JanaSena- Jagan: ఏపీలో జనసైనికులు అసలు సిసలు రాజకీయాలు మొదలుపెట్టారు. రాజకీయ ప్రత్యర్థుల కుళ్ళు, కుతంత్ర రాజకీయాలను అర్ధం చేసుకున్నట్టున్నారు. అందుకే వారి ఎత్తుగడలకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. జనసేన ఆవిర్భవించిన సుదీర్ఘ కాలంలో ఎన్నోరకాల ఆటుపోట్లు ఎదురయ్యాయి. రాజకీయ ప్రత్యర్థులు పార్టీపై విషం చిమ్మేందుకు ప్రయత్నించారు. నిర్వీర్యం చేయాలని భావించారు. కానీ పవన్ ఎక్కడా అవకాశం ఇవ్వకుండా, తాను అచేతనం కాకుండా పార్టీని నిలబెట్టగలిగారు. అటు జన సైనికులు, అభిమానులు కూడా అధినేత ఆశయాలకు అనుగుణంగా నడుచుకున్నారు. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం మెడలు వంచి పరిష్కారమార్గం చూపిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ సర్కారుకు, ఆ పార్టీకి ప్రధాన టార్గెట్ అవుతున్నారు. కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. అందుకే జనసేన, పవన్ పై వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. గ్రామస్థాయి నాయకుడి నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, చివరికి సీఎం వరకూ..ఇప్పుడందరికీ రాజకీయ ప్రత్యర్థి పవనే.

తాజాగా పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ వ్యక్తిగత కామెంట్స్ చేశారు. ఆయన భార్యల గురించి ప్రస్తావించారు. తనది ఒకటే రాష్ట్రం, ఒకటే భార్య అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. అయితే తనపై వ్యక్తిగత కామెంట్స్ చేయవద్దని పలుమార్లు పవన్ హెచ్చరించారు. అలాచేస్తే నేను మీ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడతానని స్పష్టం చేశారు. బహుశా ఈ లెక్కతోనే జగన్ తన సొంత జిల్లా కడపలో పవన్ పై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పవన్ దీనిపై స్పందిస్తారని.. దీనికి జన సైనికులు అనుసరిస్తారని భావిస్తున్నట్టున్నారు. తద్వారా కౌంటర్ అటాక్ కు ప్లాన్ చేసినట్టున్నారు. అయితే పవన్ కానీ, జన సైనికులు కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడంతో అధికార పార్టీ నేతల వ్యూహం అంతగా వర్కవుట్ కాలేదు.

ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార వైసీపీ ఏ ప్రయత్నాన్ని వదలడం లేదు. పవన్ బహు భార్యత్వాన్ని తెరపైకి తెచ్చి ఏపీ మహిళా సమాజంలో అదో చర్చకు కార్నర్ చేయాలని అధికార పార్టీ ప్రయత్నిస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. అందులో భాగంగానే జగన్ వ్యూహాత్మకంగా మాట్లాడారని చెబుతున్నారు. అయితే పవన్ ఇప్పటికే తన వివాహ జీవితంపై వస్తున్న కామెంట్స్ పై రియాక్టయ్యారు. ఇరువర్గాల ఆమోదం, సమ్మతంతో చట్టబద్ధంగానే విడాకులు తీసుకొని వివాహం చేసుకున్నానని.. భరణం కూడా ఇచ్చినట్టు గుర్తుచేశారు. మీలా ఒక వివాహం చేసుకొని 30 మంది స్టెప్నీలు పెట్టుకొనే రకం కాదంటూ గట్టిగానే మాట్లాడారు. అయినా సరే తాజాగా సీఎం జగన్ పవన్ పై చేసిన కామెంట్స్ వెనుక ఏదో వ్యూహం ఉందన్నఅనుమానాలున్నాయి. సాధారణంగా పవన్ పైఏ చిన్న కామెంట్స్ వచ్చినా అభిమానులు తట్టుకోలేరు. కానీ సీఎం జగన్ పై మాత్రం వారు రియాక్టు కాలేదు. వైసీపీ వ్యూహాన్ని గమనించి.. వ్యూహాత్మకంగా జన సైనికులు మౌనం పాటించినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయంలో జన సైనికులకు హ్యాట్సాప్ చెప్పాల్సిందేనంటున్నారు.