తెలంగాణ వర్షాకాల సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 5వ తేదీ వరకు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీంతో ప్రజా సమస్యల పరిష్కారానికే పెద్ద పీట వేయాలని సూచిస్తున్నారు. సభా నిర్వహణలో హుందాతనం పాటించాలని చెబుతున్నారు. సభ్యుల హక్కుల గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా మసలుకునే విధంగా సభ్యుల్లో పరివర్తన రావాలని ఆకాంక్షిస్తున్నారు. సభ ప్రారంభం కాగానే దివంగత సభ్యులకు సంతాపం ప్రకటించారు. అసెంబ్లీలో అజ్మీరా చందూలాల్, కేతిరెడ్డి సాయిరెడ్డి, ఎంఎస్ఆర్, మాచర్ల జగన్నాథం, మండలిలో రహమాన్, లక్ష్మారెడ్డిలకు నివాళులర్పించారు.
సభ నిర్వహణపై సమయం పెంచాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కొద్ది రోజుల సమయంతో సమస్యలు పరిష్కారమయ్యే వీలు ఉండదని తెలుస్తోంది. అందుకే సభా నిర్వహణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ప్రభుత్వం చెబుతున్నా ప్రతిపక్షాలు మాత్రం పెదవి విరుస్తున్నాయి. నిబంధనల ప్రకారం విధి విధానాలు రూపొందించుకుని ఐకమత్యంతోనే ముందకు కదలాలని చెబుతున్నారు.
అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రతిపక్షాల పాత్ర ప్రముఖమైనదే. ప్రభుత్వానికి సూచనలు చేయడంలో గౌరవప్రదమైన సలహాలు, సూచనలతో ప్రజలకు మేలు కలిగే పనుల నిర్వహణ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం మామూలే. ప్రజలకు కావాల్సిన అవసరాల మేరకే చట్టాలు చేయాల్సిన అవసరం గురించి తెలిసిందే. ఇందులో ప్రశ్నోత్తరాలు, సభా నిర్వహణ, జీరో అవర్ తదితర కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి సహకరించాలని సూచిస్తున్నారు.
ఈనెల 25,26 (శని,ఆదివారాలు), అక్టోబర్ 2న గాంధీ జయంతి, అక్టోబర్ 3 ఆదివారం సెలవు దినాలు కావడంతో అసెంబ్లీ కేవలం ఏడు రోజుల పాటే కొనసాగనుంది. సభ నిర్వహణలో ఇంత తక్కువ రోజులు సమయం ఉండడంతో సమస్యలు ఎక్కడ చర్చకు వస్తాయని ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. బీఏసీ సమావేశానికి తమకు ఆహ్వానాలు అందలేదని బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు మండిపడ్డారు. దీనిపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సభా మర్యాదలు పాటించాలని కోరారు.సభ్యులు గౌరవప్రదంగా మాట్టాడుతూ ప్రజల్లో చులకన కాకుండా చూసుకోవాలని హితవు పలికారు.