
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లా పర్యటనలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్ కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. హుందాగా ఉండాల్సిన అధికారి సీఎం కాళ్లకు మొక్కడం సంచలనంగా మారింది.
ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉంటూ ప్రజాప్రతినిధి కాళ్లపై పడటం గమనార్హం. అధికారి అన్న విషయం మరిచి రాజకీయ నాయకుడిలా ప్రవర్తించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆదివారం జూన్ 20న సిద్దిపేటలో నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని స్వయంగా తీసుకెళ్లి ఆయన్ను కుర్చీలో కూర్చోబెట్టారు.
కుర్చీలో కూర్చున్న కలెక్టర్ వెంటనే ఆయన కాళ్లపై పడి నమస్కరించారు. గతంలో దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో ఇదే కలెక్టర్ పేరు టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో కనిపించడం తెలిసిందే. దీంతో ఆయన టీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. తాజాగా ఆయన సీఎం కాళ్లపై పడటం చూస్తుంటే భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారనే విషయం స్పష్టమవుతోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేటలో నూతన కలెక్టరేట్ భవనంతోపాటు పోలీస్ కమిషనరేట్ కార్యాలయంతో పాటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్నిప్రారంభించారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం సీఎం అందులో కలియ తిరిగారు. మంత్రి హరీశ్ రావు కలెక్టరేట్ భవనంలోని గదులను సీఎంకు చూపిస్తూ నిర్మాణ విషయాలను వివరించారు.
రూ.63 కోట్ల 60 లక్షలతో ఈ భవనాన్ని నిర్మించారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా పలువురు వినతిపత్రాలతో రాగా సీఎం కేసీఆర్ స్వయంగా వాటిని తీసుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని రూ.4 కోట్ల వ్యయంతో నాలుగు ఎకరాల స్థలంలో నిర్మించారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ లో ఎమ్మెల్యే కార్యాయలయం, మొదటి అంతస్తులో నివాసం ఏర్పాటు చేశారు. అభివృద్ధి పను ప్రారంభోత్సవం అనంతరం ప్రజాప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు.