ప్రభుత్వం అప్పుల కోసం విదేశీ సంస్థల చుట్టు తిరుగుతున్న అంశంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో విదేశీ సంస్థల నుంచి అప్పు తీసుకుంటే తప్పేంటని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం విదేశీ సంస్థల నుంచి అప్పు పొందేందుకు కేంద్రాన్ని గ్యారంటీ ఉండాలని కోరినట్లు చెప్పారు. అప్పు ఇచ్చె అమెరికా సంస్థ పేరును మాత్రం ఆయన వెల్లడించేందుకు నిరాకరించారు. గత ప్రభుత్వం రూ.44 వేల కోట్లు బిల్లులు పెండింగ్ పెట్టిందని, డిస్కంలకు రూ.22 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని.. మరి అప్పు తీసుకోకుండా ఎలా చెల్లించాలని టిడిపి నేతలను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిపై మాజీ మంత్రి యనమల చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన అమెరికాలోని ప్రవేటు ట్రస్ట్ పేరు సిఐజి క్యాప్ (CIG CAP)గా విశ్వసనీయంగా తెలిసింది. ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి 9 వేల కోట్ల డాలర్లు అప్పగా ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ మెత్తాన్ని 40 ఏళ్లలోగా 4 శాతం వడ్డీతో తిరిగి చెల్లించడం, కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చే విషయంలో సంస్థ షరతులు విధించింది. ఆర్ధిక వనరుల సమీకరణలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇది సువర్ణావకాశంగానే కనిపించింది. దీంతో ఎలాగైనా ఈ ప్రవేటు ట్రస్టు నుంచి అప్పు పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వాస్తవానికి ఈ సంస్థ వివిధ ప్రాజెక్టులను గతంలో చేపట్టినా ఎప్పడూ ఇంత పెద్దమొత్తంలో పెట్టబడి పెట్టిన దాఖలాలు లేవని ఆర్ధిక నిఫుణులు చెబుతున్నారు. ఇతర సంస్థలకు చిన్న మొత్తంలో తప్ప ఇంత పెద్ద మొత్తంలో ఇవ్వలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో సంస్థ ఆఫర్ పై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
విదేశీ సంస్థల నుంచి అప్పు తీసుకునే సమయంలో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉండటంతో కేంద్రం విదేశీ సంస్థల అప్పులను ప్రోత్సహించడం లేదు. స్వదేశీ బ్యాంకులు, ఇతర సంస్థల నుంచే అప్పులు తీసుకోవాలని సూచిస్తుంది. విదేశీ సంస్థ వద్ద అప్పు తీసుకుంటే డాలర్ల రూపంలో అప్పు ఇస్తారు.. డాలర్ల రూపంలోనే చెల్లించాలి. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ క్షీణిస్తూ పోతుంది. దీని వల్ల అప్పు చెల్లించే సమయంలో రూపాయి విలువ మరింత తగ్గితే ఆ భారం మరింత పెద్దమొత్తంగా మారే అవకాశం ఉంది. స్వదేశీ సంస్థల వద్ద అప్పు తీసుకుంటే ఈ సమస్య ఉండదు. డాలర్ కు రూపాయి విలువతో సంబంధం ఉండదు.
రాష్ట్రానికి భారీ మొత్తంలో అప్పు ఆఫర్ ఇచ్చిన ట్రస్ట్..
ప్రస్తుత పరిస్థితుల్లో అధిక మొత్తంలో అప్పులు చేయడం వల్ల భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పేలా కనిపించడం లేదు. గత ఏడాది సంక్షేమ పథకాల కోసం రాష్ట్ర పభుత్వం రూ.42,603 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది ఇందుకు కోసం అంత కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంది. కరోనా వైరస్ ఉధృతి కారణంగా ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం బాగా తగ్గిపోయింది. మరోవైపు కేంద్ర ఆర్ధిక పరిస్థితి ఇదే విధంగా ఉండటంతో కేంద్ర సాయం ఆశించే పరిస్థితి లేదు. ప్రభుత్వం అప్పు తెచ్చినా సంక్షేమ పథకాల కోసమే ఖర్చే చేయాల్సి వస్తే ఏ విధమైన ప్రయోజనం ఉండదని అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.