
దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం లాక్డౌన్ కొనసాగిస్తూ పోతుంది. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న లాక్డౌన్ 5.0 జూన్ 30వరకు కొనసాగనుంది. కేంద్రం ఓవైపు లాక్డౌన్ అమలు చేస్తూనే మరోవైపు సడలింపులు ఇస్తోంది. లాక్డౌన్ వల్ల కేంద్రం, ఆయా రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం భారీ సడలింపులు ఇచ్చింది. దీంతో ఆయా రాష్ట్రాలకు కొంతమేర ఆదాయం సమకూరుతోంది. ఇదిలా ఉంటే తెలంగాణ సర్కార్ జీతాలు, పెన్షన్లపై మంగళవారం రాత్రి తీసుకొచ్చిన ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఉద్యోగులకు భారీ షాకిచ్చింది.
అయితే తెలంగాణలో మాత్రం లాక్డౌన్ కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో భారీ కోత పడింది. వైద్యులు, పోలీసులు, పారిశుధ్య, విద్యుత్ శాఖలకు మినహా ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాల్లో కోత విధిస్తు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు, అఖిల భారత సేవా అధికారులు మరియు ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు 10శాతం నుంచి 75 శాతం వరకు వేతన కోతలను ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో ఏప్రిల్ నెల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతమే అందుతోంది. అయితే తెలంగాణలో భారీ సడలింపులు రావడంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుండటంతో మే నెల జీతం పూర్తిగా వస్తుందని ఉద్యోగులు భావించారు. అయితే వీరి ఆశలపై కేసీఆర్ నీళ్లుచల్లి సగం వేతనమే మంజూరు చేశారు.
ఇక జూన్ నెల వేతనంపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ జీతాల్లో కోతలు విధించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం పెన్షన్లలో కోత విధించే అధికారం తమకు ఉందని హైకోర్టులో వాదనలు విన్పించింది. దీంతో ప్రభుత్వానికి ఏ హక్కు ఉందో చెప్పాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రే ఆర్డినెన్స్ తీసుకురావడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆర్డినెన్స్ ప్రకారంగా రాష్ట్రంలో ఏవైనా విపత్తులు లేదా ప్రజారోగ్యానికి సంబంధించి అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు ఏ వ్యక్తికైనా, సంస్థకైనా, పెన్షనర్లకైనా చెల్లింపులను వాయిదా వేసే అధికారం ప్రభుత్వానికి కల్పించారు.
ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ చూస్తే ఉద్యోగులకు జూన్ నెలలోనూ పూర్తి వేతనం వచ్చే అవకాశం కన్పించడం లేదు. ఇప్పటికే మూడు నెలలుగా వేతనాల్లో కోత వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ చూస్తుంటే ప్రభుత్వం ఇప్పట్లో పూర్తిస్థాయి జీతాలు చెల్లించేందుకు సిద్ధంగా లేదని స్పష్టమవుతోంది. ఆర్డినెన్స్ కాలపరిమితి ఆరునెలలు ఉంటుంది కాబట్టి సెప్టెంబర్ వరకు ప్రభుత్వం ఉద్యోగులకు పూర్తిస్థాయి జీతాలు చెల్లించబోదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
అయితే ఆర్డినెన్స్ నియమ నిబంధనలు మార్చే అధికారం ప్రభుత్వానికి ఉండనుండటంతో వారికి జూన్ నెలలో పూర్తిస్థాయి వేతనాలు వస్తాయా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. మూడునెలలుగా సగం జీతంతో ఇబ్బందులు పడుతుండటంతో తమకు పూర్తిస్థాయి జీతాలు చెల్లించాలని ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!