BRS First List: నరాలు తెగే ఉత్కంఠ మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాష్ట్ర సమితి అభ్యర్థుల జాబితా ప్రకటించారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కొన్ని స్థానాలు మినహా దాదాపు అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. వీరిలో కొన్ని స్థానాలకు మాత్రమే కొత్త ముఖాలను పరిచయం చేశారు. కొంతమంది సిఫారసులను పక్కనపెట్టి మరీ పాత వరకే టికెట్లు ఇవ్వడం విశేషం. అయితే కెసిఆర్ టికెట్లు ఇచ్చిన వారిలో చాలామంది తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మరి అలాంటప్పుడు కేసీఆర్ ఏ నమ్మకంతో వారికి టికెట్లు ఇచ్చారనేది రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
2018 లోనూ అధికారులకు వచ్చిన భారత రాష్ట్ర సమితి సహజంగానే ప్రజల్లో వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ముఖ్యంగా కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీ నాయకులు కూడా వారి నాయకత్వంపై ఏమాత్రం ఆసక్తిగా లేరు. దీంతో ఈసారి వారికి టికెట్లు కష్టమే అని అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే అందరి అంచనాలు పటాపంచలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ వారిలో కొంతమంది టికెట్లు ఇవ్వడం విశేషం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ ఘన్ పూర్ లో కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చిన కేసీఆర్.. జనగామ విషయంలో మాత్రం నిశ్శబ్దాన్ని పాటించారు. ఇక్కడ పళ్ళ రాజేశ్వర్ రెడ్డికి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తనకే అవకాశం ఇస్తారని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అంటున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న యాదగిరి రెడ్డి భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక రాజయ్య సైతం పలు వివాదాల్లో తల దూర్చారని అంటున్నారు. అందుకే కెసిఆర్ టికెట్ ఇవ్వలేదని భారత రాష్ట్ర సమితి నాయకులు అంటున్నారు.
ఇక ఖమ్మం జిల్లా విషయానికొస్తే ఇక్కడ పది అసెంబ్లీ నియోజకవర్గం ఉండగా ఒక వైరా నియోజకవర్గంలో మాత్రమే సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని గత ఎన్నికలతో ఓడిపోయిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ కు కెసిఆర్ టికెట్ ఇచ్చారు.. పాలేరు స్థానం తుమ్మలకు కేటాయిస్తారని అనుకున్నప్పటికీ.. సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వైఫై ముఖ్యమంత్రి మొగ్గు చూపారు. వేముల వాడ నియోజకవర్గంలోనూ కొత్తవారికి ముఖ్యమంత్రి టికెట్ ఇచ్చారు. అయితే ముఖ్యమంత్రి టికెట్లు కేటాయించిన చాలామంది ఎమ్మెల్యేలు సొంత పార్టీ నాయకుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గత కొంతకాలం నుంచి పార్టీలోనే కొన్ని వర్గాలు ఆయా ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టాయి. అయితే ఈసారి వారికి టికెట్లు దక్కడం కష్టమే అనే అంచనాకు అందరూ వచ్చారు. ఒకానొక దశలో కొంతమంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీలవైపు వెళుతున్నారని ప్రచారం జరిగింది.. కానీ హఠాత్తుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు వెల్లడించిన అభ్యర్థుల పేర్లల్లో దాదాపు పాత వరకే పట్టం కట్టడం విశేషం.. మరి కేడర్ వద్దనుకున్న వారిని కెసిఆర్ ఎందుకు ఇష్టపడుతున్నట్టు? కెసిఆర్ బలవంతంగా రుద్దుతున్నారు కాబట్టి క్యాడర్ వారిని ఈ ఎన్నికల్లో మోస్తుందా? మరికొద్ది నెలల్లో ఈ ప్రశ్నలకు సమాధానం లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.