దేశంలో కరోనా రోజూ వారి కేసుల సంఖ్య 2 లక్షల మార్కును దాటేసింది. ఇటు ఏపీలో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో సుమారు 5 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో ముఖ్యమంత్రి జగన్ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. వ్యాక్సినేషన్ తోపాటు కొవిడ్ లాక్ డౌన్ అంశంపైనా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్రంలో కొవిడ్ కేసులు అంతకంతకూ పెరుగుతుండడంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా.. ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పించాలని, సరిపడా బెడ్లు ఉండేలా చూడాలని ఆదేశించారు. ఇక, వ్యాక్సిన్ ప్రక్రియను అత్యంత కీలకంగా చేపట్టాలని కూడా చెప్పారు. రాష్ట్రానికి అవసరమైన వ్యాక్సిన్ల కోసం కేంద్రానికి జగన్ లేఖరాసినట్టు సమాచారం. 60 లక్షల వ్యాక్సిన్ డోసులు పంపించాలని కోరినట్టు తెలిసింది.
ఇక, లాక్ డౌన్ గురించి మాట్లాడుతూ.. గత లాక్ డౌన్ వల్ల దేశంతోపాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా దారుణంగా దెబ్బతిన్నదని సీఎం చెప్పారు. అందువల్ల రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని సీఎం స్పష్టం చేశారు. వ్యాపారలన్నీ మూసేస్తే ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడడంతోపాటు.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా క్షీణిస్తుందని చెప్పారు. ఇలాంటి పరిస్థితి రాకుండానే.. కరోనాను అదుపులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు జగన్.
ఇక, కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలని సీఎం కోరారు. సెకండ్ వేవ్ విజృంభిస్తున్నందున కొవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రతీ ఒక్కరు మాస్క్ వేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. గతేడాది లాక్ డౌన్ వల్ల ఏపీలో రూ.21 వేల కోట్ల ఆర్థిక నష్టం సంభవించిందని, ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జగన్ అన్నారు.