CM KCR- National Politics: దేశాన్ని అనాధిగా పాలిస్తున్న 100 ఏళ్ల కాంగ్రెస్ ఓవైపు.. ఆ పార్టీని గడిచిన రెండు సార్లు చిత్తుగా ఓడించి గద్దెనెక్కిన బీజేపీ మరోవైపు. దేశంలో ఈ రెండు జాతీయ పార్టీలేనా? కొత్త జాతీయ పార్టీలు పుట్టాలని ‘థర్డ్ ఫ్రంట్’ తీసుకురావాలని కేసీఆర్ మరోవైపు చాలా కష్టపడుతున్నారు. కానీ కేసీఆర్ పెట్టుకున్న పీకే నుంచి మొదలుపెడితే బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నీ ఇప్పుడు కాంగ్రెస్ పంచనే చేరుతున్నాయి. కేసీఆర్ నిజంగా కమలం ఐడియాలజీని వ్యతిరేకిస్తూ ముందుకెళుతున్నా.. టీఆర్ఎస్ గట్టిగా బీజేపీ వ్యతిరేక పార్టీ అని ప్రచారం చేసుకుంటున్నా వీరితో కలిసి వచ్చే ప్రాంతీయ పార్టీలు కనిపించడం లేదు. కాంగ్రెస్ లేని బీజేపీయేతర ఫ్రంట్ అసాధ్యమని విపక్షాలు స్పష్టం చేశాయి. ఆ ఫ్రంట్‌లో కేసీఆర్‌కు స్థానం కల్పించడానికి ఇష్టపడడం లేదు.
బీజేపీని బంగాళాఖాతంలో కలిపేసేదాకా నిద్రపోనని, జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేస్తానని యుద్ధభేరి మోగించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ దిశగా ఇటు తెలంగాణలో, అటు ఢిల్లీ, ఇంకా జాతీయ స్థాయిలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం పలు రాష్ట్రాలకు వెళ్లి కీలక నేతలనూ కలిసొచ్చారు. టీఆర్ఎస్ ఢిల్లీలో నిర్వహించిన దీక్షలోనూ స్వయంగా పాల్గొన్నారు. కానీ బీజేపీ విధానాలను, ప్రధాని మోదీ తీరును తీవ్రంగా ఖండిస్తూ 13 పార్టీలు చేసిన సంయుక్త ప్రకటనలో కేసీఆర్ పేరు లేకపోవడం టీఆర్ఎస్ ప్రతిష్టకు ఇబ్బందికలిగించే అంశమేననే వాదన వినిపిస్తోంది.
Also Read: Bandi Sanjay: రివేంజ్ పాలిటిక్స్ : బండి సంజయ్ ను కావాలనే లేపుతున్నారా?
-ఫెడరల్ ఫ్రంట్‌కు బ్రేక్!
తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇన్నాళ్లూ వాదిస్తూ, ప్రయత్నిస్తూ వచ్చిన బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రంట్ కూటమి ఏర్పాటు ఇక ముగిసిన అధ్యాయం కాబోతోందనే సంకేతాలు వెలువడ్డాయి. కేసీఆర్ కల అయిన కాంగ్రెస్ లేని.. బీజేపీయేతర ఫ్రంట్ అసాధ్యమని దాదాపు అన్ని ప్రతిపక్షాలూ తేల్చేశాయి. దేశంలో చెలరేగుతున్న మతహింస, విద్వేషాలపై ప్రధాని మోదీ మౌనాన్ని ప్రస్తావిస్తూ 13 ప్రధాన ప్రతిపక్షాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో టీఆర్ఎస్కు చోటు దక్కకపోవడమే ఇందుకు నిదర్శనం. బీజేపీ వ్యతిరేక కూటమి.. ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన చేస్తున్న కేసీఆర్‌ను పూర్తిగా పక్కన పెట్టేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
-కాంగ్రెస్ లేకుండా కష్టమే..
చాలా కాలం పాటు కాంగ్రెస్ నాయకత్వాన్ని తిడుతూ వచ్చిన బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మనసు మార్చుకుని, బీజేపీ వ్యతిరేక పోరులో కాంగ్రెస్ ప్రాముఖ్యతను అనివార్యంగా అంగీకరిస్తున్న వైఖరిని ప్రదర్శించారు. కేసీఆర్ ఇదివరకు సమావేశమైన శరద్ పవార్(ఎన్సీపీ), ఎంకే స్టాలిన్(డీఎంకే), హేమంత్ సోరెన్(జేఎంఎం) ఇప్పటికే కాంగ్రెస్ లేని బీజేపీయేతర కూటమికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సంకీర్ణ భాగస్వామిగా ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వ సారధి ఉద్దవ్ ఠాక్రే(శివసేన)సైతం కేసీఆర్ ప్రతిపాదనల్ని మర్యాదపూర్వకంగా తిరస్కరించారు.
-ఐక్యంగా లేకుంటే నష్టమే అని..
ఢిల్లీలో కనీసం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగానైనా కలవడానికి ఇష్టపడని ఆప్ చీఫ్ అరవింద్ క్రేజీవాల్ కూడా బీజేపీని ఎదుర్కోనే క్రమంలో కాంగ్రెస్ కు దగ్గరవుతున్నట్లు సంకేతాలిచ్చారు. రాబోయే గుజరాత్ ఎన్నికల్లో అవసరమైతే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే దిశగానూ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాము ఐక్యంగా లేకపోతే బీజేపీకే ప్రయోజనం అనే విషయాన్ని ప్రతిపక్షాలు గ్రహించినట్లు తాజా ఉమ్మడి లేఖద్వారా తేటతెల్లం అయింది. కానీ కేసీఆర్ ను కనీసం బీజేపీ వ్యతిరేకిగా గుర్తించకపోవడం బహుశా మొన్నటిదాకా ఆయన వ్యవహరించిన తీరే కారణమనే విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఏడేళ్లపాటు బేషరతుగా మద్దతు పలికి, మోదీ సర్కార్ చేసిన అన్ని చట్టాలనూ సమర్థించిన కేసీఆర్.. ఇప్పుడు కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీని విభేదిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
-బీజేపీ అనుకూల పార్టీలను ఒప్పించడంలో విఫలం..
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఇప్పటిదాకా కేసీఆర్ కాంగ్రెస్‌తో కలిసి ఉన్న పార్టీల నేతలను కలిసి మాట్లాడారే తప్ప.. బీజేపీతో కలిసి ఉన్న పార్టీలను కలిసి, వాటిని ఒప్పించే ప్రయత్నాలు చేయలేదు. కనీసం పొరుగు రాష్ట్రం ఏపీ సీఎం జగన్ ను కూడా కలవని వైనాన్ని ప్రధాన ప్రతిపక్షాలు గమనిస్తున్నాయి. కేసీఆర్ ప్రతిపాదిస్తున్న కూటమి వల్ల విపక్షాల ఓట్లు చీలి బీజేపీకి ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడుతున్నాయి. అందుకే సంయుక్త ప్రకటనలో కేసీఆర్ పేరును చేర్చలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజా పరిణామాలు.. కేసీఆర్–టీఆర్ఎస్లో బీజేపీ వ్యతిరేక పంథాలో నిలకడ ఎంత? అనే ప్రశ్న తలెత్తుతోందని విశ్లేషకులు అంటున్నారు.
Also Read:YCP Politics: వైసీపీలో కట్టుదాటుతున్న క్రమశిక్షణ.. కట్టడి చేయలేకపోతున్న జగన్
Recommended Videos
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Cm kcr faces tough situation in national politics
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com