Homeజాతీయ వార్తలుKCR and Revanth Reddy : కేసీఆర్‌-రేవంత్ మ‌ధ్య కీల‌క బంధం.. తెలంగాణ రాజ‌కీయాల‌ను మార్చ‌బోతోందా?

KCR and Revanth Reddy : కేసీఆర్‌-రేవంత్ మ‌ధ్య కీల‌క బంధం.. తెలంగాణ రాజ‌కీయాల‌ను మార్చ‌బోతోందా?

కేసీఆర్ – రేవంత్ రెడ్డి మ‌ధ్య రాజ‌కీయ వైరుధ్య‌మే కాదు.. వ్య‌క్తిగ‌త వైరం కూడా ఉంది. నోటుకు ఓటు కేసు ద్వారా.. త‌న రాజ‌కీయ జీవితానికి ముగింపు ప‌లికే ప్ర‌య‌త్నం చేశార‌నే ఉక్రోషం రేవంత్ లో బ‌లంగా ఉందంటారు. ఇప్పుడు పీసీసీ అధ్య‌క్షుడు అయిన త‌ర్వాత.. మ‌రింత ధాటిగా కేసీఆర్ కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తున్నారు. అటు కేటీఆర్ తో స‌హా.. టీఆర్ఎస్ నేత‌లు సైతం రేవంత్ ను టార్గెట్ చేస్తున్నారు. తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. పైకి ఇదంతా వాస్త‌వ‌మే కావొచ్చు. కానీ.. అంత‌ర్గ‌తంగా వీరిద్ద‌రికీ ప‌నికొచ్చే వ్యూహం ఒక‌టి అమ‌ల‌వుతోందంటున్నారు విశ్లేష‌కులు. కేసీఆర్‌-రేవంత్ మ‌ధ్య కొన‌సాగుతున్న ఆ బంధం.. రాష్ట్ర రాజ‌కీయాల‌ను మార్చ‌బోతోందా? అనే చ‌ర్చ‌కూడా సాగుతోంది.

నిన్నామొన్న‌టి వ‌ర‌కు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి ఏంట‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. స‌రైన కెప్టెన్ లేక‌, ఉన్న‌వాళ్లంతా ఎవ‌రిదారి వారే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డంతో.. రాజ‌కీయ సంద్రంలో కాంగ్రెస్ నావ ఎన్నో ఆటుపోట్ల‌కు గురైంది. చివ‌ర‌కు కాంగ్రెస్ ఒక‌ టైటానిక్ అవుతుందా? అనే సందేహాలు కూడా సొంత పార్టీ శ్రేణుల‌కే వ‌చ్చాయి. ఇలాంటి స‌మ‌యంలో రేవంత్ రెడ్డి పీసీసీ ప‌గ్గాలు చేప‌ట్టారు. రేవంత్ రాక‌తో.. కాంగ్రెస్ లో జోష్ పెరిగింద‌న్న‌ది అంద‌రికీ క‌నిపిస్తున్న‌దే. పార్టీని బ‌లోపేతం చేసేందుకు అధ్య‌క్షుడిగా చేయాల్సిందంతా చేస్తున్నారు. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం సాధించాలంటే.. యుద్ధం చేయాల్సింది టీఆర్ ఎస్ పైనే కాబ‌ట్టి.. అస్త్రాల‌న్నీ సంధిస్తున్నారు.

అయితే.. గులాబీ నేత‌లు సైతం రేవంత్ ను ప్ర‌ముఖంగా టార్గెట్ చేస్తున్నారు. ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. దీంతో.. రాష్ట్ర రాజ‌కీయాల్లో ప‌రిస్థితులు వేగంగా మారుతున్నాయి. టీఆర్ ఎస్ వ‌ర్సెస్‌ కాంగ్రెస్ అన్న‌ట్టుగా మారుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. మీడియా కూడా ఈ విష‌యాన్ని ఫోక‌స్ చేస్తోంది. దీంతో.. వేగంగా లైమ్ లైట్లోకి వ‌చ్చేస్తున్నారు రేవంత్‌. అయితే.. ఇక్క‌డే అస‌లు పాయింట్ ఉంది. తాను ఎద‌గ‌డం రేవంత్ కు అవ‌స‌ర‌మే. కాంగ్రెస్ పార్టీకి కూడా అవ‌స‌ర‌మే. కానీ.. రేవంత్ ఎద‌గ‌డం ఇప్పుడు టీఆర్ ఎస్ పార్టీకి కూడా అవ‌స‌రంగా క‌నిపిస్తోంది. పీసీసీ చీఫ్ ను హైలెట్ చేస్తూ అధికార పార్టీ శ్రేణులు విమ‌ర్శ‌లు గుప్పిస్తుండ‌డం.. దీన్నే సూచిస్తోందంటున్నారు.

అదేంటీ.. అన్నివిధాలుగా శ‌త్రువు అయిన రేవంత్ ను హైలెట్ చేయాల్సిన అవ‌స‌రం కేసీఆర్ కు ఏముంద‌న్న‌ప్పుడు.. మ‌రో ప్ర‌త్య‌ర్థిని క‌ట్ట‌డి చేయ‌డానికే అన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అవును.. దుబ్బాక ఉప ఎన్నిక త‌ర్వాత బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఇక‌, జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో ఊహించ‌ని ఫలితాల‌తో ఎక్క‌డ లేని జోరు చూపించింది. ఇక‌, వచ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌దే అధికారం అని చెప్పుకుంటున్నారు. పైగా.. అటు కేంద్రంలో అధికారంలో ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో బీజేపీ బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థిగా త‌యారైతే.. భ‌విష్య‌త్ లో టీఆర్ ఎస్ కు ఇబ్బందులు ఖాయం. అందుకే.. బీజేపీని ఎదుర్కునే క్ర‌మంలో.. అనివార్యంగా రేవంత్ ను పైకి తేవాల్సి వ‌స్తోంద‌ని అంటున్నారు. నిజానికి కొంత కాలంగా.. రాష్ట్రంలో బీజేపీ దూకుడు త‌గ్గింద‌నే చెప్పాలి. ఈ విధంగా.. నిజ‌మైన ప్ర‌త్య‌ర్థులే అయిన‌ప్ప‌టికీ.. అవ‌స‌రార్థం కేసీఆర్‌-రేవంత్ మ‌ధ్య ఈ అనివార్య బంధం కొన‌సాగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి, ఇది రాష్ట్ర రాజ‌కీయాల‌ను మారుస్తుందా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌రిస్తితి ఎలా ఉండ‌బోతోంది? అన్న‌ది చూడాలి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular