CM Jagan 2024 Election Plan: నేనొక అద్భుతం.. మహా అద్భుతం అన్నట్టుంది ఏపీ సీఎం జగన్ వాదన. ప్రజల్లో నా గ్రాఫ్ పడిపోలేదు. ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగాలేదు. వచ్చే ఎన్నికల్లో మీ భారం మోయలేను. పనితీరు మార్చుకోకుంటే కొత్తవారికి అవకాశమిస్తాను అంటూ సీఎం జగన్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు దిగుతున్నారు. బుధవారం సాయంత్రం జరిగిన పార్టీ సమన్వయ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో పార్టీలో ఇది చర్చనీయాంశమైంది. 2024 ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ఆయన పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేశారు. ఇప్పుడున్న 151 స్థానాల్లో ఒకటి కూడ తగ్గేందుకు వీల్లేదని హెచ్చరిస్తూనే అసలు 175 స్థానాలు ఎందుకు రాకూడదని తిరిగి ప్రశ్న వేశారు. పార్టీ అధ్యక్షునిగా నా గ్రాఫ్ 65 శాతం ఉంది. మీ గ్రాఫ్ 40 నుంచి 45 శాతంలోపే ఉంది. దీనిని సరిదిద్దుకోండి. గ్రాఫ్‌ను పెంచుకోండి.
సర్వే ఆధారంగానే ఎమ్మెల్యే టికెట్లు దక్కుతాయని స్పష్టం చేశారు. ఓడిపోయే వారికి టికెట్లు ఇచ్చేది లేదు అంటూ తేల్చిచెప్పారు. చాలా మంది ఎమ్మెల్యేల గ్రాఫ్ ఏమాత్రం బాగోలేదు. వీళ్లకు ఆరునెలలు, తొమ్మిది నెలలు సమయం ఇస్తున్నా. ఆలోగా వారు ప్రజల్లో పర్యటించి గ్రాఫ్ పెంచుకోవాలని సూచించారు.పనితీరు మార్చుకోని, ఓడిపోయే ఎమ్మెల్యేలను జగన్ పార్టీకి బరువుగా అభివర్ణించారు. వారి బరువు మోయలేనన్నారు. వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదన్నారు. అధికారంలోనికి వచ్చాక.. వారికి ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పదవులు ఇస్తానని కూడా చెప్పుకొచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చాక సైక్లింగ్ పద్ధతిలో జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వకర్తలు 25 మంది మళ్లీ మంత్రులవుతారని జగన్ వెల్లడించారు.
Also Read: Virat Kohli: కోహ్లీ పని అయిపోయిందా? ఇక వైదొలగాల్సిందేనా?
మంత్రులు రెండు రోజులు మాత్రమే తమ శాఖల బాధ్యతలను చూడాలని.. మిగిలిన ఐదు రోజులు నియోజకవర్గాల్లో పర్యటించాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు రోజుకు రెండు, మూడు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలని ఆదేశించారు. తాను కూడా త్వరలోనే.. సచివాలయాలను సందర్శిస్తానని, జిల్లాల్లో పర్యటిస్తానని జగన్ వెల్లడించారు. మే రెండో తేదీ నుంచి ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించాలన్నారు. దీనిపై కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమయం తక్కువగా ఉన్నందున మే పదోతేదీ నుంచి ప్రారంభి స్తే బాగుంటుందని తెలిపారు. అందుకు సీఎం అంగీకరించారు.
ఇటీవల పరిణామాలపై ఆగ్రహం
ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలపై జగన్ ఆగ్రహంగా ఉన్నారు. ఎవరికైనా పార్టీయే సుప్రీమ్ అన్నారు. కట్టుదాటితే ఎంతటివారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. నేతల మధ్య విభేదాలను సహించేది లేదన్నారు. మీ వ్యక్తిగత వైషమ్యాలను పార్టీపై రుద్దితే మాత్రం క్రమశిక్షణా చర్యలకు వెనుకడబోనని తేల్చి చెప్పారు. అయితే ఇది పార్టీ నేతల్లో చర్చనీయాంశమైంది. అసలు సీఎం జగన్ లో మునపటి ధీమా లోపించడంపై వారు ఆందోళన చెందుతున్నారు. కొద్దిమంది మంత్రులను తప్పించడం, మరికొందర్ని కొనసాగించడం, పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారని పరిగణలోకి తీసుకోకపోవడం తదితర కారణాలతో ప్రతీ జిల్లాలో అసంత్రుప్తి జ్వాలలు ఎగసిపడ్డాయి. నేతలు ఎవరూ బయటపడరని సీఎం ఊహించారు. కానీ అందుకు భిన్నంగా నేతలు, వారి అనుచరులు రోడ్డుపైకి వచ్చారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు లాంటి వారైతే హింసావాదం తప్పదని హెచ్చరించారు. దెబ్బకు దెబ్బ తప్పదని హెచ్చరికలు పంపారు. ఈ నేపథ్యంలో పార్టీ లైన్ ను నేతలు దాటుడుతుండడంతో ఇన్నాళ్లూ లేని సమన్వయ కమిటీ సమావేశాన్ని జగన్ అదరాబాదరగా ఏర్పాటుచేశారు. నేతలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
ప్రత్యామ్నాయంగా కొత్త నాయకత్వం
ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని.. ఇదే పరిస్థితి కొనసాగితే మార్చేస్తానని సీఎం చేసిన హెచ్చరికల వెనుక చాలా కథ నడుస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎక్కడికక్కడే ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయంగా నాయకత్వాన్ని గుర్తించారన్న వాదన వినిపిస్తోంది. గొల్ల బాబూరావు ఎపిసోడ్ నే తీసుకుందాం. ఆయనకు మంత్రి పదవి దక్కలేదన్న బాధ కంటే వచ్చే ఎన్నికల్లో తనను తప్పించి చెంగల వెంకటరావుకు పోటీలో దింపుతారన్న బాధే అధికం. అందుకే ఆయన అధిష్టానం తీరుపై కుతకుత ఉడికిపోతున్నారు. బాబూరావు ఒక్కరే కాదు.. దాదాపు 50 మంది ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయంగా నేతలను గుర్తించారని వైసీపీలో టాక్ నడుస్తోంది. అందుకే సీఎం నోటి నుంచి తరచూ మార్చేస్తానన్న మాట వినిపిస్తోంది. మరోవైపు చాలా మంది తాజా మాజీ మంత్రుల మెడకు పార్టీ బాధ్యతలను బలవంతంగా కట్టబెట్టారు. వారు బాధ్యతలు స్వీకరించేందుకు ఏ మాత్రం సుముఖంగా లేరు. కానీ వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే 25 మంది పార్టీ అధ్యక్షులను తిరిగి మంత్రులను చేస్తానని ప్రకటించడం ద్వారా వారిపై సీఎం జగన్ ఒత్తిడి పెంచుతున్నారు. అంతటితో ఆగకుండా వైసీసీ జిల్లా అధ్యక్షులకు జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్ పదవులు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. వారికి కేబినెట్ హోదా కల్పిస్తూ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పుకొచ్చారు. మొత్తానికి నా గ్రాఫ్ బాగుంది.. ప్రభుత్వ గ్రాఫ్ నకు తిరుగులేదంటూనే మీరు కష్టపడండి అంటూ జగన్ హితబోధ చేయడం వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది.
Also Read:Best Cars in India: భారత కార్ల పరిశ్రమలో మరుపురాని పది పాపులర్ కార్లు ఇవీ
Recommended Videos: