Jagan Chandrababu: ఏపీ రాజకీయాల్లో 40 ఇయర్స్ చంద్రబాబును ఏడిపించిన ఘనత కచ్చితంగా జగన్ సొంతం.. ఇంట్లో చంద్రబాబు ఎన్ని సార్లు ఏడ్చాడో తెలియదు కానీ అందరి ముందు.. ముఖ్యంగా మీడియా ముఖంగా ఏడిపించిన ఘనత జగన్ దే. చంద్రబాబు లాంటి ఉద్దండుడు చంటిపిల్లాడిలా గుక్కతిప్పుకోకుండా ఏడుస్తుంటే దేశమంతా ‘అయ్యో పాపం’ అనేసింది. ప్రత్యర్థులు కూడా చంద్రబాబుపై జాలిపడ్డారు. అంతటి రాయలసీమ కసి, పట్టుదల, కోపతాపాలు గల జగన్ మాత్రం చంద్రబాబు ఏడుపును పట్టించుకోలేదు. అది ముసలికన్నీరుగా అభివర్ణించారు.
ఇక జగన్ పగ ఈనాటిది కాదు.. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఇదే ప్రతిపక్ష నేత జగన్ పై ఎన్ని అపనిందలు వేశాడు. కోడికత్తితో దాడులు.. ఆయన బాబాయి హత్య విషయంలో టీడీపీ, దాని అనుకూల మీడియా నైతికంగా ఎంతో దెబ్బతీశారు. దొరికిన ప్రతి అవకాశాన్ని వాడుకొని చంద్రబాబు, టీడీపీ నేతలు, దాని అనుకూల మీడియా జగన్ ను అభాసుపాలు చేయని సందర్భం లేదు. జైలుకెళ్లిన జగన్ ను అవినీతిపరుడిగా ప్రొజెక్ట్ చేశారు. ఇవన్నీ మనసులో పెట్టుకున్నాడు కాబట్టే జగన్ అంత కఠినాత్ముడిగా మారాడు.. చంద్రబాబును ఏడిపించినా కరగలేదు. ఇప్పటికీ అదే పంథాతో ఉన్నారు.
చంద్రబాబు, జగన్.. ఇద్దరూ సుద్దపూసలేం కాదు. ఇద్దరికీ రాజకీయ శత్రుత్వం నుంచి వ్యక్తిగత వైరం వరకూ ఉన్నాయి. ఎవరు అధికారంలోకి వచ్చినా మరొకరిపై కేసులు, దాడులు ఖాయం. చంద్రబాబును జైలుకు పంపాలన్న జగన్ ప్రయత్నాలు మాత్రం సఫలం కావడం లేదు కానీ అదీ జరిగేదే.
ఈ ఇద్దరు ప్రత్యర్థులు ఒక్కచోట కూర్చోవాలని.. కలిస్తే ఎలా ఉంటుందన్న సందర్భం అందరికీ ఆసక్తిగా ఉంటుంది. ఇటీవల ప్రధాని మోడీ ‘ఆాజాదీ కా అమృత్ మహోత్సవం’లో చంద్రబాబు, జగన్ ఇద్దరినీ పిలిచారు. ఈ ఇద్దరూ ఒకే వేదికపై కూర్చుంటారని.. మోడీ కలుపుతాడని అంతా ఆశించారు. కానీ చంద్రబాబు ఈ వేడుకకు వెళ్లగా.. జగన్ వెళ్లలేదు. చంద్రబాబు ఉన్నాడనే వెళ్లలేదన్న టాక్ నడిచింది. చంద్రబాబుతో ఆప్యాయంగా మాట్లాడిన మోడీ ఫొటోలు, వీడియోలు టీడీపీ మీడియాలో ఎంత హైలెట్ అయ్యాయో అందరం చూశాం.
ఒకసారి వీరిద్దరి కలయిక సాధ్యం కాలేదు. ఈసారి ఏపీ గవర్నర్ వంతు వచ్చింది. గవర్నర్ విశ్వభూషణ్ నిన్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన ఇంట ‘ఎట్ హోం’ అంటూ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు హాజరయ్యారు. ఎట్ హోంలో ఇద్దరూ పాల్గొన్నా కానీ ఎవరి సీటుకు వారే పరిమితం అయ్యారు. కనీసం పలకరించుకోలేదు. ఎదురుగా చూసుకోవడం కూడా చేయలేదు.
ఈ పార్టీలో ఆద్యంతం జగన్, చంద్రబాబులు కనీసం ఒక్కసారి అయినా కలుస్తారని అందరూ ఎదురుచూశారు. మీడియా అయితే కళ్లు కాయలు కాసేలా కెమెరాలు పట్టుకొని రెడీ అయ్యింది. కానీ వారిలోని పంతం వారిని కనీసం చూసుకోనీయలేదు.
ఇక పార్టీ అయిపోయాక సీఎం జగన్ కాన్వాయ్ బయలుదేరుతుందనే సమాచారం రావడంతో వెళ్లాల్సిన చంద్రబాబు ఆగిపోయారు. జగన్ ను చూడొద్దు.. కంటపడొద్దనే ఆగిపోయారు. సీఎం కాన్వాయ్ వెళ్లిపోయాక చంద్రబాబు తన వాహనంలో బయలు దేరారు.
నిజానికి జగన్ తండ్రి వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబును ఎంత ఏడిపించినా సరే బయట కలిస్తే పలకరింపులు.. పార్టీల్లో కలుసుకోవడాలు చేసేవారు.కానీ యువకుడు అయిన జగన్ మాత్రం ‘తగ్గేదేలే’ అంటూ పంతం పట్టారు. చంద్రబాబు సైతం పెద్దరికం వచ్చినా కూడా జగన్ చేసిన అవమానాలకు ఆయనను క్షమించలేకపోతున్నారు.
ఇలా ఇద్దరు వైరి వర్గాల నేతలు ఒకే ఫంక్షన్ లో ఉండి కూడా కలుసుకోకపోవడంతో ఆ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ‘పార్టీలోనూ కలవరా పుష్ప’ అంటూ నెటిజన్లు కొందరు కామెంట్ చేస్తున్నారు. మనసులో ఇంత పగలు, ప్రతీకారాలు పెట్టుకున్నారా? అని నిలదీస్తున్నారు.