ఎమ్మెల్యేల బలంతో అధికార పార్టీ వైసీపీ.. ప్రభుత్వ తప్పిదాలంటూ టీడీపీ.. కేంద్రం సాయంతో అభివ్రుద్ధి పేరుతో బీజేపీ-జనసేనలు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల బరిలో దిగబోతున్నాయి. ఎవరికి వారే పక్కా వ్యూహంతో ఈ స్థానంలో పాగా వేయాలని ఊవ్విళ్లూరుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నిర్వహిస్తున్న మొదటి ఉప ఎన్నిక.. ఇక్కడ వైసీపీ గెలిస్తే ప్రభుత్వంపై ప్రజలు ఇంకా నమ్మకం పెట్టుకున్నారని.. ఇతర పార్టీలు గెలిస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందని తెలిసే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంటున్నారు.
Also Read: తిరుపతిలో దుబ్బాక ఫలితం వస్తుందా..?
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికపై సర్వత్రా ఆసక్తి రేపుతోంది. అంతకుముందున్న వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా వెలువడలేదు. కానీ అధికార వైసీపీతో పాటు టీడీపీ తమ అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసేసింది. టీడీపీ తరుపున మాజీ మంత్రి పనబాక లక్ష్మీ పేరు తెలపగా వైసీపీ తరుపున ఫిజీయోథెరఫిస్టు గురుమూర్తిని బరిలో ఉంచారు. ఇక జనసేన, బీజేపీలు కలిసి ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టనున్నారు. టీడీపీలో మంత్రిగా పనిచేసిన రావెల కిషోర్ బాబు పేరును ప్రకటిస్తారని అనుకుంటున్నారు.
తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలున్నాయి. దీంతో వైసీపీ అభ్యర్థి గురుమూర్తిని ఎలాగైనా గెలిపించుకోవచ్చని ఆ పార్టీ భావిస్తోంది. బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి టికెట్ ఇస్తారని భావించారు. కానీ పలు సమీకరణాల తరువాత గురుమూర్తి పేరును ప్రకటించారు. జగన్ పాదయాత్ర సమయంలో గురుమూర్తి ఆయన వెన్నంటూ ఉంటూ వైద్యం చేశారు. దీంతో ఆయనకు ఇప్పుడు అవకాశం ఇచ్చారు. అయితే టీడీపీ తరుపున బరిలో ఉన్న పనబాక లక్ష్మీ గతంలో గట్టి పోటీనిచ్చింది.
Also Read: కేసీఆర్ వరాలు సరే.. అమలుపైనే అనుమానం
ఈసారి కూడా టీడీపీ పనబాక లక్ష్మీకే టికెట్ కేటాయించడంతో ఈసారి ఎలాగైనా గెలిచి తీరుతామని టీడీపీ లెక్కలేసుకుంటోంది. ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేస్తూ తాము ప్రజల్లోకి వెళుతామంటున్నారు. ఇప్పటి వరకు జగన్ పాలనలో చేసిన తప్పిదాలు,ఆలయాలపై దాడుల విషయంలో పట్టించుకోకపోవడం లాంటి ప్రచారంతో జనంలోకి వెళ్లాలని భావిస్తున్నారు.
ఇక బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రావెల కిషోర్ ను బరిలో దింపేందుకు ప్లాన్ వేస్తున్నారు. టీడీపీ, వైసీపీలు తిరుపతికి చేసిందేమీ లేదని, కేంద్రంలో ఉన్న బీజేపీతో అభివ్రుద్ధి చేస్తామని ఆ పార్టీల నాయకులు ఇప్పటికే పలుచోట్ల సమావేశాలు పెడుతున్నారు. కాగా నోటిఫికేషన్ వెలువడకముందే ఆయా పార్టీల దూకుడు చూస్తే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్