CM Kcr Early Elections: ప్రస్తుతం కేసీఆర్ చేస్తున్న పనులు చూస్తుంటే చాలామందికి ఆశ్చర్యం వేయక మానదు. ఒకవైపేమో ముందస్తువకు వెళ్తేందుకు అన్ని ప్లాన్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దించడం, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సర్వేలు చేయడాన్ని బట్టి చూస్తుంటే.. కచ్చితంగా ముందస్తుకు వెళ్లడం ఖాయమనే అంటున్నారు.
పార్లమెంట్ ఎన్నికలతో కలిసి వెళ్తే తనకు నష్టం జరుగుతుందని మరోసారి ముందస్తు వ్యూహాన్ని అమలు చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. అయితే ముందస్తుకు వెళ్లాలంటే కచ్చితంగా కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రంలో గవర్నర్ సహకారం కచ్చితంగా కావాలి. గతంలో కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రంలో అప్పటి గవర్నర్ నరసింహన్ తో ఆయనకు ఉన్న రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అందుకే అప్పుడు ఆయన ముందస్తుకు వెళ్లగానే కేంద్రంతో పాటు ఇటు నరసింహన్ కూడా అన్ని విధాలుగా సహకరించారు. కానీ ఇప్పుడు మాత్రం అటు కేంద్రం, ఇటు గవర్నర్ తమిళిసైతో కేసీఆర్‌కు గ్యాప్ పెరిగింది. కేంద్రం మీద ఒంటి కాలితో లేస్తున్నారు. గవర్నర్ తో కూడా అంతర్గత విభేదాలు వస్తున్నాయి. పైగా ఈ సారి ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ పనిచేయదని, కాంగ్రెస్, బీజేపీలను బూచిగా చూపాలని కేసీఆర్ భావిస్తున్నారు.
కాబట్టి ఈ సారి కేసీఆర్ ముందస్తుకు వెళ్తే మాత్రం కేంద్రం సహకరించేందుకు సిద్ధంగా లేదు. పైగా గవర్నర్ కూడా అంత ఈజీగా ఆమోద ముద్ర వేయరు. అయితే గవర్నర్ ఈ విషయంలో పెద్దగా ప్రభావం చూపలేరు. కానీ కేంద్రం తలచుకుంటే మాత్రం ఏదో ఒక కారణం చెప్పి కనీసం ఆరు నెలలు అయినా అసెంబ్లీ రద్దును ఆపేయగలదు.
అదే జరిగితే కేసీఆర్ ప్లాన్ బెడిసి కొడుతుంది. ఎందుకంటే కేసీఆర్ వెళ్లేదే ఆరు నెలల ముందు ఎన్నికల కోసం కదా. ఆరు నెలల కంటే ఎక్కువ కేంద్రం కూడా ఆపడానికి వీలుండదు. ఈ విషయంలో కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. ఒకవేళ ఏడాది ముందే ఎన్నికలకు వెళ్తే మాత్రం.. అప్పుడు కేంద్రం ఆరు నెలలు ఆపినా.. మిగతా ఆరు నెలల్లోపు ఎన్నికలు జరిగిపోతాయి.
కాబట్టి ఈ రకంగా కేసీఆర్ ఏమైనా ప్లాన్ చేసుకుని ఉండవచ్చు. పైగా జాతీయ రాజకీయాల్లో ఎంతో పరిచయాలు ఉన్న ప్రశాంత్ కిషోర్ కూడా ఈ సారి పక్కన ఉన్నాడు. కాబట్టి ప్రశాంత్ కిషోర్‌ను ఉపయోగించి అయినా ముందస్తుకు పర్మిషన్ తెచ్చుకోవచ్చని భావిస్తున్నారు కేసీఆర్. ప్రస్తుతానికి బీజేపీకి తెలంగాణలో అధికారం కంటే కూడా కేంద్రంలో అధికారమే ముఖ్యం. కాబట్టి కేసీఆర్ అన్ని రకాలుగా చూసుకుని ముందస్తుకు వెళ్లే అవకాశం ఉంది.