
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అనేక పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతుల కోసం జగన్ రాష్ట్రమంతటా రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేయించారు. తాజాగా జగన్ రైతుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ఆర్బీకే(రైతుభరోసా కేంద్రాలు)ల నుంచి పంట సేకరణ జరగాలని అధికారులకు సీఎం చెప్పారు.
Also Read : వైఎస్ వివేకా హత్య: కీలక సమాచారం చెప్పిన ఆ ఇద్దరు మహిళలు?
గ్రామాల్లో రైతుల నుంచి 30 శాతం పంట ఉత్పత్తులను మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని సూచనలు చేశారు. రైతులకు సంబంధించిన మిగిలిన పంటను కూడా అమ్ముడుపోయేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతులు పంటల ద్వారా నష్టపోకుండా చూడాలని సీఎం జగన్ పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాలను పూర్తిస్థాయి ధాన్యం సేకరణ కేంద్రాలుగా మార్చి రైతులకు ప్రయోజనం చేకూరేలా చేయాలని అన్నారు.
రైతుభరోసా కేంద్రాలలో పంటల గిట్టుబాటు ధరలను ప్రదర్శించాలని చెప్పారు. ప్రభుత్వం 3,300 కోట్ల రూపాయలు రైతులకు మద్దతు ధర కోసం కేటాయించిందని అన్నారు. నిన్న తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన జగన్ రైతుల పేర్ల నమోదు, ధాన్యం సేకరణ లాంటి కార్యక్రమాలన్నీ జరగాలని అధికారులకు సూచించారు. అక్రమాలు జరగడానికి అవకాశం ఇవ్వకుండా పత్తి కొనుగోళ్లు చేయాలని చెప్పారు.
జాయింట్ కలెక్టర్లు రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసే పంటల గురించి రైతులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని.. మద్దతు ధరలు అమలు చేస్తేనే రైతులు పండించిన పంటలకు న్యాయం జరుగుతుందని అన్నారు. నాణ్యత లేని బియ్యాన్ని రవ్వ, పిండి కొరకు వినియోగించాలని.. ఏ పంటలు వేస్తే ఎంత లాభం వస్తుందో రైతులకు తెలియజేయాలని అన్నారు.
Also Read : అలెర్ట్: మరో 24 గంటలు.. తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక