CM KCR
CM KCR On Khammam: పదిరోజుల క్రితం ₹ 690 కోట్లు, అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా శుక్రవారం ₹100 కోట్లు.. ఇవీ ఆ జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వరాలు. ఆ పైసలు ఇచ్చింది సిరిసిల్లకో, సిద్దిపేటకో, గజ్వేల్‌కో కావు.. ఆంధ్రా సరిహద్దున ఉండే జిల్లాకు.. ఉన్నట్టుండి ఆ జిల్లా మీద కేసీఆర్‌కు ఎందుకు ప్రేమ కలిగింది? అసలు సీట్లు, ఓట్ల విషయంలో ఆ జిల్లానే పరిగణనలోకి తీసుకోని ముఖ్యమంత్రి ఎందుకు అంత నజర్ పెడుతున్నట్టు? ఓ లుక్కేద్దాం రండి.
తెలంగాణ అంతటా కేసీఆర్ మాట నడుస్తది. ఆయనేం చెప్పినా చెల్లుబాటు అయితది. కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం అందుకు విరుద్ధం. ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో (2014, 2018లో) బీఆర్‌ఎస్‌కు కేక్ వాక్ కాలేదు. ప్రతీ ఎన్నికల్లోనూ ఒక్క సీటు మాత్రమే దక్కింది. తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన వారు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆపై జరిగిన మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ బెదిరింపు రాజకీయాలే నడిచాయి. అయినప్పటికీ ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో చెప్పుకునేంత బలం ఇప్పటికీ జిల్లాలో లేదు. అందుకే కేసీఆర్ ఖమ్మంలో పార్టీ ప్లీనరీ నిర్వహించారు. ఖమ్మం కలెక్టరేట్ ప్రారంభానికి ఏకంగా పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను తీసుకొచ్చారు. అయినా కేసీఆర్ అనుకున్నంత ఫాయిదా దక్కలేదు.
ఇటీవల శాసనసభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటనలో తుమ్మల నాగేశ్వరరావుకు మొండి చేయి చూపడంతో ఆయన కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ‘ఉమ్మడి ఖమ్మం జిల్లా పది నియోజకవర్గాల్లో ఏ ఒక్క బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను మళ్లీ గెలవనీయను. అసెంబ్లీ గేటు తాకనివ్వను’ అని పొంగులేటి సవాల్ విసిరారు. దీనికి తగ్గట్టుగానే పొంగులేటి అడుగులు వేస్తున్నారు. బీఆర్‌ఎస్ లో సీనియర్ నాయకులుగా ఉన్న వారిని కాంగ్రెస్‌లోకి తీసుకెళ్తున్నారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లా చేజారిపోకూడదని కేసీఆర్ భావించినట్టు తెలుస్తోంది. అందుకే ఎన్నికల ముంగిట నిధుల వరద పారిస్తున్నట్టు సమాచారం. ఒక్కో ఎమ్మెల్యేతో కేసీఆర్ మాట్లాడుతున్నారని, నియోజకవర్గాల్లో పరిస్థితిని తెలుసుకుంటున్నారని బీఆర్‌ఎస్ వర్గాలు అంటున్నాయి. మరి కేసీఆర్ నిధులు వరద పారిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది.