Cloud Seeding: ప్రభుత్వాలు పెట్టుబడి పెడితే.. తద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరాలని, ఆదాయం రావాలని, పర్యాటకులను ఆకర్షించాలి అని భావిస్తాయి. ఈమేరకు ప్రణాళిక రూపొందిస్తాయి. బడ్జెట్ అంచనా వేస్తాయి. పనులు చేపట్టే కాంట్రాక్టర్/ఏజెన్సీ పనితీరు తెలుసుకుంటారు. తర్వాతే ముందుకు వెళ్తారు. అయితే ఢిల్లీ ప్రభుత్వం ఇవన్నీ చేసింది. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. కానీ ఫలితం మాత్రం తీవ్ర నిరాశపర్చింది. పెట్టుబడి అంతా ఆకాశంలో పోసిన పన్నీరైంది. కొన్నేళ్లుగా కాలుష్యంతో దేశ రాజధాని శీతాకాలంలో కాలుష్యంతో సతమతమవుతోంది. ప్రజలు వ్యాధులుబారిన పడుతున్నారు. దీంతో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం రూ.3.2 కోట్లతో క్లౌడ్ సీడింగ్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఐఐటీ కాన్పూర్ సహకారంతో మూడు ట్రయల్స్ నిర్వహించారు. అయితే, ఒక్క చుక్క వర్షం కూడా రాలేదు. అక్కడి వాతావరణంలో తక్కువ మేఘాల తేమ (10–20%) ఉన్న కారణంగా ఈ ప్రయోగం విఫలమైంది. సాధారణంగా క్లౌడ్ సీడింగ్‌కు 50% పైగా తేమ అవసరం అని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
భారీ ఖర్చు.. జీరో రిజల్ట్..
ప్రతి ట్రయల్‌కి సాధారణంగా రూ.35–64 లక్షలు ఖర్చు అయ్యింది. మొత్తం 9 ట్రయల్స్ కోసం రూ.3.21 కోట్లు కేటాయించింది ఢిల్లీ ప్రభుత్వం. ఇది విఫలమైనా ఇంకా మరో ప్రయోగాల కోసం ప్రణాళికలు కొనసాగడం విమర్శలకు దారితీస్తోంది. ఖర్చు చేసినప్పటికీ, ఎలాంటి వర్షం లేకపోవడం నిరాసక్తత కలిగించింది. పరిశోధన సంస్థలు ఈ విధానం తాత్కాలికమే అని స్పష్టం చేశాయి. వర్షం కురిస్తే చిన్నకాలం కాలుష్యం తగ్గొచ్చు, కానీ మళ్లీ రెండు రోజుల్లో కలుషిత స్థాయి పెరుగుతుంది. ఇందులో పెట్టుబడి పెడితే, అసలు కాలుష్య మూలాలను పరిష్కరించేందుకు దృష్టి దూరమవుతుందని పేర్కొంటున్నారు.
ప్రభుత్వ వ్యూహంలో రాజకీయ ఆధిపత్యం ఎక్కువగా కనిపిస్తోంది. ఢిల్లీ కాలుష్యానికి క్రమంగా పరిష్కారం లభించాలంటే, వాస్తవికంగా ప్రాథమిక కాలుష్య మూలాలపై దష్టిసారించాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. అంతిమంగా, కృత్రిమ వర్ష ప్రయోగాలు ఢిల్లీ కాలుష్యాన్ని తరచూ తగ్గించలేకపోవడం ఖర్చుతో కూడుకున్న ఆశప్రయత్నంగా మిగిలింది.