CM KCR: ఎన్నికల ఎత్తుగడలో తెలంగాణ ముఖ్యమంత్రి దిట్ట. ప్రత్యర్థిని ఎలా చిత్తు చేయాలో ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. ఇక సొంత పార్టీలో కూడా ఎవరైనా తోక ఆడిస్తే దానిని ఎలా కట్ చేయాలో గులాబీ బాస్‌కు బాగా తెలుసు. ఆలె నరేంద్ర నుంచి ఈటల రాజేందర్ వరకు ఎంతో మందిని సొంత పార్టీ నుంచి పంపించాడు కేసీఆర్. తాజాగా ప్లీనరీలో ఆయన సొంత ఎమ్మెల్యేలపైనే అవినీతి ఆరోపణ చేశారు. చిట్టా తన వద్ద ఉంటని కూడా తెలిపారు. పద్ధతి మార్చుకోకుంటే పార్టీ నుంచి గెంటేస్తామని కూడా హెచ్చరించారు. ఇప్పుడు ఈ మాటలు ఇటు బీఆర్‌ఎస్‌లోనూ.. అటు విపక్షాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి. అవినీతి చిట్టా చేతిలో పెట్టుకుని కేసీఆర్ అవినీతి ఎమ్మెల్యేలను ఎందుకు ఉపేక్షిస్తున్నారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అంటే అవినీతికి కేసీఆరే కొమ్ము కాస్తున్నాడా అని ఆరోపిస్తున్నాయి. తప్పు చేయకున్నా.. అవినీతి ముద్ర వేసి ఎంతో మందిని బయటకు పంపిన కేసీఆర్ 30 నుంచి 40 మంది అవినీతి ఎమ్మెల్యేల చిట్టా తన వద్ద ఉందని ప్రకటించడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నాయి.
సొంత పార్టీలో మరో చర్చ..
ఇక కేసీఆర్ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ పార్టీలో మరో రకమైన చర్చ జరుగుతోంది. తాను ఎవరికి టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారో వారిపై అవినీతి ముద్ర వేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు గుసగుసలాడుకుంటున్నారు. కేసీఆర్ వద్ద ఉన్న జాబితాలో ఎవరెవరి పేర్లు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. టికెట్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాకే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని చెప్పుకుంటున్నారు. దాదాపుగా 35 నుంచి 40 మందికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది.
ఏ పార్టీలో చేరకుండా..
అవినీతి పరుడిగా ఎమ్మెల్యేలపై ముద్ర వేస్తే.. వారిని విపక్ష పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ కూడా తమ పార్టీలో చేర్చుకోవడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయన్న భావనలో కేసీఆర్ ఉన్నారు. దీంతో తాను టికెట్ ఇవ్వకపోగా, విపక్షాల్లో కూడా టికెట్ దక్కకుండా చేయాలన్న ఎత్తుగడలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యేలకు భవిష్యత్తే ఉండకూడదన్న దురాలోచనలో కేసీఆర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే పార్టీ నుంచి గెంటేసే ఎమ్మెల్యేలపై అవినీతి ముద్ర వేయాలని చూఐస్తున్నట్లు తెలుస్తోంది.
ఇతర పార్టీలో చేరినా.. ఓడిపోయేలా..
ఇక బీఆర్‌ఎస్ నుంచి బయటకు వెళ్లాక బీజేపీ, కాంగ్రెస్‌లో చేరి టికెట్ సాధించినా.. అవినీతి ముంద్ర ఉంటుంది కాబట్టి.. వారిపై ఆ ప్రచారాన్ని మరింత ఉధృతం చేసే అవకాశం ఉంటుంది. అవనీతి ఎమ్మెల్యే మనకు అవసరమా అని సెంటిమెంటు రగిల్చే చాన్స్ బీఆర్‌ఎస్‌కే ఉంటుంది. విపక్షాలను అవినీతి పరులకు కొమ్ముకాసే పార్టీలుగా ముద్రవేసే అవకాశమూ అధికార పార్టీకే దక్కుతుంది. ఇలా ఏరకంగా చూసినా బీఆర్‌ఎస్‌కు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా గులాబీ బాస్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
పార్టీ వీడే ఆలోచనలో ఎమ్మెల్యేలు..
కేసీఆర్ వ్యాఖ్యలతో నొచ్చుకున్న కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ తమపై అవినీతి ముద్ర వేయకముందే బయటకు వెళితే బాగుంటుందని కొంతమంది భావిస్తున్నారట. ఇంకొందరు.. ఇప్పుడు బయటకు వెళితే కేసీఆర్ మాటలను నిజం చేసినవారమవుతామని, ఈ పరిస్థితిలోఒ పార్టీ వీడకపోవడమే మంచిదని, ఒకవేళ పార్టీ నుంచి గెంటేస్తే ఈటల రాజేందర్‌లా సెంటిమెంటు కలిసి వస్తుందని ఆలోచిస్తున్నారట.
మొత్తంగా టిక్కెట్లు ఎగ్గొట్టాలనుకున్న ఎమ్మెల్యేలపై అవినీతి ముద్ర వేసే ప్లాన్ కేసీఆర్ అమలు చేస్తున్నారన్నది మాత్రం ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. మరి కేసీఆర్ ప్లాన్‌లో బలయ్యేది ఎందరో చూడాలి.