Coimbatore case: ప్రజా ప్రతినిధులు మాట్లాడే మాట జాగ్రత్తగా ఉండాలి.. ముఖ్యంగా సభ్య సమాజంలో ఏవైనా సంఘటన జరిగినప్పుడు వాటిపై ఆచి తూచి మాట్లాడాలి. అలా కాకుండా నోరు ఉందని ఇష్టానుసారంగా మాట్లాడితే.. నరం లేని నాలుక ద్వారా పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేస్తే.. ఆ తర్వాత జరిగే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి.
ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూరు ప్రాంతంలో ఓ మహిళపై దారుణం జరిగింది.. ఆ మహిళ తన స్నేహితుడితో కలిసి బయటికి వెళ్లింది. ఆ సమయంలో కొందరు వ్యక్తులు ఆమె స్నేహితుడిని బంధించారు. ఆ తర్వాత ఆమెపై సామూహికంగా దారుణానికి పాల్పడ్డారు.. ఈ కేసు తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో సంచలనం తొలగిస్తోంది. మహిళలకు భద్రత లేదని.. అందువల్లే ఈ తరహాలో దారుణాలు జరుగుతున్నాయని అక్కడి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కోయంబత్తూర్ లో జరిగిన దారుణానికి సంబంధించి ఇప్పటికే టీవీకే పార్టీ ధర్నాలు నిర్వహించింది. అధికార పార్టీకి వ్యతిరేకంగా నిరసనలు కూడా చేపట్టింది. వాస్తవానికి జరిగిన దారుణంపై విచారణ చేపట్టి.. ఈ ఘోరానికి కారణమైన వ్యక్తులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది.. అయితే అక్కడి అధికార పార్టీ నాయకులు మాత్రం ఈ వ్యవహారంపై మరో విధంగా స్పందిస్తున్నారు.. ముఖ్యంగా డీఎంకే మిత్రపక్ష ఎమ్మెల్యే ఈశ్వరన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి.
కోయంబత్తూర్ లో జరిగిన దారుణంపై ఈశ్వరన్ చేసిన వ్యాఖ్యలు నివ్వెర పరుస్తున్నాయి. “రాత్రి 11:30 నిమిషాలకు ఆడ మగ చీకట్లో ఉన్నారు.. దీనివల్ల దారుణాలు జరగవా? వాటిని ఎలా ఆపడానికి అవకాశం ఉంటుంది.. పోలీసులు ఇటువంటి ఘటనలను ఎలా నియంత్రిస్తారు.. ప్రభుత్వం వీటిని ఎలా అడ్డుకుంటుంది.. తల్లిదండ్రుల పెంపకం సరిగా లేనప్పుడే పిల్లలు ఇలా చేస్తారు. టీచర్లు కూడా పిల్లల్లో క్రమశిక్షణ నేర్పాలి. అప్పుడే మార్పు అనేది సాధ్యమవుతుంది. ఇలాంటి ఘటనలు సభ్య సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తాయని” ఈశ్వరన్ వ్యాఖ్యానించారు. ఈశ్వరన్ చేసిన వ్యాఖ్యల పట్ల తమిళనాడులో నిరసన వ్యక్తమౌతోంది. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై బిజెపి మాజీ అధ్యక్షుడు అన్నామలై స్పందించారు. ఒక ఎమ్మెల్యేగా ఇలాంటి మాటలు మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. ఇక నెటిజన్లయితే ఈశ్వరన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇతడికి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు దండం పెట్టాలని వ్యాఖ్యానిస్తున్నారు.