CM Jagan Helicopter: ఏపీ సీఎం జగన్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు . సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఓ యువకుడి ప్రాణాలను కాపాడారు. సంక్షేమ పథకాలతో ప్రజల మనసు చూరగొన్న సీఎం జగన్.. ఓ యువకుడి ప్రాణాలను కాపాడడంలో చూపిన తెగువ అందర్నీ ఆకట్టుకుంటోంది. తిరుపతిలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
గుంటూరుకు చెందిన కట్ట కృష్ణ అనే యువకుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే అతడి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి తిరుపతిలోని పద్మావతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాల్సి ఉంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడికి కృష్ణ అవయవాలు దానం చేసేందుకు అతడి కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు. అయితే గుండెను గుంటూరు నుంచి తిరుపతికి తరలించాల్సి ఉంది. రోడ్డు మార్గంలో తీసుకెళ్లాలంటే చాలా ఆలస్యం అవుతుంది. దీంతో సంబంధిత ఆసుపత్రి సిబ్బంది మల్లగుల్లాలు పడుతున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో అధికారుల ద్వారా సీఎం జగన్ విషయం తెలుసుకున్నారు. వెంటనే గుండెను తరలించేందుకు హెలిక్యాప్టర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీఎం జగన్ నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు వెంటనే హెలికాప్టర్ ఏర్పాటు చేశారు. గుంటూరు నుంచి తిరుపతికి గుండె తరలించారు. అక్కడ పద్మావతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి గుండె చేరగా.. రోగికి హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేశారు. ఓ యువకుడిని బతికించేందుకు సీఎం జగన్ చూపించిన చొరవ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తమలాంటి సాధారణ వ్యక్తి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయించడం పై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు.