపుకునే నిమిత్తమై పలు ఆరోపణలు చేసుకుంటూ ప్రతిష్టను బజారుకీడుస్తున్నారు. సందుల్లో సడేమియా లాగా తమ ప్రభావాన్ని తగ్గించుకునే విధంగా ప్రవర్తిస్తూ ప్రజల్లో చులకన అయి పోతున్నారు. కరోనా వైరస్ తో ప్రజలు అల్లాడుతుంటే ఎవరికి పట్టింపు లేదా అని ప్రజలు నిలదీస్తున్నారు. అయినా నేతల్లో అలాంటి పనులకన్నా వ్యక్తిగత ప్రతిష్టను ఇనుమడింప చేసే పనులకే ముందు ప్రాధాన్యం ఇస్తున్నట్లుగ తెలుస్తోంది.