CM Jagan : అసంతృప్తి స్ట్రాట్ అయ్యింది.. జగన్ కు ఝలక్ తగిలింది

మొన్నటికి మొన్న నెల్లూరులో ధిక్కార స్వరాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఏకంగా ముగ్గురు ఎమ్మెల్యేలు దూరమయ్యారు. ఇప్పుడు ప్రకాశం జిల్లా వంతు వచ్చింది.

Written By: Dharma, Updated On : April 30, 2023 11:18 am
Follow us on

CM Jagan : మాజీ మంత్రి బాలినేని స్ట్రాంగ్ గా డిసైడయ్యారా? పార్టీ పదవికి రాజీనామా చేయడం దేనికి సంకేతం? ఇది హైకమాండ్ కు  తుది హెచ్చరికనే? దిద్దుబాటు చర్యలకు దిగకుంటే కఠిన నిర్ణయాలుంటాయని సంకేతాలు పంపారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బాలినేని నిర్ణయం వెనుక బలమైన కారణాలున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జగన్ కు అత్యంత ఆప్తులు ఈ ఎపిసోడ్ వెనుక ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంలగా బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా మంత్రివర్గం నుంచి తొలగించిన తరువాత పార్టీలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అప్పటివరకూ జిల్లాపై పట్టున్న ఆయన క్రమేపీ నియోజకవర్గానికే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కూడా లభించదని ప్రత్యర్థులు ప్రచారం చేస్తుండడంతో కలత చెందుతున్నారు.

ఇటీవల పరిణామాలతో..
జగన్ కు బాలినేని అత్యంత ఆప్తుడుగా మెలిగేవారు. అందుకే జగన్ తన తొలి మంత్రివర్గంలో తీసుకున్నారు. ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించారు. మొన్నటి వరకూ బాలినేని అన్నీతానై వ్యవహరించారు. జగన్ కూడా స్వేచ్ఛనిచ్చారు. అయితే ఇటీవల వరుస పరిణామాలతో ఆయన కలత చెందుతున్నారు. తనకంటే జూనియర్ అయిన ఆదిమూలపు సురేష్ ను కొనసాగించి తనను మంత్రివర్గం నుంచి తప్పించడంపై బాలినేని బాధపడ్డారు.  ఇటీవల జగన్ మార్కాపురం టూర్ లో బాలినేనిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయనలో మనో వేదన ప్రారంభమైంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైమ్ లోనే మంత్రి పదవి చేపట్టిన తనకు ఈ పరిస్థితి ఏంటమని బాలినేని లోలోపల కుమిలిపోతున్నారు. అందుకే పార్టీ పదవికి రాజీనామా చేశారు.

ఆ ఇద్దరి వల్లే..
అయితే ఈ ఎపిసోడ్ వెనుక రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఉన్నట్టు బాలినేని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జనసేనకు చెందిన విశాఖ కార్పొరేటర్ మూర్తి యాదవ్ బాలినేనిపై ఆరోపణలు చేయడం, డీఎస్పీల బదిలీల విషయంలో తనను కనీస పరిగణలోకి తీసుకోకపోవడంతో బాలినేని మనస్తాపం చెందారు. గతంలో వైవీసుబ్బారెడ్డిపై హైకమాండ్ కు ఫిర్యాదుచేసినా ఫలితం లేకపోయింది. అందుకే బాలినేని రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు. అవసరమైతే పార్టీని వీడడానికి కూడా వెనుకాడబోనని హెచ్చరికలు పంపారు.

ఇప్పుడు ప్రకాశం వంతు..
మొన్నటికి మొన్న నెల్లూరులో ధిక్కార స్వరాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఏకంగా ముగ్గురు ఎమ్మెల్యేలు దూరమయ్యారు. ఇప్పుడు ప్రకాశం జిల్లా వంతు వచ్చింది. ప్రస్తుతానికైతే బాలినేని అసంతృప్తితో ఉన్నారని.. ఇది మరింత ముదిరితే మాత్రం ధిక్కారానికి దారితీసే పరిస్థితులు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే సీఎం జగన్ సొంత సామాజికవర్గం నుంచే ఇటువంటి స్వరాలు వినిపిస్తుండడం విశేషం. బాలినేని కీలక నిర్ణయం తీసుకుంటే మాత్రం మరోసారి జగన్ డిఫెన్స్ లో పడడం ఖాయం.