AP New Districts: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా సాగిపోతోంది. ప్రభుత్వం గెజిట్ నిర్ణయం సైతం తీసుకుంది. దీంతో నోటిఫికేషన్లు కూడా విడుదలయ్యాయి. అయితే కొన్ని ప్రాంతాల విషయంలో ప్రజల మధ్య కొన్ని డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. తాము ఆ జిల్లాలో ఉండలేమని తెగేసి చెబుతున్నారు. దీంతో జిల్లాల ఏర్పాటులో రగడ రాజుకుంటోంది. మెల్లగా నిప్పు రేగుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమానికి సైతం రెడీ అవుతున్నట్లు సమాచారం.
రాష్ర్టంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాలతోపాటు రెవెన్యూ డివిజన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఆ డివిజన్ లో తాము ఉండలేమని చెబుతున్నారు. తమకు నచ్చిన దగ్గరలో ఉన్న ప్రాంతంలోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న తమను ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్న దానికి కేటాయించడంపై పెదవి విరుస్తున్నారు.
నంద్యాల లోక్ సభ స్థానం పరిధిలోని పాణ్యం శాసనసభ నియోజకవర్గాన్ని కర్నూలులో కలపడాన్ని వ్యతిరేకిస్తున్నారు. పాణ్యం నియోజకవర్గం కల్లూరు, ఓర్వకల్లు మండలాలు కర్నూలుకు దగ్గరలో ఉండగా పాణ్యం, గడివేముల నంద్యాలకు సమీపంలో ఉన్నాయి. దీంతో కల్లూరు, ఓర్వకల్లు మండలాల్ని కర్నూలులో కలపాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తోంది. కానీ పాణ్యం, గడివేముల మండలాలు నంద్యాలకు దగ్గరగా ఉన్నందున నంద్యాలలోనే కలపాలని అడుగుతున్నారు. దీంతో ప్రజల డిమాండ్లను అధికారులు లెక్కలోకి తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.
మరోవైపు రాజంపేట నుంచి కూడా పీటముడి పడుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మున్సిపల్ వైస్ చైర్మన్ ఓ సెల్పీ వీడియో విడుదల చేశారు. రాయచోటి, మదనపల్లెను కలిపి జిల్లాగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాజంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కందుకూరుపై కూడా గొడవ రేగుతోంది. కందుకూరును నెల్లూరు జిల్లాలో కలపడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
Also Read: ఏపీ ఉద్యోగులకు జీతాల తిప్పలు? .. ఈనెల వేతనాలు అందుతాయా?
అరకు లోక్ సభ స్థానాన్ని మూడు జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. భౌగోళికంగా పెద్దదైన అరకును మూడు జిల్లాలుగా ఏర్పాటు చేస్తేనే సౌలభ్యంగా ఉంటుందని చెబుతున్నారు. ఇన్ని డిమాండ్లు వస్తున్న క్రమంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ సజావుగా సాగుతుందో లేదో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు సమ్మతి తెలుపుతారా లేదా అనేదే తేలాల్సి ఉంది.
Also Read: టికెట్ల వివాదం ముగిసేనా.. వచ్చే నెల 10న ధరలపై క్లారిటీ..!