ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపడతారని ప్రచారం సాగుతోంది. గతంలో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే రెండున్నరేళ్ల తరువాత మళ్లీ మంత్రి వర్గ విస్తరణ చేసే అవకాశాలున్నాయని చెప్పడంతో ఇప్పుడు పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. వైసీపీకి 151 ఎమ్మెల్యేల బలం ఉంది. దీంతో మంత్రిపదవులు అందరికి సాధ్యం కావు. ఏ పాతిక మందికో అవకాశం దొరుకుతుంది. దీంతో పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య పెరగడంతో వారిలో అప్పుడే అలకలు ప్రారంభమయ్యాయి.
2019లో జగన్ అధికారం చేపట్టారు. అప్పుడు ఆశావహులు, సమీకరణలు బేరీజు వేసుకుని కొంత మందికి మంత్రి పదవి కట్టబెట్టారు. కొత్త కావడంతో ఎవరు కూడా కినుక వహించలేదు. కానీ ఈసారి అలాకాదు. పదవి లేకుంటే వేరే పార్టీలోకి జంపు చేయడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాలం వేగంగా తిరుగుతోంది. దీంతో మనుషులు కూడా అంతే స్థాయిలో మారిపోతున్నారు.
పార్టీలో సీనియర్లు మాత్రం మంత్రి పదవి మారిస్తే ఉండేది లేదని తెగేసి చెబుతున్నట్లు సమాచారం. మంత్రి వర్గ విస్తరణ అనివార్యమైన పరిస్థితుల్లో అలవ వహిస్తున్న వారిని ఎలా బుజ్జగించాలనే దానిపై జగన్ దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే సామాజిక సమీకరణల నేపథ్యంలో పదవులు ఆశిస్తున్న వారంతా చక్కర్లు కొడుతున్నారు. తమ విధేయతను నిరూపించేందుకు నానా పాట్లు పడుతున్నారు.
ఎమ్మెల్యేగా గెలవగానే మంత్రి పదవి కావాలని పట్టు పడుతున్నారు. సామాజిక సమీకరణలు, అర్హతలు తరువాత మాట. మొదట పదవే ప్రధానమనే కోవలో నాయకులు ఉన్నారు. దీంతో ఎవరి కోరికలు తీర్చాలనే దానిపై జగన్ తలమునకలయ్యారు. అసంతృప్తులను తమ దారికి తెచ్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే టీడీపీ వేచి చూస్తోంది. అసంతృప్తులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ కు పెద్ద కష్టమే వచ్చి పడింది.