CM Jagan: సాధారణంగా సీఎం జిల్లా పర్యటనకు వస్తున్నారంటే స్థానికులు సంబరపడతారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తారని భావిస్తారు. ఆ ప్రాంతానికి వరాల జల్లు ప్రకటిస్తారని ఆహ్వానిస్తారు. కానీ ఏపీ సీఎం జగన్ విషయానికి వచ్చేసరికి మాత్రం అందుకు విరుద్ధం. ఆయన పర్యటన అంటేనే జిల్లాల ప్రజలు హడలెత్తిపోతున్నారు. సీఎం పర్యటనకు వస్తున్నారంటే చాలూ ఆ ప్రాంతం ముందుగానే అధికారుల దిగ్బంధంలోకి వెళ్లిపోతుంది. స్థానికులు అడుగు బయటపెట్టలేని విధంగా నిర్బంధం కొనసాగుతోంది. బలవంతంగా షాపులు మూయించి వ్యాపారులకు నష్టానికి గురిచేస్తున్నారు. పాఠశాలలకు అప్రకటిత సెలవులు ప్రకటించి విద్యార్థులను తరగతులకు దూరం చేయిస్తున్నారు. ప్రజా రవాణాకు సంబంధించి వాహనాలను సీఎం టూర్ కు కేటాయిస్తున్నారు. చివరకు అత్యవసర, అనారోగ్య సమయాల్లో రహదారిపైకి వచ్చే వారిని సైతం అడ్డగిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సీఎం పర్యటన అంటేనే యంత్రాంగానికి కత్తిమీద సాముగా మారుతోంది. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు, కర్టెన్లు కట్టేందుకే రోజుల తరబడి సమయం అవుతోంది. అయితే దీనిపై రాజకీయ విశ్లేషకులు, మేథావులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి చూడలేదని చెబుతున్నారు.

జడ్ ప్లస్ భద్రత ఉండే ప్రధానమంత్రి మోదీ ఇటీవల రెండుసార్లు రాష్ట్రంలో పర్యటించారు. కానీ ఎక్కడ బారికేడ్లు, కర్టెన్లు ఏర్పాటుచేయలేదు. ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించారు. కేంద్ర నిఘా సంస్థలు, భద్రత బలగాలు అతిగా స్పందించలేదు. మావోయిస్టు హిట్ లిస్టులో ఉన్న నేతలు, సీఎంలు సైతం ఇంతగా రెస్పాండ్ అవ్వలేదు. ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నించారే తప్ప ఇంతగా అణచివేతకు పాల్పడలేదు. జగన్ సీఎం అయిన తరువాత ఎందుకో అభద్రతా భావంతో గడుపుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తాడేపల్లిలోని ప్యాలెస్ పక్కన పేద ప్రజల ఇళ్లను తొలగింపునకు పూనుకోవడం విమర్శలకు తావిచ్చింది. అప్పటి నుంచి అదే పరంపరను కొనసాగిస్తూ వచ్చారు.
తొలుత రాజధాని ఇష్యూలో ప్రజాప్రతిఘటన వస్తుందని సీఎం జగన్ ప్రజలకు దూరంగా ఉన్నారన్న భావన ఉండేది. అయితే ఇప్పుడు జిల్లాల పర్యటనలో కూడా అదే పంథాను కొనసాగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. చివరకు తన ప్యాలెస్ నుంచి కేబినెట్ సమావేశాలకు హాజరైనప్పుడు సైతం రోడ్డుకిరువైపులా బారికేడ్లు, కర్టెన్లు కట్టారు. ఇప్పుడు జిల్లా పర్యటనల్లో కూడా బారికేడ్లు, కర్టెన్లు, పరదాలకు పని చెబుతున్నారు. అటువంటప్పుడు జిల్లాల పర్యటనకు సీఎం జగన్ ఎందుకు శ్రీకారం చుట్టారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అధికారంలోకి వచ్చే వరకు జనం..జనం అన్న జగన్.. అధికారంలోకి వచ్చాక జనానికి దూరంగా ఎందుకు జరిగిపోతున్నారో అర్ధం కావడం లేదు.

అయితే సీఎం పర్యటనల్లో విధ్వంసాలు, విలువైన నిర్మాణాల తొలగింపునకు దిగుతుండడం మాత్రం విస్తుగొల్పుతోంది. సాధారణంగా సీఎంలు, పీఎంలు పర్యటించే సమయంలో మంచి పథకాలు, ప్రాజెక్టులకు గుర్తుగా మొక్కలు నాటడం ఆనవాయితీగా వస్తోంది. అటువంటిది 20, 30 సంవత్సరాల వయసున్న చెట్లను తొలగిస్తున్నారు. నరసాపురంలో ఇదే జరిగింది. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కూడా వ్యాపారుల దుకాణాలను తొలగించారు. అసలే అస్తవ్యస్త రహదారులు.. ఆపై బారికేడ్ల కోసం తవ్వుతుండడంతో మరింత అధ్వానంగా తయారవుతున్నాయి.
సీఎం జగన్ పర్యటనలో ప్రజల సెంటిమెంట్ లకు కూడా తీవ్ర విఘాతం కలుగుతుంది. చివరకు మహిళలు బ్లాక్ చున్నీలు వేసుకున్నా విడిచిపెట్టడం లేదు. ముస్లిం మహిళలు బురఖా ధరించినా తొలగిస్తున్నారు. చివరాఖరుకు సొంత పార్టీ సర్పంచ్ లు, ప్రజాప్రతినిధులకు సైతం బ్లాక్ డ్రెస్ లు వేయవద్దని ఆదేశాలిచ్చే వరకూ పరిస్థితి వచ్చింది. బ్లాక్ అనగానే పాలక పెద్దలు తెగ భయపడుతున్నారు. ఎక్కడ నిరసన తెలిపేందుకు వస్తున్నారో అని సభా ప్రాంగంణంలోనే వారితో బలవంతంగా తీయిస్తున్నారు. చివరకు అయ్యప్ప మాలధారణలో ఉన్న వారి సెంటిమెంట్ ను అగౌరవపరచేలా వ్యవహరిస్తున్నారు. జన నేతగా పిలిపించుకుకోవడానికి ఆరాటపడిన జగన్.. ఇప్పుడు జనం వద్దు అన్న పరిస్థితికి వచ్చేసరికి అటు సొంత పార్టీ శ్రేణులకు మింగుడుపడడం లేదు. మరీ తమ నేతలో ఇంతలా అభద్రతా భావం పెంచడానికి కారణాలేవైనా ఉన్నాయా? అని అన్వేషణ ప్రారంభించారు. అయితే విశ్లేషకులు మాత్రం ప్రజా వ్యతిరేకతకు భయపడే జగన్ ఇలా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.