
CM Jagan- AP MLC Elections: శాసన మండలి ఇప్పుడు వైసీపీ నాయకులకు పెద్దల సభగా గుర్తొచ్చినట్టుంది. అందుకే తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. అసలు శాసనమండలి అన్నదే వేస్ట్ అని ఒక స్థిర నిర్ణయానికి వచ్చిన పాలక పక్షం రద్దు చేయాలని చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అక్కడే ఉండేది అంతా పనికి మాలిన వాళ్లేనని కూడా తేల్చేశారు. దానికి అంత డబ్బులు ఖర్చు చేయడం దండగ అని కూడా ప్రకటనలు ఇచ్చారు. ఇప్పడదే శాసనమండలిలో రాబోవు ఆరు నెలల్లో భర్తీ చేయాల్సిన ఎమ్మెల్సీ స్థానాలను కలిపి ప్రకటించేసి విప్లవం తెచ్చామని ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నారు. తమకు అలవాటుగా మారిన ‘మడమ తిప్పుడు’కు తామే బ్రాండ్ అంబాసిడర్ గా నిరూపించుకున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో శాసనమండలిలో టీడీపీదే ఆధిక్యం. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు, తీర్మానాలకు, ప్రతిపాదనలకు, బిల్లులకు అడ్డుకట్ట పడేది. ప్రజలు అంతులేని విజయం కట్టబెట్టిన తమ ముందు మీ కప్పగెంతులేమిటని జగన్ ఆగ్రహించారు. ఒక వ్యక్తి కోసం నాడు ఎన్టీఆర్ పెద్దల సభను రద్దుచేశారని గుర్తుచేసుకుంటూ..దానినే ఒక ఆదర్శంగా చెప్పుకుంటూ శాసనమండలి రద్దుకు తీర్మానించారు. ఏకంగా దానిపై పెద్ద చర్చే నడిపారు. దానిపై ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం దండగని.. అలాంటిది ఏడాదికి రూ.60 కోట్లు ఖర్చు చేయడం ఏమిటన్న వాదనను తెరపైకి తెచ్చారు. ఈ ప్రభుత్వంలో వృథా ఖర్చు అన్నదే లేదని అర్ధం వచ్చేలా మాట్లాడి సీఎం జగన్ రక్తికట్టించారు.
ఇప్పుడు శాసనమండలిలో గుంపగుత్తిగా ఖాళీ అవుతున్న స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. మరో ఆరు నెలల్లో ఖాళీ అవుతున్న స్థానాలను సైతం భర్తీచేసే పనిలో పడ్డారు. ఇలా ఎంపిక అవుతున్న వారిని గొప్పవారిగా కీర్తిస్తున్నారు. పెద్దల సభగా ఉన్న ఒక గొప్ప ప్రదేశానికి జగన్ మిమ్మల్ని పంపిస్తున్నారంటూ గొప్పగొప్పగా ప్రకటనలు చేస్తున్నారు.మరికొద్దిరోజుల్లో ఇతర పార్టీలకు ప్రాతినిధ్యం ఉండదు. మొత్తం సభలో వైసీపీ సభ్యులుగా ఉండే చాన్స్ ఉంది. అయితే అప్పట్లో పనికి మాలినదిగా కనిపించిన శాసనమండలి.. ఇప్పుడు తమవారితో నిండుగా కనిపించేసరికి వైసీపీ నేతలు తమ అభిప్రాయాలను మార్చుకున్నారు. ‘మడమ తిప్పుడు’ మాటలు, ప్రకటనలతో తామకు తామే అని నిరూపించుకుంటున్నారు.

పెద్దల సభ తమ కంట్రోల్ కి వచ్చింది కదా అని పునితమైందని భావిస్తున్నారు. 60 కాకుంటే 160 కోట్లు కేటాయించేందుకు రెడీ అయిపోతున్నారు. చేతిలో అధికారం ఉంది. ఆపై అంతులేని సైన్యం ఉంది కాబట్టి ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. కానీ గతంలో అన్న మాటలు రికార్డు. అందునా సోషల్ మీడియా వచ్చిన తరువాత పాత మాటలు హైప్ అవుతుంటాయి. నాడు శాసనమండలిలో జగన్ చేసిన వ్యాఖ్యలు.. నేటి పరిణామాల మధ్య తేడాను చూపిస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎంత మడమ తిప్పుడు తెలిసినా.. మరీ ఇంతలా అంటూ కామెంట్లను ట్రోల్ చేస్తున్నారు.