Jagan And KCR- Early Elections: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అటు తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి తాము ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిస్తున్నారు. అదే సమయంలో ఏపీ సీఎం జగన్ కూడా తన చర్యల ద్వారా ముందస్తుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ముందస్తు నిర్ణయం ఉభయ రాష్ట్రాల సీఎంలది కాదని.. దాని వెనుక వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఉన్నారన్న టాక్ నడుస్తోంది. ప్రస్తుతం పీకే తెలంగాణ రాష్ట్ర సమితికి రాజకీయ వ్యూహకర్తగా ఉన్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే ఆయన సహచరుడు రుషిరాజ్ సింగ్ ఉన్నారు. పీకే ఒక టీఆర్ఎస్ కు మాత్రమే అధికారికంగా విధులు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాలకు మాత్రం తన ఐ ప్యాక్ బృందం పనిచేస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల విషయంలో స్టడీ చేసిన పీకే ముందస్తుకు వెళితేనే గట్టెక్కగలరని సీఎంలకు సూచించారట. సాచివేత ధోరణితో ముందుకెళితే మాత్రం ప్రమాద ఘంటికలు తప్పవని హెచ్చరించారట. రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై విపరీతమైన ప్రజా వ్యతిరేకత పెల్లుబికుతోందని.. ఇది ఇలాగే కొనసాగి 2024లో ఎన్నికలు అయితే మాత్రం ప్రతికూల ఫలితాలు తప్పవని సీఎంలకు బోధించారుట. మొత్తం తన ఐ ప్యాక్ బృందాన్నిమోహరించి ప్రజానాడిని పట్టానని.. మేల్కొనకుంటే మీ ఇష్టమేనంటూ తేల్చిచెప్పారు. దీంతో ఉభయ రాష్ట్రాల సీఎంలకు తత్వం బోధపడిందట. అందుకే ఇద్దరూ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
జగన్ దూకుడు…
ఏపీలో అధికార వైసీపీని తెలుగుదేశం, జనసేన పోటీగా నిలుస్తున్నాయి. టీడీపీ, జనసేన కూటమి దిశగా అడుగులేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నా కొలిక్కి రావడం లేదు. అందుకే ఇది ముందస్తుకు సరైన తరుణమని పీకే సూచించారట. అధికార పార్టీపై వ్యతిరేకత ఉన్నా దానిని క్యాష్ చేసుకునే స్థితితో లేనందున , వారికి సమయం ఇవ్వకుండా ఎన్నికల గోదాలోకి వెళ్తే సేఫ్ జోన్ లో నిలవవచ్చన్నది పీకే భావన. అదే విషయాన్ని జగన్ చెవిలో వేయడంతో ఆయన ముందస్తు ఎన్నికలకు సన్నాహాలు చేసుకుంటున్నారు. వరుసగా పార్టీ శ్రేణులతో సమావేశాలు,స్ఫష్టమైన ఆదేశాలివ్వడం, గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై ఎమ్మెల్యేలకు, మంత్రులకు వర్కుషాపు నిర్వహించడం, వచ్చే నవంబరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం వంటి వాటితో ముందస్తుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు.
Also Read: Droupadi Murmu: కొత్త రాష్ట్రపతికి పుట్టింటి కానుకగా ఏమి ఇచ్చారంటే
ఒకవేళ టీడీపీ, జనసేన కూటమి ప్రయత్నాలు కొలిక్కి రాకుంటే మాత్రం రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది. పోరు మాత్రం హోరాహోరీగా సాగనుంది. అయితే అదే సమయంలో చంద్రబాబు కూడా బాదుడే బాదుడు, మినీ మహానాడులాంటూ గత కొద్దిరోజులుగా ప్రజల్లోనే ఉంటున్నారు. పవన్ కల్యాణ్ కౌలురైతు భరోసా యాత్ర చేపడుతున్నారు. అక్టోబరు నుంచి కీలక యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. మొత్తానికి అయితే ఏపీలో మాత్రం వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
తెలంగాణలో త్రిముఖ పోటీ..
ఇక తెలంగాణ విషయానికి వస్తే కేసీఆర్ సర్కారు కూడా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇక్కడ టీఆర్ఎస్ తో కాంగ్రెస్, బీజేపీలు గట్టిగానే తలపడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ అనివార్యంగా మారింది. గతసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లి కేసీఆర్ రాజకీయంగా లాభపడ్డారు. ఈసారి కూడా ముందస్తుకు వెళ్లి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. అయితే బీజేపీ అధిష్టానం ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో తెలంగాణ పీఠం దక్కించుకోవాలని పావులు కదుపుతోంది. అటు కేంద్ర నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. దీంతో కేసీఆర్ కూడా అదే స్థాయిలో కేంద్రంపై యుద్దం ప్రకటించారు. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, అటు కేంద్ర చర్యలతో కేసీఆర్ కలత చెందుతున్నారు. ముందస్తుకు వెళ్లాలని భావిస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఎంతవరకూ సహకరిస్తుంది అన్నది ప్రశ్న. ఎందుకంటే సాధారణ ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ కు నష్టం తప్పదని కేంద్రం వద్ద సమాచారం ఉంది.తెలంగాణలో బలపడాలన్న ఆకాంక్ష ఉన్న బీజేపీ ఈ అవకాశాన్ని వదులుకునే స్థితిలో అయితే లేదు. పోనీ అసెంబ్లీని రద్దుచేస్తే వివిధ కారణాలు చూపి రాష్ట్రపతి పాలన విధించే అవకాశముందని టీఆర్ఎస్ అనుమానిస్తోంది. అందుకే దీనిపై కేసీఆర్ ఎలా ముందుకెళ్లాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. మరోవైపు వ్యూహకర్త పీకే హెచ్చరికలు పరిగణలోకి తీసుకొని ముందస్తుకు వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్నారు.
Also Read: Heavy Rains in Telangana: కుండపోత వానలు గుండెకోతను మిగుల్చుతున్నాయా?