
ఏపీ పాలనలో సంస్కరణలు తీసుకురావాలని డిసైడ్ అయ్యారు అక్కడి సీఎం జగన్‌మోహన్ రెడ్డి. ఇందులో భాగంగా మరో కీలకం నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం కాస్త సర్పంచులకు షాక్ ఇచ్చేదిగా ఉంది. ముఖ్యంగా సచివాలయాల్లో తమదే రాజ్యం అని భావించే సర్పంచుల బాధ్యతలకు ఇక కత్తెర పడినట్లేనని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. సర్పంచులకు తోడు పంచాయతీ కార్యదర్శులు కూడా ఇకపై తమ బాధ్యతలకు దూరం కావాల్సి వస్తోంది. అంతిమంగా రెవెన్యూ శాఖ పరిధిలోకి వచ్చే వీఆర్వో, ఎమ్మార్వో, ఆర్డీవోలకే కీలక అధికారాలు కట్టబెట్టడం ద్వారా పంచాయతీరాజ్ శాఖకు భారీ షాక్ ఇచ్చారు జగన్.
ఏపీలో గ్రామ సచివాలయాల వ్యవస్థ రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల మధ్య అగాధం తెచ్చింది. ముఖ్యంగా సచివాలయాలపై ఎవరి పెత్తనం ఉండాలన్న విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటూ వెళ్లడంతో ఈ వ్యవహారం క్లిష్టంగా మారిపోయింది. గ్రామ సచివాలయాల్లో ఇప్పటివరకూ పంచాయతీ కార్యదర్శులకు అధికారాలు ఉండగా.. ఇప్పుడు ఆ అధికారాన్ని వీఆర్వోలకు మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనం రేపుతోంది. ఏపీ గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులకు జీతభత్యాల నుంచి అన్ని అధికారాలను స్థానిక వీఆర్వోలకు కట్టబెడుతూ గ్రామ సచివాలయాల శాఖ తాజాగా జీవో నంబర్ 2 జారీ చేసింది.
ఈ జీవో ప్రకారం సచివాలయాల్లో ఇప్పటివరకూ అధికారం చెలాయించిన పంచాయతీ కార్యదర్శులు నామమాత్రం కానున్నారు. ఇక తమ శాఖ రెవెన్యూ పరిధిలో ఉన్న వీఆర్వోలతో నడుస్తుందనేలా సచివాలయాల శాఖ జారీ చేసిన ఆదేశాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. తాజాగా సచివాలయాల డీడీవో అధికారాలు ఎవరికి ఉండాలన్న అంశంపై ప్రభుత్వం ఓ సర్వే నిర్వహించింది. ఇందులో ఉద్యోగులు అన్ని పథకాల మీద పట్టు ఉండి, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన డిజిటల్ అసిస్టింట్‌కు ఇస్తే బాగుంటుందని ఎక్కువగా సూచించారు. మరికొందరేమో పంచాయతీ కార్యదర్శులకే ఈ అధికారం ఇవ్వాలని కోరారు. ఇంకొందరు వీఆర్వోకు డీడీవో అధికారాలు ఇవ్వాలని ప్రభుత్వానికి చెప్పారు.
ఈ క్రమంలో చివరికి ప్రభుత్వం వీఆర్వోల వైపే మొగ్గుచూపింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పంచాయతీ కార్యదర్శులు మండిపడుతున్నారు. సచివాలయాల్లో ప్రభుత్వం నియమించిన కార్యదర్శులంతా ఉన్నత విద్యావంతులు. వీరి కనీస విద్యార్హత డిగ్రీ. పీజీలు, ఇంజినీరింగ్, ఎంబీఏలు చదివిన వారు కూడా ఉన్నారు. కానీ.. వీఆర్వో ఉద్యోగ నియామకాల్లో విద్యార్హత ఇంటర్. అందులోనూ డిగ్రీ చదివిన వారు ఉన్నారు. కానీ.. ఎక్కువ పంచాయతీల్లో టెన్త్ విద్యార్హతతో వీఆర్‌ఏ ఉద్యోగం సంపాదించి ప్రమోషన్లతో వీఆర్వో అయిన వారు ఉన్నారు. ఇప్పుడు సచివాలయాలపై వీఆర్వోలకు పెత్తనం ఇవ్వడాన్ని కార్యదర్శులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ప్రస్తుతం ఏపీలో పంచాయతీరాజ్ వ్యవస్ధలో గ్రామ పంచాయతీ పాలన సెక్రటరీ, పంచాయతీరాజ్ ఈవో, డీఎల్ పీవో, డీపీవో స్థాయిల్లో ఉంది. సంక్షేమ పథకాలు, ఇతర పౌర సేవలన్నీ సచివాలయాలకు వెళ్లిపోయాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో అభివృద్ధి పనులు మాత్రమే వీరికి మిగిలాయి. సచివాలయాలపై కార్యదర్శులకే కాదు సర్పంచ్‌లకూ పెత్తనం లేకుండా పోయింది. దీంతో ఈవోపీఆర్‌డీ, డీఎల్‌పీవో, డీపీవో ఆఫీసుల పరిస్థితి ప్రశ్నార్థకం కానుంది. క్రమంగా ఈ పోస్టులన్నీ ఉత్సవ విగ్రహాలుగా మారిపోనున్నాయి. సర్పంచుల బాధ్యతలకు సైతం కోత పడనుంది. వారు కూడా గ్రామసభల్లో పథకాల లబ్ధిదారుల ఎంపికలో మాత్రమే అధ్యక్షులుగా ఉంటారు. ఇక వీరికి ఎలాంటి అధికారాలూ ఉండవు. అలాగే.. మండల స్థాయిలో ఎంపీడీవో, జిల్లా స్థాయిలో జడ్పీ సీఈవోలు సైతం నామమాత్రంగా మిగిలిపోనున్నారు. ప్రస్తుతం పంచాయతీ సెక్రటరీకి జీతమిచ్చే అధికారం ఎంపీడీవోకి ఉండగా.. ఈ పదవిని పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా మార్చనున్నారు.