Homeఆంధ్రప్రదేశ్‌Atchannaidu- CM Jagan: అచ్చెన్నాయుడును గెలిపించనున్న జగన్

Atchannaidu- CM Jagan: అచ్చెన్నాయుడును గెలిపించనున్న జగన్

Atchannaidu- CM Jagan
Atchannaidu- CM Jagan

Atchannaidu- CM Jagan: కింజరాపు అచ్చెన్నాయుడు నెత్తిన జగన్ పాలుపోశారా? టెక్కలి అసెంబ్లీ స్థానం వైసీపీకి చేజారినట్టేనా? చేజేతులా టీడీపీకి అప్పగించినట్టేనా? వైసీపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ పేరును ప్రకటించడం ద్వారా మార్గం సుగమం చేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు నిజం చేకూరుస్తున్నాయి. శ్రీకాకుళం పర్యటనలో భాగంగా సీఎం జగన్ మూలపేట పోర్టుతో పాటు వంశధార ఎత్తిపోతల పథకం, బుడగట్లపాలెం జట్టీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో టెక్కలి అసెంబ్లీ స్థానానికి దువ్వాడ శ్రీనివాసరావు అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో మిగతా ఆశావహుల ఆశలను నీరుగార్చారు. లోకల్ కేడర్ అభిప్రాయానికి భిన్నంగా ప్రకటించారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

జిల్లాపై కింజరాపు కుటుంబం ముద్ర..
గత ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసినంత పనిచేసింది. తెలుగుదేశం పార్టీ రెండు స్థానాలకే పరిమితమైంది. ఇచ్ఛాపురం, టెక్కలి స్థానాలతో సరిపెట్టుకుంది. అంత జగన్ ప్రభంజనంలో కూడా ఇచ్ఛాపురం నుంచి బెందాళం అశోక్, టెక్కలి నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు గెలుపొందారు. శ్రీకాకుళం ఎంపీగా కింజరాపు రామ్మోహన్ నాయుడు గెలుపొందారు. జిల్లాలో ఎనిమిది స్థానాలకు గాను ఆరు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఓటమి చవిచూసినా ఎంపీగా కింజరాపు రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు. జిల్లాపై కింజరాపు కుటుంబం ముద్ర చెరగకపోవడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోయారు. వచ్చే ఎన్నికల్లో కింజరాపు కుటుంబానికి చెక్ చెప్పాలని భావిస్తున్నారు. గత ఎన్నికల తరువాత అందుకు తగ్గట్టు కార్యాచరణ చేశారు.

కేవలం దూకుడును నమ్మే…
అందులో భాగంగా దూకుడు మీద ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ను జగన్ ప్రోత్సహించారు. అప్పటివరకూ టెక్కలి నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్న పేరాడ తిలక్ ను తప్పించి దువ్వాడ శ్రీనివాస్ కు నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించారు. అచ్చెన్నాయుడు మీద వ్యక్తిగత కామెంట్స్ కు దిగడంతో ఏకంగా ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి మరీ కలబడాలని ఆదేశాలిచ్చారు. అక్కడ నుంచి వేదిక ఏదైనా కింజరాపు కుటుంబాన్ని, ముఖ్యంగా అచ్చెన్నను టార్గెట్ చేసుకొని దువ్వాడ ఫైర్ అయ్యేవారు. ఆయన మాటలు తెగ వైరల్ అయ్యేవి. దీంతో దువ్వాడ దూకుడును మెచ్చుకున్న జగన్ ఏకంగా వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి శ్రీనివాసేనంటూ ప్రకటించారు. ఆశీర్వదించండి అంటూ టెక్కలి నియోజకవర్గ ప్రజలను కోరారు.

Atchannaidu- CM Jagan
Atchannaidu- CM Jagan

విభేదిస్తున్న కేడర్..
అయితే దువ్వాడ శ్రీనివాస్ కు నియోజకవర్గంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. అక్కడ అభ్యర్థిత్వాన్ని కేంద్ర మాజీ మంత్రి కృపారాణితో పాటు కళింగ కార్పొరేషన్ చైర్మన్ తిలక్ ఆశిస్తున్నారు. అటు టెక్కలి నియోజకవర్గంలోని నాలుగు మండలాల కేడర్ సైతం దువ్వాడ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తోంది. వ్యతిరేక శిబిరాలు ఏర్పాటుచేసుకొని మరీ దువ్వాడను తప్పించాలని హైకమాండ్ కు అల్టిమేటం ఇచ్చారు. ఒక వేళ దువ్వాడకే టిక్కెట్ ఇస్తే ఓడిస్తామని హెచ్చరించారు. మరోవైపు కృపారాణి, తిలక్ వర్గం సహకరించే పరిస్థితి లేదు. కానీ ఇవన్నీ జగన్ పరిగణలోకి తీసుకోలేదు. కేవలం బలమైన ప్రత్యర్థి అయిన అచ్చెన్నాయుడును ఢీకొట్టాలంటే దువ్వాడ శ్రీనివాసే కరెక్ట్ అభ్యర్థి అని డిసైడయ్యారు. ఏకంగా ఏడాది ముందే సభా ముఖంగా ప్రకటించడంతో అటు ఆశావహులు, ఇటు ద్వితీయ శ్రేణి నాయకుకు మింగుడుపడడం లేదు.

వైసీపీకి మూల్యం తప్పదు..
టెక్కలి నియోజకవర్గం కింజరాపు కుటుంబానికి పెట్టని కోట. అందుకే గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం హేమాహేమీలు ఎదురీదినా కింజరాపు కుటుంబం బయటపడింది. ఎమ్మెల్యేగా అచ్చెన్నాయుడు, ఎంపీగా రామ్మోహన్ నాయుడు గెలుపొందారు. ప్రస్తుతం వైసీపీ సర్కారుపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంది. ఇటువంటి సమయంలో వారికి సునాయాస విజయం తప్పదని అంతా భావిస్తున్నారు. అటు చాలావరకూ సర్వేల్లో ఇదే స్పష్టమైంది. ఇటువంటి సమయంలో వర్గ విభేదాలకు అవకాశమివ్వడంతో పాటు ఒంటెత్తు పోకడలతో వెళ్లే దువ్వాడకు టిక్కెట్ ఇస్తే అచ్చెన్నాయుడు చాలా ఈజీగా గట్టెక్కుతారని అధికార వైసీపీ నేతలే బాహటంగా వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం అచ్చెన్న మీద దూకుడు కనబరుస్తున్నాడని దువ్వాడ శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular